Sunday, January 19, 2025
HomeTrending Newsబాబు దళపతులే బిజెపిలో....: సజ్జల

బాబు దళపతులే బిజెపిలో….: సజ్జల

False Allegations On Jagan :

బిజెపి టిడిపి అనుబంధ విభాగంగా మారిందని,  తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే సోము వీర్రాజు చదివారని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ బిజెపి…ప్రాంతీయ పార్టీ టిడిపి ఆలోచనలు అనుగుణంగా, అనుబంధంగా పనిచేస్తోందని విమర్శించారు. చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి సేనాపతులుగా, దళపతులుగా ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరిలు ఇప్పుడు బిజెపిలో ఉండడం కాకుండా, ఆ పార్టీని నడపడం ఆశ్చర్యంగా ఉందన్నారు సజ్జల.  మేధావులు, తెలివైనవారు అయిన బిజెపి కేంద్ర నాయకులు కూడా వీరిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు ఒప్పందంలో భాగంగానే ఈ ఇద్దరు నేతలు బిజెపిలో చేరి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరినీ బూచిగా చూపిస్తూ బాబు తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.

మళ్ళీ సిఎం అవుతాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని అందుకే ఇప్పటినుంచే పొత్తుల రాజకీయాలు చేస్తున్నారని సజ్జల అన్నారు. ఐదేళ్ళలో రాజధాని కట్టడానికి ఎవరైనా అడ్డుపడ్డారా అని సజ్జల ప్రశ్నించారు. బిజెపి దిగజారుడు రాజకీయం చేస్తోందని,  ఆ పార్టీని చూస్తే జాలివేస్తోందన్నారు. రాష్ట్రాలు కట్టిన పన్నుల నుంచే కేంద్రం తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 135  లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిందని, ఆ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ అప్పుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ సభలో హైకోర్టు కర్నూలులో ఉండాలని బిజెపి నేతలు చెప్పారని, అమరావతి రాజధాని అంటున్నారని, మరి విశాఖలో ఏమీ వద్దనేది వారి ఆలోచన అయితే ఆ విషయాన్నే చెప్పాలని సజ్జల సవాల్ చేశారు. రాష్ట్రంలో సిఎం జగన్ లక్ష్యంగానే రాజకీయాలు సాగుతున్నాయని, పార్టీలన్నీ ఇదే అజెండాతో నడుస్తున్నాయని, పార్టీలు విడివిడిగా తమ అజెండాను సొంతంగా ఎందుకు నిర్ణయించుకోలేక పోతున్నాయని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఫలానా చోట లోపం ఉందని ఆధారాలతో నిరూపించలేకపోతున్నారని విమర్శించారు.

Also Read : అది జగన్ అనుగ్రహ సభ: కేశవ్ ఎద్దేవా

RELATED ARTICLES

Most Popular

న్యూస్