Farmers call off:
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించాయి. తమ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అందుకే తమ నిరసనను నిలిపివేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేత నేతలు ప్రకటించారు. ఈ ఉద్యమంలో తమ విజయానికి గుర్తుగా ఈ సాయంత్రం ఫతే అర్దాస్, ఎల్లుండి ఉదయం ఫతే మార్చ్ చేయాలని నేతలు నిర్ణయించారు. రేపు చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు ఉన్నందున ఎల్లుండి నుంచి తాము స్వస్థలాలకు వెళతామని నేతలు ప్రకటించారు. పంజాబ్ కు చెందిన రైతు నేతలు అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయంలో ఈనెల 13న ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు, 15న ఢిల్లీలో రైతు నేతలు మరోసారి సమావేశం కానున్నారు.
కాగా, కిసాన్ మోర్చా ప్రభుత్వం ముందుంచిన ఆరు డిమాండ్లలో ఐదింటిని ప్రభుత్వం అంగీకరించింది. పంటల మద్దతు ధర విషయంలో వ్యవసాయ నిపుణులు, కేంద్రం, రాష్ట్రాల అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఓ కమిటీ నియమించనుంది. రైతుల ఆందోళనన సందర్భంగా ఢిల్లీ, హర్యానా, చండీగడ్, ఉత్తర ప్రదేశ్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలో పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు హామీ ఇచ్చింది.
కిసాన్ మోర్చా తో చర్చించిన తరువాతే విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే మరణించిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం, కాలుష్య కారకాల పేరిట పన్నుల అంశాలపై కూడా కేంద్రం భరోసా ఇచ్చింది. దీనితో రైతు నేతలు తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమం సందర్భంగా వేసిన టెంట్లు తొలగించే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
Also Read : బిపిన్ రావత్ నిజమైన దేశభక్తుడు: మోదీ