ఆమె ఒక గొప్ప కవయిత్రి. అంతకు మించిన దేశభక్తి ఆమె సొంతం. గాంధీజీ స్వయంగా భారత కోకిల అన్నారామెను. ఈ రోజు… ఆ భారత కోకిల కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు గారి జయంతి. అంతే కాదు జాతీయ మహిళా దినోత్సవం కూడా. మధురమైన కవిత్వానికి ఊపిరి పోయడమే కాదు, దేశభక్తిని అణువణువున నింపుకుని స్వతంత్ర భారతం కోసం తన జీవితం అంకితం చేసిన
అద్భుతమైన నాయకురాలు.
కవితల కోకిల
1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులోఒక బెంగాలీ కుటుంబంలో సరోజినీ నాయుడు జన్మించారు. ఆమె తండ్రి నిజాం కాలేజీ ప్రిన్సిపాల్. చిన్నప్పటి నుంచే ఆమెకు సాహిత్యంపై అపారమైన ఆసక్తి.
పన్నెండు ఏళ్ల వయసులోనే అద్భుతమైన కవితలు, పర్షియన్ భాషలో నాటకాలు రచించి
విదేశాల్లో చదివే అరుదైన అవకాశం అందుకున్నారు. నాంపల్లిలోని వారి ఇంటికి 1905లో ఆమె రాసిన గోల్డెన్ త్రెషోల్డ్ కవితా సంపుటి పేరు అలంకరమైంది. లండన్, కేంబ్రిడ్జ్‌లలో విద్యాభ్యాసం చేసిన సరోజినీ,
ఆ తరువాత ది గోల్డెన్ థ్రెషోల్డ్, బ్రోకెన్ వింగ్ , ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ వంటి విఖ్యాత కవితా సంపుటాలు రచించారు. ఆమె కవిత్వం భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది.
ప్రేమ కోకిల
లండన్‌లో ఉన్న సమయంలోనే తెలుగువారైన గోవిందరాజులు నాయుడిని ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. అది ఆ కాలంలో సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సంఘటన అని చెప్పచ్చు.

ఉద్యమ కోకిల
మహాత్మా గాంధీ గారి పిలుపుతో సరోజినీ నాయుడు స్వాతంత్ర్య సమరంలోకి అడుగుపెట్టారు.
దేశమంతా తిరిగి ప్రజల్లో జాతీయ చైతన్యం రేపారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ
ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నోసార్లు జైలు జీవితం కూడా అనుభవించారు. అంతర్జాతీయ వేదికలపైనా భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని చాటి చెప్పారు.
తొలి భారతీయ మహిళ
1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా
చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్‌గా
దేశ సేవను కొనసాగించారు.

అవార్డు వాపసు
సరోజినీ నాయుడు రాజకీయ నాయకురాలే కాదు… ఒక సేవా మూర్తి. ప్లేగు వ్యాధి విజృంభించిన సమయంలో ప్రజల కోసం అంకితభావంతో పనిచేసి “హింద్-ఏ-కైసర్” అవార్డు అందుకున్నారు.
కానీ జలియన్‌వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ ఆ అవార్డు వెనక్కి ఇచ్చేసిన ధీర.
మహిళలకోసం …
మహిళల విద్య, హక్కులు, సాధికారత కోసం స్వయంగా సంస్థలను నెలకొల్పారు. ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని ఆమె స్వగృహం గోల్డెన్ త్రెషోల్డ్ సెంట్రల్ యూనివర్సిటీ అధీనంలో ఆమె ఆలోచనలకు సజీవ స్మారకంగా ఉంది.
మహిళా దినోత్సవం
సరోజినీ నాయుడు సేవలను గౌరవిస్తూ ఆమె పేరుతో అనేక అవార్డులు అందిస్తున్నారు. అంతేకాదు…
ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
సరోజినీ నాయుడు… కవిత్వానికి దేశభక్తి అద్దిన నాయకురాలు, భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన
భారత కోకిల.

