Friday, March 29, 2024
HomeTrending Newsవిభజన చట్టం ప్రకారమే నీటి పంపిణి

విభజన చట్టం ప్రకారమే నీటి పంపిణి

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, సంజయ్ అవస్తీ వెల్లడించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎం లు పాల్గొన్నారని, పూర్తి స్థాయిలో చర్చించి గెజిట్ తయారు చేశామన్నారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో 200 కోట్లు ఇవ్వాలని, డబ్బుకు ఎలాంటి లోటు రాకూడదన్నారు. గెజిట్ లో ప్రస్తావన ఉన్నంత మాత్రాన ప్రాజెక్టులకు ఆమోదం అని భావించ కూడదని అవస్తి స్పష్టం చేశారు.

సి.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తామని, రెండు రాష్ట్రాల మధ్య  ఏకాభిప్రాయం సాధించడానికి చాలా సమయం పట్టిందని సంజయ్ అవస్తి పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏకాభిప్రాయానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. సెక్షన్ 87 ప్రకారం బోర్డు పరిధి నోటిఫై చేసే అధికారం ఉంది. నోటిఫై చేసేందుకు మేము చాలా సమయం వేచి చూశాం. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని జలశక్తి అధికారి చెప్పారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను నియమించవచ్చన్నారు.

విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉంది. సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి ఉంది. సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు.  2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ భాగస్వామ్యం, సహకారంతో ఎంతో కసరత్తు చేసి గెజిట్ తయారు చేసాం.

కృష్ణ, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చాం. అందులో ఆమోదించినవి, ఇంకా ఆమోదం పొందని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అప్రూవ్ కాని ప్రాజెక్ట్స్ గురించి సమగ్ర వివరణ ఇచ్చాం. గెజిట్ లో ప్రస్తావించాం కాబట్టి, వాటికి ఆమోదం లభించింది అనుకోవద్దు. అదే విషయం ఇందులో స్పష్టంగా పేర్కొన్నాం. షెడ్యూల్-1 లో అన్ని ప్రాజెక్ట్స్ పేర్కొన్నాం. షెడ్యూల్-2 లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ బోర్డుల పరిధిలోనే ఉంటాయి.  భద్రత కూడా కేంద్ర బలగాలు చూసుకుంటాయి. షెడ్యూల్-3 లో ఉండే ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ బోర్డు ఆదేశాల మేరకు రాష్ట్రం నడుచుకోవాలి.

తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నాం అని మాకు సమాచారం ఇచ్చిందని, ఆ తర్వాతనే మేము బోర్డు పరిధి నోటిఫై చేశామని సంజయ్ అవస్తి చెప్పారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై జల శక్తి శాఖ న్యాయశాఖ అభిప్రాయం కోరింది. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చిన్న విషయం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపుల కోసమా లేక పూర్తిగా 4 రాష్ట్రాల మధ్య మళ్లీ కొత్తగా కేటాయింపులు జరపాలా అన్న అంశంపై న్యాయ శాఖ అభిప్రాయం కోరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్