మహారాష్ట్రలోని థానే సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని సర్లంబే వద్ద సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్-3 నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్‌పై గిర్డర్ యంత్రం అమరుస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 14 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు నిర్మాణ సామాగ్రి కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. నిర్మాణ సామాగ్రి కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే , ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిశీలించారు.
సమృద్ధి మహామార్గ్ ను నాగ్‌పూర్-ముంబై మధ్య నిర్మిస్తున్నారు. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కళల ప్రాజెక్టుగా పేర్కొంటారు. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్ వేలో రెండు దశలు పూర్తయ్యాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది.