కేవలం ధనికులు, సంపన్నులు మాత్రమే నివసించేలా అమరావతి మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబు తయారు చేశారని, పేదలకు ఎక్కడా స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అమరావతిలో పేదలు నివసించవద్దనేది వారి ఆలోచన అని, అందుకే సీఆర్దీయే ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా సైంధవుల్లా అడ్డు తగులుతున్నారని దుయ్యబట్టారు. శ్రామికులు, కష్టజీవులు, కర్షకులు… అన్ని వర్గాలులేని నగరం ఎక్కడా ఉండదని, అందుకే సిఎం జగన్ ఈ ప్రాంతంలో 50 వేల పేద కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయానికి అవరోధాలు కల్పిస్తూ, ఇదేదో అభివృద్ధి నిరోధక, ఘోరమైన చర్య అయినట్లుగా అన్ని రకాల ఆటంకాలు చంద్రబాబు, రాజధాని రైతుల పేరుతో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, బ్రోకర్లు కల్పించరని విమర్శించారు. రాజధాని ప్రాంతంలోని నవులూరు, క్రిష్ణాయపాలెం ప్రాంతాల్లోని ఆర్5 జోన్ ప్రాంతంలో సజ్జల పర్యటించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ భూమి అయినప్పుడు మీకేం సంబంధం అంటూ సుప్రీంకోర్టు సైతం వారి వాదనను తిరస్కరించిందని, గతంలో హైకోర్టు తీరుకు లోబడి పట్టాలు ఇవ్వొచ్చని చెప్పిందని గుర్తు చేశారు. చట్టాలు చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వానికి, జోన్ ల విషయంలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. సెంటు భూమి శవాలను పూడ్చడానికి కూడా సరిపోదంటూ పేదలను సైతం చంద్రబాబు తిడుతున్నారని, రేపు ఈ వర్గాలనే ఓట్లు అడగాల్సి ఉంటుందని తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విస్మయం వ్యక్తం చేశారు.
కమ్యునిస్టులు కూడా పేదలు నివసించే ప్రాంతాన్ని స్లమ్ అంటూ ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. సెంటు భూమి అంటూ విమర్శించేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలని…. ఇళ్ళు, ప్రైవేట్ స్థలం కొద్దిగానే ఉన్నా, మౌలిక సదుపాయాలు, ఓపెన్ ప్లేస్ ఉంటుందని, దీని ద్వారా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంటుందని సజ్జల వివరించారు.
తన హయంలో 3 లక్షల టిడ్కో ఇళ్ళు ఇచ్చానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారని, మధ్యలో వదిలిపెట్టి వెళ్తే సిఎం జగన్ వాటిని పూర్తి చేసి పేదలకు ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు.