ప్రపంచ రాజకీయాల్లో మార్పులు మొదలవుతున్నాయి. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, ఇజ్రాయల్ – పాలస్తీనా అల్లర్లు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాంది పలుకుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు ఒకవైపు, చైనా, రష్యా మరోవైపు కూటములుగా ఏర్పడుతున్నాయి.
రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ తొలి విదేశీ పర్యటన చైనాతో ప్రారంభిస్తున్నారు. మే నెల 16, 17 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగశాఖ ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల్లో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి కాగా రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పుతిన్ సమావేశం అవుతారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతవారమే ఐరోపాలో అయిదు రోజుల పర్యటన ముగించుకొని వచ్చారు.
ఐరోపాలో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగరీలనూ జిన్‌సింగ్ సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలు, యుద్ధానికీ ఉపకరించే సాధనాలను సరఫరా చేయబోమని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.
ఇరాన్.. ఇజ్రాయల్ కు వార్నింగ్ ఇవ్వటం… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ దూకురావటం ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే అంశాలు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా చైనా దోస్తీ బలోపేతం అవుతే పశ్చిమ దేశాలకు కంట్లో నలుసులా మారుతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
-దేశవేని భాస్కర్