Saturday, January 18, 2025
HomeTrending Newsరష్యా పై ఆంక్షలు చైనాకు వరం

రష్యా పై ఆంక్షలు చైనాకు వరం

రష్యాపై అమెరికా, నాటో దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు ….కరోనా వల్ల కుదేలైన చైనాకు వరంగా మారనున్నాయి. వాస్తవానికి చైనా కూడా రష్యాతో ఎటువంటి లావాదేవీలు జరపరాదని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా ఆదేశం లెక్కచేయడం లేదు. ఆంక్షల ఫలితంగా రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనుగోళ్లను అన్ని దేశాలు నిలిపివేశాయి. ఇదే అదనుగా చైనా భారీగా ముడిచమురును కొని నిల్వ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అంతర్జాతీయ విపణి కంటే 24 శాతం తక్కువ ధరకు క్రూడ్ సరఫరా చేస్తామని రష్యా మనకు కూడా ఆఫర్ ఇచ్చింది.

రష్యాకు ఆహార ధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, మాంసం, కూరగాయలు, పాలు, లోహాలు, ఆటోమొబైల్ చిప్స్, ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చుకునే అవకాశం చైనాకు దొరికింది. రష్యా-చైనాలు సరిహద్దు దేశాలు అవడంతో ఇంతకు ముందే రైలు మార్గాలు, హైవేలు నిర్మించారు. ఇప్పుడు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ఎగుమతులు, దిగుమతులు ఊపందుకోనున్నాయి. కరోనా కారణంగా అమ్ముడుపోని పారిశ్రామిక ఉత్పత్తులన్నిటిని రష్యాలో డంప్ చేసే అవకాశం చైనాకు దొరికింది. ప్రపంచ దేశాల్లో వృద్ధి నిలిచి పోవడమో, మైనస్ లోకి జారిపోవడమో జరగగా ఆంక్షల పుణ్యమా అని చైనా జిడిపి గణనీయంగా పెరుగుతోంది.

ఆర్థికంగా పుంజుకోవడం వల్ల వచ్చిన నూతన శక్తితో ఇండియా, తైవాన్ లను చైనా మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. గల్వాన్ లోయలో ఇప్పటికే ముందుకు చొచ్చుకు రాగా, అరుణాచల్ ప్రదేశ్ తమదే అని ఎప్పటి నుంచో వాదిస్తోంది. సైనిక శక్తిలో చైనా ముందు మనం ఉక్రెయిన్ లాగే భయపడాల్సిన పరిస్థితి. అణ్వాయుధాలున్నాయన్న ఒకే ఒక్క ధైర్యం గుండెనిబ్బరాన్నిస్తోంది. రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం జరగకుండా ప్రపంచదేశాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ఎక్కడ న్యూక్లియర్ బాంబు పేలినా అది భూమండలం మొత్తానికి చేటు తెస్తుంది. ప్రస్తుతానికి అణ్వాయుధాలే పూర్తి స్థాయి యుద్ధం జరగకుండా రక్షణ కవచంగా నిలుస్తున్నాయి.

Also Read : కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా

RELATED ARTICLES

Most Popular

న్యూస్