టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున టెన్నిస్ మహిళల డబుల్స్ లో సానియా మీర్జా-అంకిత రైనా ప్రాతినిధ్యం వహించనున్నారు. నిన్న ఈ ఎంట్రీలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సానియా, అంకితలను అభినందించారు. ఒలింపిక్స్ జూలై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. సానియా మీర్జాకు ఇవి నాలుగో ఒలింపిక్స్, కాగా అంకిత రైనా తొలిసారి విశ్వక్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు.

ఈ ఇద్దరు ఆటగాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్లో పాల్గొంటున్నారు. నిన్న జరిగిన ఉమెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా- అమెరికాకు చెందిన బెథాని జోడీ తోలి రౌండ్లో శుభారంభం చేసింది. క్రాజిక్(అమెరికా)-గౌరాచి(చిలీ) లపై 7-5, 6-3 తేడాతో విజయం సాధించింది. నిన్న జరిగిన మరో మ్యాచ్ లో అంకిత – డేవిస్ (అమెరికా)లు అమెరికాకు చెందిన ముహమ్మద్-పెగులా జోడీ చేతిలో 6-3, 6-2 తేడాతో పరాజయం చెందింది.

వింబుల్డన్ లో నేటి సాయంత్రం జరిగే ఆసక్తికర మ్యాచ్ లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనదేశానికే చెందిన నలుగురు ఆటగాళ్ళు తలపడనున్నారు, ఇదో అరుదైన సందర్భం. సానియా మీర్జా- బోపన్న జోడీ అంకిత రైనా-రామనాథన్ లతో తలపడనుంది. ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు జరగనుంది. మరో మ్యాచ్ లో ఇండియాకు చెందిన శరణ్ అమెరికాకు చెందిన సామంత ముర్రేతో కలిసి మరో మ్యాచ్ ఆడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *