Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమహా మహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ

మహా మహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ

కొంతమందిని చూసినప్పుడు ఒక జీవిత కాలంలో ఇంత చదవడం, ఇన్ని వేల పేజీలు రాయడం ఎలా సాధ్యం? ఒకవేళ చదివినా, రాసినా వాటిని ఎనిమిది పదుల వయసులో కూడా పొల్లుపోకుండా నెమరువేసుకోవడం ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోతుంటాను.

మా నాన్నకు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పి హెచ్ డి గురువు, ప్రఖ్యాత సంస్కృతాంధ్ర పండితుడు, వ్యాకరణవేత్త, పౌరాణికుడు, అనేక వ్యాఖ్యాన గ్రంథాల రచయిత శలాక రఘునాథ శర్మగారిని కలిసిన ప్రతిసారీ ఒళ్లంతా చెవులు చేసుకుని వింటూ ఉంటాను. ఒక వాల్మీకినో, ఒక వ్యాసుడినో, ఒక కాళిదాసునో, ఒక తిక్కననో, ఒక పోతననో ఎదురుగా చూస్తున్నట్లు కళ్లప్పగించి చూస్తూ ఉంటాను. మానాన్నకు గురువు కాబట్టి నాకు పరమ గురువు. ఆ భయభక్తులతోనే నలభై ఏళ్లుగా ఆయనతో జాగ్రత్తగా ఉంటున్నాను. నడిచే సంస్కృతాంధ్ర విజ్ఞాన సర్వస్వం లాంటి మనిషితో మాట్లాడాలంటే భయం. అలాగని మాట్లాడకుండా ఉండలేను. ప్రతిసారీ ఆ విషయమే చెప్పి…నా సందేహాలన్నీ తీర్చుకుంటూ ఉంటాను.

చాలారోజుల విరామం తరువాత ఈమధ్య ఒకసారి ఫోన్ చేస్తే “నాయనా మధుసూదన్! నిన్నొకసారి చూడాలని ఉంది” అన్నారు. అప్పుడు నేను నా వ్యాపారం పనుల్లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను. పని ఒత్తిడి తగ్గాక ఆయన హైదరాబాద్ లో ఎప్పుడుంటారో కనుక్కుని వెళ్లాను. పండితులైనవారిదగ్గరికి వెళ్లేప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు కాబట్టి…పంచల జత, పళ్లు, శాలువ తీసుకెళ్లాను. శాలువా కప్పి, కాళ్లకు నమస్కరించి ఎదురుగా కూర్చున్నాను. అంతే! రెండున్నర గంటలు నన్ను నేను మరచిపోయాను. సాహితీ వీధుల్లో వీరవిహారం చేయించారు. ఆయనింకా మాట్లాడుతూనే ఉన్నారు. సాయంత్రం తిరుపతి బయలుదేరి వెళ్లడానికి ఆయన తయారు కావాలి. సార్! మీరు రెడీ కావాలి. ఇక వస్తాను- అని మరోమారు పాదాభివందనం చేసి…సెలవు తీసుకున్నాను.

ఆయన దాదాపు పాతిక పీ హెచ్ డి లకు, మరో పాతిక ఎం ఫిళ్లకు గైడ్. సంస్కృత వ్యాకరణంలో దిట్ట. భారతం మీద కొన్ని వేల ఉపన్యాసాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. వేనవేల వ్యాసాలు రాశారు. ఇంకా రాస్తున్నారు. అచ్చయిన పుస్తకాల పేజీల సంఖ్య లెక్కగడితే ఇప్పటికి 16 వేలు దాటింది. 84 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా ఆధ్యాత్మిక ప్రసంగాలకోసం ఊరూరూ తిరుగుతున్నారు.

ప్రఖ్యాత సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరిగారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును అందుకున్న శుభ సందర్భంతో మాటలు మొదలుపెట్టాను. నేనొకటి రెండు సార్లు శ్రీహరి సార్ ను కలిసినప్పటి సంగతులు చెప్పాను. సహనం, సౌశీల్యం పోతపోసిన మనిషి నాయనా అన్నారు. ఎంత మెత్తటి మనిషో! ఎంత కష్టపడి చదువుకున్నాడో! గొప్ప పండితుడు అని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

సార్! మీ విదురనీతి వ్యాఖ్యానం చాలాసార్లు చదివాను. చదివిన ప్రతిసారీ కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కానీ అందులో ఏవైనా సందేహాలు మిమ్మల్ను అడగాలంటే భయంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సాహితీ యజ్ఞంలో నిత్యం తలమునకలుగా ఉండే మిమ్మల్ను నా పిచ్చి సందేహాలతో విసిగించకూడదని ఊరుకుంటుంటాను- అంటే… ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు…నాకు తెలిస్తే చెప్తాను- సందేహించకు అని అభయమిచ్చారు.

నేమాని పార్థు పాడిన పోతన భాగవతం పద్యాలు యూ ట్యూబ్ లో బాగా ప్రచారం పొందాయి. ఆ పద్యాలకు అత్యంత సరళమైన వ్యాఖ్యానం శలాక సారే రాశారు. వాటి మీదికి చర్చ మళ్లింది. పద్యం వచనంలా చదవకూడదు. పద్యం పాడాల్సిందే అన్నారు. నేను కొన్ని పద్యాలు పాడి…పాడే విధానంలో అర్థానికి ఏమైనా ఇబ్బంది అవుతోందా? అని అడిగాను. సంధి కలిసిన చోట ఎలా విడదీసి పాడాలో పాడి వినిపించారు.

త్యాగరాజు కీర్తనల్లో భక్తి తత్త్వం” అన్న మా నాన్న పి హెచ్ డి సిద్ధాంత గ్రంథం మీ చేతులమీదుగా నేను అందుకున్నట్లు ఫోటో తీసుకోవాలి సార్…మీకు అభ్యంతరం లేకపోతే…అని అడిగాను. దానికేమి భాగ్యం! అని మా నాన్న పుస్తకం నా చేతిలో పెట్టారు. దానికి తోడు సార్ పి హెచ్ డి గ్రంథం “భారత ధ్వని దర్శనం” కూడా ఇచ్చారు. ఈమధ్య అచ్చయిన సార్ రాసిన మరికొన్ని పుస్తకాల ప్రసాదం చేతిలో పెట్టారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 1998లో నేను తెలుగు సాహిత్యం పి హెచ్ డి కోసం ఎంట్రన్స్ పరీక్ష రాశాను. 1200 మంది పరీక్ష రాస్తే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాంపల్లి గోల్డెన్ త్రెషోల్డ్ బిల్డింగ్ గుమ్మం పక్కన నోటీసు బోర్డులో నా ర్యాంక్ చూసి మా ఆవిడ ఇంటికి రాగానే మంచి పాయసం కూడా చేసి పెట్టింది. పి హెచ్ డి ఇంటర్వ్యూ బోర్డులో ముగ్గురు పెద్దలు నా అచ్చయిన వ్యాసాలు చూడలేదు. నన్ను ప్రశ్నలడగలేదు. పురుగును చూసినట్లు చూసి…కేవలం ఊరు, పేరు అడిగి… వెళ్లిపొమ్మన్నారు. 985 ర్యాంక్ వచ్చినవాడికి సీటు దక్కింది. ఎందుకలా జరిగిందో తెలిసి ఒక్క క్షణం వైరాగ్యం కమ్ముకుంది. అలాంటి పెద్దలున్నచోట పి హెచ్ డి సీటు రాకపోవడమే మంచిదయ్యిందని తరువాత నన్ను నేను ఓదార్చుకున్నాను. ఆ తరువాత మూడు సార్లు పి హెచ్ డి ఎంట్రన్స్ రాసినా ఇతరేతర వ్యాపకాలవల్ల సరిగ్గా చదవక…రాయక…సాధించలేకపోయాను. ఆ విషయాలన్నీ సార్ కు చెప్పి బాధ పడితే…నీ మంచికే జరిగిందనుకో అని అప్పుడలా జరగడానికి కారణాలు చెప్పారు. ఆ వివరాలు సభామర్యాద దృష్ట్యా ఇక్కడ అనవసరం.

హిందూపురంలో జక్కా, కర్రా, నరసింహారావు ఇలా ఒక్కొక్క తెలుగు లెక్చరర్ ప్రత్యేకతలు, వారి పరిశోధనలు, సాహితీ సేవల గురించి చెబుతుంటే నేను గాల్లో తేలుతున్నాను. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రస్తావనకు వచ్చారు. పద్యం ప్రాణంగా బతికే అనంతపురం దగ్గరి ఒక రైతు గురించి ఎంత గొప్పగా చెప్పారో!

శ్రీభాష్యం అప్పలాచార్యులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి, సామవేదం షణ్ముఖ శర్మ ఉపన్యాసాల్లో ఆధ్యాత్మిక, భాషాపరమైన విషయాల్లో నా మైమరపు గురించి మాటలమధ్యలో ప్రస్తావన వచ్చింది. శ్రీభాష్యాన్ని విన్నావా? ఇంకేముంది! గంగాప్రవాహంలో మునకలు వేసినట్లే. వాల్మీకి చెబుతుంటే ఎదురుగా కూర్చుని విన్నట్లే- అని ఆయన్ను తలచుకుని…తలచుకుని పొంగిపోయారు. ఋషిపీఠం ద్వారా సామవేదం షణ్ముఖ శర్మగారు భారతీయ సనాతన ధర్మ పరిరక్షణకు చేస్తున్న సేవలను వేనోళ్ల పొగిడారు.

మీలాంటి తరం తరువాత మాకెవరు సార్ దిక్కు? అని అడిగాను. కాఫీ గ్లాసు చేతికందిస్తూ… సామవేదంలాంటివారు ఉన్నారు. కాలం ప్రవహిస్తూ తనను తాను తనకు కావాల్సినట్లు మలచుకుంటూ ఉంటుందని ఉదాహరణలతో వివరించారు.

శలాక సార్ లాంటివారితో రెండు గంటలు గడిపితే…కొన్ని వేల పుస్తకాలు చదివినా రానంత జ్ఞానం దొరుకుతుంది. రుషి మూలం, నది మూలం గురించి చర్చించకూడదు అంటుంది శాస్త్రం. నాకంటికి సంస్కృతాంధ్ర విజ్ఞాన సముద్రంలా కనిపిస్తారు శలాక సార్. నాలాంటివారు మహా అయితే వారినుండి గ్రహించగలిగింది ఒక గ్లాసుడు జ్ఞానం …ఇంకా ఓపిక ఉంటే ఒక చెంబుడు జ్ఞానం– అంతే.

వెతికి పట్టుకుంటే- మీకూ దొరుకుతారు ఇలాంటివారు. వారిముందు వినయంగా తలవంచి ఒక నమస్కారం పెట్టి నిలుచోండి చాలు- వారిచ్చే విజ్ఞాన సంపద అనంతం. దాన్ని తూచడానికి త్రాసులు చాలవు. ఉన్నా తూనిక రాళ్లు సరిపోవు. ఇలాంటివారు లేనప్పుడు ఆముదవృక్షాలే మహావృక్షాలనుకుని…మనం మునగకొమ్మలెక్కి కూర్చుంటాం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్