Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెనుగొండలక్ష్మి-1

పెనుగొండలక్ష్మి-1

Son of Goddess Saraswathi:
“ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది;
ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది;
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది;
ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది;

తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు,
బ్రతుకునకు బడిపంతులు, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది”

ఇది సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన గురించి తనే చెప్పుకున్న పద్యం. ఆయన విజయనగర తాతాచార్యుల వంశం వారు. ఒకప్పుడు కృష్ణదేవరాయల కిరీటాన్నే ఆశీర్వదించిన చేయి మాది. ఒకప్పుడు సరస్వతీదేవి చేతి కంకణంగా వెలిగిన ప్రతిభ మాది. ఒకప్పుడు రామానుజాచార్యుల కుశాగ్ర బుద్ధికి చదువు చెప్పిన వంశం మాది. ఒకప్పుడు సకల శోభలతో వెలిగిన విజయనగర ప్రభువుల రాజధాని పెనుగొండ మాది. తల్లిదండ్రులు నాకిచ్చిన విద్యా సంపద ఒక పెద్ద చదువుల్లో ఏది కావాలంటే అది దొరికే సూపర్ బజార్. పద్నాలుగు భాషల్లో పాండిత్యం ఉంది. కానీ బతుకు తెరువుకు బడిపంతులును నేను. భాగ్యాలకు చీడ పట్టిన రాయలసీమ మాది.

పుట్టపర్తి నారాయణాచార్యులు(1919-1990)ఒక అద్భుతం. అలాంటివారు కోటికొక్కరే పుడతారు. ఎన్ని భాషల్లో ప్రావీణ్యం? బతికిన బతుకంతా అనన్యసామాన్యమయిన అక్షర యాత్ర. రాసిన ప్రతి మాట ఒక్కో కావ్యంతో సమానం. అలాంటి మాటల కోటలు పేర్చి ఎన్నెన్ని కావ్యాలు రాశారో? ఆయన ఉండగా అచ్చయినవే వందకు పైగా ఉన్నాయి. ఆయన పోయిన తరువాత ఇంకా అచ్చవుతూనే ఉన్నాయి. రాసిన ప్రతులు సరిగ్గా భద్రపరుచుకోలేక పోయినవి ఎన్ని ఉన్నాయో అని ఆయనే బాధ పడ్డారు.

పెనుగొండ లక్ష్మి, శివతాండవం, సాక్షాత్కారం, మేఘదూతం, జనప్రియ రామాయణం, సిపాయి…ఒకటా? రెండా? నూటా పది పద్యకావ్యాలు కాకుండా విమర్శలు, సమీక్షలు ఇతర గద్య రచనలు వేనకువేలు. ఒక మనిషి జీవిత కాలంలో ఇన్ని భాషల్లో ఇన్ని చదివి, ఇన్నిన్ని రాయడం సాధ్యమేనా? అని ఆశ్చర్యపోవాల్సిన సాహితీ హిమవన్నగం పుట్టపర్తి.

అలాంటి పుట్టపర్తి పన్నెండో ఏట రాసిన చిన్న పద్య కావ్యం పెనుగొండ లక్ష్మి. విద్వాన్ కోర్సులో పుట్టపర్తికి తను రాసిన పెనుగొండ లక్ష్మి కావ్యమే విద్యార్థిగా తను చదవాల్సిన పాఠం. ఇలాంటి అరుదయిన సన్నివేశం ప్రపంచ సాహితీ చరిత్రలోనే ఇంకెవరికీ ఎదురయి ఉండదని దశాబ్దాల తరబడి తెలుగువారు గొప్పగా చెప్పుకుంటున్నారు. విద్వాన్ పరీక్షలో పెనుగొండ లక్ష్మి ప్రశ్నకే ఉన్న సమయమంతా రాసి మిగతా ప్రశ్నలకు సమయం చాలక పుట్టపర్తి ఇబ్బంది పడ్డారని కూడా అంటుంటారు.

అలాంటి పుట్టపర్తికి పద్మశ్రీ వచ్చినా…’సరస్వతీపుత్ర’ బిరుదే సార్థకమయ్యింది.

136 పద్యాల కావ్యం పెనుగొండలక్ష్మి. కావ్యంలో అందచందాలన్నీ ఒకప్పటి పెనుగొండ వెలుగులే.
1 . ముదల
2 . ఊరడింపు
3 . కోట
4 . రణభూములు
5 . రాజవీధి
6 . రామబురుజులు
7 . దేవాలయము
8 . శిల్పము
9 . బాబయ్య గోరి
10 . గగనమహలు
11. కడచూపు
12. తెలుగురాయడు
పేరిట పన్నెండు అంశాల్లో ఒదిగిన కావ్యమిది.

పెనుగొండ ఘనమైన చరిత్రకు ఈ కావ్యం అద్దం. దారిదీపం. పుట్టపర్తి రచనా వైభవానికి శ్రీకారం దిద్దుకున్న పెనుగొండలక్ష్మి కావ్యాన్ని పరిచయం చేసే వ్యాసాల ధారావాహికలో ఇది మొదటిది.

రేపు- పెనుగొండలక్ష్మి-2
“పెనుగొండకు నీరాజనం”
డా. పుట్టపర్తి నాగపద్మిని గారి వ్యాసం

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్