రష్యాలో కొత్త సమస్య వచ్చి పడింది. అత్యల్ప జననాల రేటు ఆ దేశ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ముఖ్యంగా పురుష జనాభా తగ్గటం…నష్ట నివారణ చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. జనాభా పెంచడానికి మహిళలు నడుంబిగించాలని అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. కనీసం ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు.
మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి పుతిన్ మాట్లాడుతూ ‘పాత కాలంలో మనవాళ్లు ఏడెనిమిది మంది పిల్లలను కనేవాళ్లు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని మరిచిపోయామని, మన తాతలను చూసి మనం నేర్చుకోవాలి. వాళ్లలాగే ప్రస్తుత తరంవాళ్లు ఏడెనిమిది మంది పిల్లలను కనాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం బలపడటమే కాకుండా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది’ అని పేర్కొన్నారు.
సోవియెట్ యూనియన్ పతనం నాటి నుంచే రష్యాలో జనాభా తగ్గుదల ప్రారంభం అయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా దాదాపు 3 లక్షల మందిని కోల్పోయినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. యుద్ధం ప్రకటించాక రష్యా నుంచి ఎనిమిది లక్షల మంది యువత ఐరోపా దేశాలకు వెళ్ళారని సమాచారం. కొవిడ్ బారినపడి దాదాపు 7 లక్షల మంది తుడిచిపెట్టుకుపోయారు. రష్యాలో పురుషుల జీవితకాలం 66 ఏళ్లుగా ఉండగా మహిళల జీవితకాలం 77 ఏళ్లుగా ఉంది. 2050 నాటికి ప్రస్తుతమున్న 143 మిలియన్ల నుండి 111 మిలియన్లకు క్షీణిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాగా ఉంది.
ప్రభుత్వం జనాభా వృద్ధి కోసం మహిళలకు కనిష్ఠ సంతానోత్పత్తి రేటును 2.1గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది 1.5గా మాత్రమే ఉందట. ప్రత్యేకించి తూర్పు రష్యాలో జనాభా క్రమంగా తగ్గుతున్నది. రష్యాలో ఆల్కహాల్ సంబంధిత మరణాలు చాలా ఎక్కువగా ఉండటం ఒక కారణం. సంతాన సాఫల్య రేటు తక్కువగా ఉండటమనేది దీనికి ఒక కారణం. ఆర్థికంగా నిలకడ లేకపోవటంతో మహిళలు అధిక సంతానంపై ఆసక్తి కనపరచటం లేదు.
మొదటి, రెండో ప్రపంచ యుద్ద కాలంలో కూడా రష్యా ఇదే సమస్య ఎదుర్కొంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంతో అదే పునరావృతం అవుతోంది. దీనికి పరిష్కారంగా రష్యా ఇప్పటికే నేపాల్, భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సుడాన్, కెన్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి యువతను సైన్యంలోకి ఆహ్వానిస్తోంది. సైన్యంలో శిక్షణ తర్వాత రెండు లక్షల రూబుల్స్, అదిక వేతనం, ఏడాది విధులు నిర్వహించాక పౌరసత్వం కూడా ఇస్తున్నారు. దీంతో మూడో ప్రపంచ దేశాలకు చెందిన యువత రష్యా వెళుతున్నారు.
ముఖ్యంగా నేపాల్ నుంచి గుర్ఖాలు వేల సంఖ్యలో మాస్కో బాట పట్టారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్దంలో వీరు రష్యా తరపున పోరాటం చేస్తున్నారు. స్వదేశంలో నిర్యుద్యోగం, భారత్ లో అగ్నిపథ్ పథకంతో పూర్తికాల విధులకు అవకాశం లేకపోవటంతో నేపాలి యువత రష్యా సైన్యంలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. తాలిబన్ అధికారంలోకి రావటంతో ఆఫ్ఘన్ మాజీ సైనికులు, పోలీసులు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిని వాగ్నర్ లో చేర్చుకుంటున్నారు.
కరోనా తర్వాత జనాభా క్షీణతను అరికట్టేందుకు వ్లాదిమిర్ పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్ అని పేరు పెట్టారు. ఈ పథకం కింద 10 మంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయితే 10 మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి. పదో బిడ్డకు మొదటి పుట్టినరోజునాటికి 1 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు.
ఇప్పటికే భారత్ నుంచి వెళ్ళిన యువత రష్యా యువతులను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడటం క్రమంగా అధికం అవుతోంది. భవిష్యత్తులో మూడో ప్రపంచ దేశాల నుంచి ఉన్నత విద్య పూర్తి చేసినవారికి వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చేందుకు పుతిన్ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి సమాలోచనలు జరుగుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
-దేశవేని భాస్కర్