పశు పోషణ, వ్యవసాయం, వర్తకం- ఈ మూడింటిని కలిపి వార్త అన్నారు. నిఘంటువుల ప్రకారం వార్తకు ఇప్పటికీ అదే అర్థం. కానీ, కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచ, అర్థ వ్యాకోచాల వల్ల మరేదో అర్థం ధ్వనిస్తుంది. ఇప్పుడు వార్త అంటే కేవలం న్యూస్. “వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియు లేనినాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయు బతికి ” అన్న భారత పద్యం అక్షరాలా న్యూస్ గురించే చెప్పిందనుకుని తెలుగు ప్రింట్ మీడియా దశాబ్దాల తరబడి ఈ పద్యాన్ని తెగవాడుకుంది. అర్థంలేని ఎన్నో మాటలను సృష్టించి జనం మీద వదలడంతో పోలిస్తే ఇంత మంచి పద్యం ఏదో ఒక అర్థంలో అన్నేళ్లపాటు ప్రచారంలో ఉన్నందుకు సంతోషించాలి. ఇప్పుడు పద్యమూ లేదు, అర్థమూ లేదు.
అన్వీక్షకి, త్రయీ, వార్త, దండ నీతి – ఈ నాలుగు విద్యలు రాజుకు తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నాడు 2,300 సంవత్సరాలకిందట చాణక్యుడు అర్థశాస్త్రంలో.
- అన్వీక్షకి- తర్కం;
- త్రయి- ఋగ్యజుస్సామవేదాలు(అధర్వణ వేదాన్ని పక్కన పెట్టారు);
- వార్త- పశు పోషణ, వ్యవసాయం, వర్తకం;
- దండనీతి- అడ్మినిస్ట్రేషన్
ఏ వార్తను ఎలా మేనేజ్ చేయాలో? ఏ వేషంలో వెళ్లి ఏ వార్తను ఎలా సేకరించాలో? వచ్చిన సమాచారాన్ని రాజుకు ఎంతవరకు చెప్పాలో ? అసలు చెప్పాలో వద్దో అన్న విషయాలను చాణక్యుడు దండనీతి విభాగంలోనే చెప్పాడు కానీ వార్త ప్రకరణంలో చెప్పలేదు.
అయినా- ప్రస్తుతం మనచర్చ కనుమ పండుగ కాబట్టి వార్తలో ఉన్న పశుపోషణకే పరిమితమై దండనీతిలో ఉన్న వార్తను వదిలేద్దాం. పాశం అంటే తాడు. పాశంతో కట్టి ఉంటుంది కాబట్టి పశువు అయ్యింది. మన్ అన్న సంస్కృత ధాతువు నుండి మనిషి అన్న మాట పుట్టింది. అంటే ఆలోచించే స్వభావం ఉన్నవారు అని అర్థం. ఇందులో నుండే మననం, మనసు, మానవత్వం పుట్టాయి. అందుకే అవి లేనప్పుడు మనిషివా? పశువ్వా? అంటాం. మనకుమాత్రమే మనసు, ఆలోచన, మననం ఉంటాయి, పశువులకు ఉండవు అనుకుని మనం చాలా పాశవికంగా ప్రవర్తిస్తున్నామేమో? గొడ్డును బాదినట్లు వాటిని బాదేస్తున్నాం. మనిషికో మాట – గొడ్డుకో దెబ్బ అని చెప్పి మరీ కుమ్మి పారేస్తున్నాం. పశువుల సంతగా మార్చేస్తున్నాం. ఎద్దు పుండు కాకికి ముద్దు. మనుషులు మాత్రం పశువులను అంతకంటే భిన్నంగా చూస్తున్నారా?
అందుకే పశువులు, ప్రత్యేకించి ఆవులు, ఎద్దులను గౌరవంగా చూడ్డానికి, చూడాలన్న స్ఫూర్తిని నింపడానికి ఏర్పడింది కనుమ. మొత్తంగా పాడి పంటలకు సంబంధించినది కనుమ. ఆవులు, ఎడ్లు తొక్కనినేల మన ఆచారంలో ఉపయోగించడానికి వీలులేనిది. చివరికి యజ్ఞం చేయాలన్నా మొదట కాడికి ఎడ్లను కట్టి, నాగలితో భూమిని దున్ని ప్రారంభించాలి. మిథిల ఊరి చివర జనకుడు అలా యజ్ఞం కోసం భూమిని దున్నుతుంటేనే నాగేటిచాలుకు దొరికింది సీతమ్మ. నాగేటితో దున్నినప్పుడు భూమిపై గింజలు చల్లడానికి అనువుగా చేసిన లైన్లను నాగేటి చాలు అంటారు. సంస్కృతంలో సీత అంటారు. అందుకే ఆమె పేరు సీత అయ్యింది. జనకుడి కూతురుగా పెరిగింది కాబట్టి జానకి. మిథిలలో పుట్టింది కాబట్టి మైథిలి.
రోజురోజుకూ రైతు అనామకుడవుతున్నాడు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు పట్టెడన్నం కరువై పురుగులమందే ఆహారమవుతోంది.
ఇప్పుడు రైతు ఒక విషాదం.
వ్యవసాయం ఒక విధ్వంసం.
కనుమ వేళ పాడి పంటలతో కళకళలాడే రైతు దృశ్యం ఆవిష్కారం కావాలని కోరుకుంటూ-
పాలిచ్చే గోవులకు,
పనిచేసే బసవడికి,
పండించే రైతులకు,
ఫలమిచ్చే పొలాలకు శతకోటి నమస్కారాలు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు