Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాపీకి దక్కిన గౌరవం

కాపీకి దక్కిన గౌరవం

Copy Cats: ఇంగ్లీషులో అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే…వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను కూడా పూర్తి చేయలేం.

ఎప్పుడయినా, ఎవరికయినా గుర్తింపు ముఖ్యం. ప్రశంస, అభినందన, సన్మానం, పదోన్నతి, నగదు బహుమతి, బిరుదు ప్రదానం…అన్నీ గుర్తింపులో ప్రధానమే.

అవార్డులు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రయివేటు అవార్డులు గ్రహించడానికి (గ్రహించడం మాటకు వ్యుత్పత్తి అర్థం ‘తీసుకోవడం’ అనే పాజిటివ్ మీనింగ్ తో పాటు ‘లాక్కోవడం’ అనే నెగటివ్ మీనింగ్ ఉండడం ఇక్కడ అనవసరం) అర్హతలు ఏమిటి? పనిచేస్తే వాటంతటవే వచ్చే అవార్డులు; పైరవీలు చేసుకుంటే వచ్చే అవార్డులు; డబ్బు ఖర్చు పెట్టుకుంటే వచ్చే అవార్డులు; భావజాల అవార్డులు, రాజకీయ అవార్డులు; సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని కొన్ని విద్యలతో తెచ్చుకునే అవార్డులు…ఇలా అవార్డుల స్వరూప స్వభావాలు, వాటిని పొందే పద్ధతుల మీద అవార్డుల కోసం ప్రయత్నించేవారికి జ్ఞానం ఉన్నట్లే ఆయా అవార్డులు వారికి ఎలా వచ్చాయో అన్న స్పష్టత లోకానికి కూడా ఉంటుంది.

అవార్డులు ఎంతో విలువయినవి. అందువల్ల చాలా సార్లు అవార్డులకు విలువ చెల్లిస్తూ ఉంటారు. ఇంతకంటే లోతుగా వెళ్లడం భావ్యం కాదు.

బిరుదులు ఒకరు ఇవ్వకపోయినా మనకు మనమే పెట్టేసుకోవచ్చు. ఇంటిపేరు కంటే ఘనంగా వాటిని ముందు తగిలించుకోవచ్చు. కీర్తి కిరీటాలు, భుజ కీర్తులు, ముంజేతి కంకణాలు, పాదుకా పట్టాభిషేకాలు, గజమాలలు, దుశ్శాలువలు, గజారోహణలు, సన్మాన పత్రాలు, పుష్పాభిషేకాలు అనాదిగా ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ఇందులో అక్కడక్కడా స్వరూపం మారుతుంది కానీ…స్వభావం మాత్రం మారదు.

గౌరవ డాక్టర్లు పెరిగే సరికి అసలు డాక్టర్లు తమను తాము ఎలా పిలుచుకోవాలో మరిచిపోయారు.

ఈమధ్య కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం తెలుగు వ్యక్తికి వచ్చింది. కడప జిల్లాకు చెందిన ఆయన కవితల్లో ఒక్కొక్కటి దేనికి కాపీనో నిరూపిస్తూ రచయితలు సామాజిక మాధ్యమాల్లో ఒక ఆట ఆడుకున్నారు. ఏకంగా శ్రీ శ్రీ కవితను, ఛందస్సును కాపీ కొట్టినా అవార్డు ఎంపిక కమిటీలో సాహితీవేత్తలు కళ్లు మూసుకున్నారా? అని దులిపి పారేస్తున్నారు. ప్రస్తుత కమిటీ కొలువుదీరే నాటికే అవార్డు ఎంపిక అయిపోయినట్లు ఏదో వివరణ ఇచ్చుకున్నారు కానీ…అది సరయిన సమర్థన అవ్వదు.

వెనుకటికి ఇలాగే ఎవరో కాళిదాసు కావ్యంలో కొంతభాగాన్ని ఎత్తి రాసి…తానే రాసినట్లు ప్రచారం చేసుకున్నాడు. కాళిదాసు కావ్యం చదవనివారు నిజమని నమ్మారు. చివరకు రెండూ చదివిన ఒక పండితుడు రాజుకు ఫిర్యాదు చేస్తాడు. నిజనిర్ధారణకు పండితుల పరిషత్తును ఏర్పాటు చేస్తారు. కాళిదాసు కావ్యంలో సగభాగం యథాతథంగా ఎత్తిరాశాడని పండిత పరిషత్తు తేలుస్తుంది. ఆ రోజుల్లో ఈ నేరానికి రాసిన చేయి నరకడమే శిక్ష. శిక్ష ఖరారు అయ్యాక…కాళిదాసుకు విషయాన్ని విన్నవిస్తారు. అప్పుడు కాళిదాసు శిక్షించవద్దని సున్నితంగా చెబుతాడు. “అతడికి నా రచన ఎంతగానో నచ్చితేనే కదా కాపీ కొడతాడు! అది నాకు గౌరవమే. ఆనందదాయకమే. కాబట్టి క్షమిస్తున్నాను” అంటాడు. వెంటనే కాపీ రచయిత కాళిదాసు కాళ్ల మీద పడి…ఇంకెప్పుడూ ఎవరి రచనలను కాపీ కొట్టను అని మారిన మనిషిగా సభ నుండి వెళ్లిపోతాడు. దాదాపుగా ఇదే సన్నివేశాన్ని అక్కినేని నటించిన మహాకవి కాళిదాసులో కూడా పెట్టారు.

అలా శ్రీ శ్రీ కూడా ఈ యువపురస్కార గ్రహీతను అర్థం చేసుకునే ఉంటాడు. మనలో మనమాట- శ్రీశ్రీని కాక ఎవరిని కాపీ కొడతాం? “జాతిజనులు పాడుకునే నా గీతం” అని శ్రీశ్రీనే తన గీతాలను జాతీయం చేశాడు కదా! జాతి యావదాస్తిని ఒకానొక రచయిత నాలుగు లైన్లు వాడుకుని తన పేరు పెట్టుకుంటే…మరీ ఇంతగా గుండెలు బాదుకోవాలా?
కలికాలం కాకపొతే!

అసలే తెలుగు కనుమరుగవుతున్న వేళ…ఒకానొక రచయిత ఎక్కడెక్కడివో ఎత్తి రాస్తే…అభినందించాల్సింది పోయి…ఆడిపోసుకుంటారా?

భూతమ్ నా బందమ్
స్వర్గం నా గృహమ్
నేను రాసేదే పద్యమ్
నేనే పాడేదే కావ్యమ్  
గిరులు, సాగరులు
నదులు, సెలయేర్లు లోకాలు, శోకాలు ఇవే నాకు అష్టైశ్వ్యష్టై శ్వ్యర్యాలు ఋషులే నా నేస్తాలు దైవాలే నా సహోదరులు కిన్నె రులు, కింపురుషులు నా తోటి ప్రయాణికులే నా వాక్కే కర్ణ కఠోరం నా బాటే అనితర సాధ్యం నా మార్గమే స్వర్గ నరక అతీత ద్వారం నేనొక దుర్గంధ సుగంధం నాచూపు మహోద్రేకం”

“భూతాన్ని , యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం
అనల వేదికముందు అస్ర నైవేద్యం!

లోకాలు , భవభూతి శ్లోకాలు
పరమేష్ఠి జూకాల నా మహోద్రేకాలు
నా ఊహ చాంపేయ మాల
రసరాజ్య డోల
నా ఊళ కేదార గౌళ !

గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు
ఝరులు నా సోదరులు
నేనొక దుర్గం
నాదొక స్వర్గం
అనర్గళం, అనితర సాధ్యం , నామార్గం .

మొదటిది అవార్డు పొందిన రచయితది. రెండోది అవార్డు పొందని శ్రీశ్రీది. ఇంకా చాలా ఉన్నాయి కానీ…జాతిజనుల మానసిక, శారీరక ఆరోగ్యాల దృష్ట్యా ప్రస్తావించడం కుదరదు. పెద్ద మనసుతో మన్నించగలరు!

అదే కడప జిల్లా “సరస్వతీ పుత్రుడు” పుట్టపర్తి నారాయణాచార్యులు జ్ఞానపీఠం దగ్గరిదాకా వెళ్లారు. ఆయనకు రాని ఇతరేతర విద్యల వల్ల ఆ అవార్డు రాలేదు. సభా మర్యాద దృష్ట్యా అవన్నీ ఇక్కడ అనవసరం. ఆ నిర్వేదంలో ఆయన అప్పుడన్న మాట-
“పొనీలేరా ! అవార్డు రాకపోవడం వల్ల నా విలువ పెరిగిందనుకుంటా…”
నిజంగానే పుట్టపర్తికి సరితూగగలిగే అవార్డులు లేవన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

కేంద్ర సాహిత్య అకాడెమీ తాజా యువ పురస్కారం చూశాక కొన్ని ప్రమాణాలు ఉన్నాయని మనకు మనం ఇలా అనుకోవచ్చు.
1. కాపీ కొట్టినా…కొట్టినట్లు స్పష్టంగా తెలియాలి.
2. లోకంలో ఎవరికీ తెలియని వాటిని కాపీ కొట్టకూడదు. అందరికీ బాగా తెలిసినవాటినే కాపీ కొట్టాలి.
3. ఇది ఫలానా వారిది కదా? కాపీ కొట్టారేమిటి? అని లోకం అనే మాటలను అస్సలు పట్టించుకోకూడదు.
4. కాపీ పుస్తకాలను అవార్డులకు, పి హెచ్ డి పట్టాలకు, పత్రికలకు పంపడానికి అస్సలు మొహమాటపడకూడదు.
5. “అసలు ఈ లోకమే బ్రహ్మ సృష్టికి ఒక కాపీ. నకలు. నిజం కాదు. లోకం అక్షరాలా మిథ్య. అలాంటప్పుడు శ్రీశ్రీ అయినా, దేవులపల్లి అయినా నిజం కాదు. వారి రాతలే ఒక కాపీ. ఆ కాపీకి మరొకటి కాపీ ఎలా అవుతుంది?” అని నిశ్చల చిత్తంతో, నిర్మల వేదాంత నిర్వికార కాపీ జ్ఞానంతో తొణకక బెణకక మౌనంగా ఉండాలి.
6. కేంద్రం కాపీ జ్ఞానాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహించి జ్ఞానపీఠాలను విరివిగా, ఉదారంగా పంచిపెట్టే విషయాన్ని తేల్చడానికి తక్షణం ఉభయ సభల సంయుక్త ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలి.

7. రచనల్లో కాపీ కేటగిరీ పుస్తకాల ముద్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ నిధులను ప్రత్యేక గ్రాంటుగా కాపీ రచయితల ఇళ్లకెళ్లి ఇవ్వాలి.
8. కాఫీ తాగినంత అలవోకగా కాపీ రచనలు చేసే రచయితలకు ఇరుగుపొరుగువారు, ఇంటివారు వేళకింత కాఫీ ఇస్తూ ఉండాలి.
9. ఏది దేనికి కాపీనో కనిపెట్టి సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయే విమర్శకులను ఉపా ఉప్మా పూరీ దోసె లాంటి చిత్రాతి చిత్రమయిన కఠిన చట్టాల కిందకు తెచ్చి లోపలేసి…బెయిలుకు అవకాశం లేకుండా చేసి…కాపీ రచయితల స్వేచ్ఛను, వారి మౌలికమయిన రాజ్యాంగం ప్రసాదించిన కాపీ కొట్టే ప్రాథమిక హక్కును కాపాడాలి!

మొదటి డిస్ క్లైమర్:-
అంత స్పష్టంగా దుర్గంధ సుగంధ వాక్కును కర్ణ కఠోరంగా రాసి వినిపిస్తుంటే…శ్రీశ్రీకి కాపీ అని దుమ్మెత్తిపోయడం…దుమ్ము వృథా తప్ప…భావ్యం కాదు.

రెండో డిస్ క్లైమర్:-
నేను కాపీ కవినన్న వాడిని కత్తితో పొడుస్తా!

మూడో క్లైమర్:-
ఎవరికి ఈ అవార్డు వచ్చింది? అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వడం లేదు. అలా ప్రస్తావించడానికి కూడా అర్హత లేని అసందర్భంలోకి మనల్ను నెట్టేసిన కేంద్ర సాహిత్య అకాడెమీ “దేవతా వస్త్రమే” దేశం సాహిత్య దేహాన్ని కప్పే వస్త్రం కావడం మన ఖర్మ!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్