Sunday, September 8, 2024
HomeTrending Newsప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం షాక్

ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం షాక్

మధ్యతరగతి ప్రజలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై కొరడా జలిపించింది. ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల (రాష్ట్ర, సీబీఎస్సీ, ఐసీఎస్సీ) ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూస్‌, బెల్ట్‌ అమ్మడానికి వీల్లేదని పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే.. అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటి క్రయ విక్రయాలు జరుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగాక సిఎం కెసిఆర్ హయంలో కూడా ఇదే విధమైన ఉత్తర్వులు వచ్చాయి. ఫీజుల పెంపు, పాఠశాల వాహనాల ఫిట్నెస్ పై హడావిడి చేసినా ఆ తర్వాత షరా మాములుగా మారింది. గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికంగా రాజకీయ నేతలు, వారి సంబందీకులవే కావటం గమనార్హం.

దీంతో ఉత్తర్వులు ఇవ్వటమే కానీ అమలులో ఎక్కడా కనిపించదని విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజుల పెంపుపై కెసిఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇదే విధంగా నిరుపయోగం అయ్యాయని విమర్శలు ఉన్నాయి. అదే కోవలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకోకుండా ఆచరణలో చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్