Saturday, January 18, 2025
HomeTrending Newsయుద్ధం ముంగిట్లో ఐరోపా ఖండం

యుద్ధం ముంగిట్లో ఐరోపా ఖండం

ఐరోపా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యాను దారిలోకి తెచ్చేందుకు పాశ్చాత్య దేశాలు వేస్తున్న ఎత్తుగడలతో ఇప్పటికే అనేక దేశాలు ఆర్థికంగా చితికి పోయాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వార్థం కోసం రష్యాను ఏకాకి చేయాలని కుట్రలు చేసినా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ దీటుగా ఎదుర్కొంటున్నారు.

నాటో సభ్య దేశాల కూటమి ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక బలగాలను పంపాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ తాజాగా సూచించారు. ఈ సూచనను అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, ఇతర దేశాలు తిరస్కరించాయి. మేక్రాన్‌ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని పుతిన్‌ ఘాటుగా స్పందించారు.

ఉక్రెయిన్ కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోమారు హెచ్చరికలు జారీచేశారు. నాటో సైనిక బలగాలను ఉక్రెయిన్‌ కు పంపితే అణుయుద్ధం తప్పదని  హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల్లో ఏ ప్రాంతాన్నైనా టార్గెట్‌ చేసే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని గురువారం రష్యా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ పుతిన్‌ వ్యాఖ్యలు చేశారు. రష్యాను బలహీనపరిచేందుకు పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

అమెరికా, నాటో దేశాల విధానాలతో రష్యా.. చైనాకు చేరువవుతోంది. ఆర్థికంగా, సైనికపరంగా బలంగా ఉన్న చైనా మూడో ప్రపంచ దేశాలకు సాయం పేరుతో ఆయా దేశాల వనరులు కొల్లగొడుతోంది. ఇందుకు ఉదాహరణే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కెన్యా, జింబాబ్వేలతో పాటు లాటిన్ అమెరికా దేశాలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. చైనా విధానాలతో విసుగెత్తిన ఇటలి ఆ దేశంతో ఉన్న వ్యాపార వాణిజ్య ఒప్పందాల్ని పునఃసమీక్షించి బయటకు వస్తోంది.

ఈ తరుణంలో ఐరోపా దేశాలు రష్యాను రెచ్చగొడితే విపరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. మళ్ళీ ప్రచ్చన్న యుద్ద కాలం రాబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా, ఐరోపా దేశాల ఏకధ్రువ ప్రపంచం మేలు చేయకపోగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధికంగా కీడు జరిగే అవకాశం ఉంది. 2022 ఫిబ్రవరిలో రష్యాతో జరిగిన యుద్దంలో ఉక్రెయిన్ ను రెచ్చగొట్టిన పాశ్చాత్య దేశాలు సమిధను చేశాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ గురించి పట్టించుకోవటం మానేశాయి.

రష్యాలో ప్రతిపక్ష నేత నావల్ని మృతి తర్వాత పాశ్చాత్య దేశాలు పుతిన్ పై మరింత కసితో ఉన్నాయి. రష్యా అధ్యక్షుడిని నిలువరించేందుకు ఆర్ధిక ఆంక్షలు విధించినా ఫలితం లేకపోవటంతో.. ప్రత్యక్ష యుద్ధం కోసం పావులు కదుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నిక వచ్చే నెలలో(ఏప్రిల్) జరగనుంది. అధికారికంగా ఆ కార్యక్రమం పూర్తికాగానే ఉహించని కార్యాచరణకు పుతిన్ దిగే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదే నిజమైతే ప్రపంచం ముంగిట్లోకి మరో యుద్ధం వచ్చినట్టే.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్