రాష్ట్రంలో విత్తనాల కొరత రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. విత్తన వ్యాపారుల లాభాపేక్ష… ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వారం రోజులుగా విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయిందనే విమర్శలు వస్తున్నాయి.
అదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కొరత రైతులును ఇక్కట్లకు గురిచేస్తోంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తుండగా… ఈ రోజు (మంగళవారం) విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి ఆదిలాబాద్‌లోని దుకాణాల ముందు క్యూ కట్టారు. రైతులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు పంపిణీ కేంద్రాలకు చేరుకొని విత్తనాల పంపిణీ పర్యవేక్షిస్తున్నారు.
ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. తమకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయడం లేదని కేవలం రెండు బ్యాగులు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా పోలీసులు లాఠీచార్జీ చేశారు.
మరోవైపు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జీలుగు, జనుము విత్తనాల కోసం మెట్‌పల్లి వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. మూడు కేంద్రాల్లో రైతులకు వెయ్యి బస్తాల విత్తనాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మరో 2500 బస్తాల విత్తనాలు అవసరం ఉంటుందని రైతులు తెలిపారు.
జగిత్యాల జిల్లా మల్యాల సింగిల్ విండో కార్యాలయం ముందు జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. 500 మంది రైతులు విత్తనాల కోసం తెల్లవారు జామున వచ్చి క్యూలో నిలబడ్డారు. జీలుగ విత్తనాల కొరత మూలంగా ఒక్కో రైతుకు ఒక్క బ్యాగు మాత్రమే ఇస్తున్నారు. సరిపడా విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 10కిలోల జీలుగ విత్తనాలను ఉపయోగిస్తే సాగు చేస్తే భూసారం పెరిగి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
కామారెడ్డిలోని గాంధీగంజ్‌లో రైతులు ఎండలో నిలబడి విత్తనాల కోసం పడిగాపులు వర్ణనాతీతం. అన్ని గ్రామల రైతులకు ఒకే కేంద్రం వద్ద విత్తనాలు ఇవ్వడంతో ఎండలో ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4 గంటలకు సొసైటీ వద్దకు చేరుకొని జీలుగ కోసం వస్తే అధికారులు కేవలం ఒక బస్తానే రైతులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రెండు, మూడు ఎకరాలున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని రైతులు మండిపడ్డారు.
కామారెడ్డి జిల్లాలో 5లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. రైతుల కోసం 10వేల 300 మెట్రిక్ టన్నుల జిలుగు, 2వేల 366 క్వింటాళ్ల జనుము, 50 వేల 900 క్వింటాళ్ల యూరియా అవసరం అవుతుంది. ఇప్పటివరకు ఇందులో సగం కూడా రైతులకు అందలేదు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని రైతులకు సరిపడా జిలుగు బస్తాలను సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు మాత్రమే కావాలని రైతులు పట్టుబడుతూ ఉండటం కూడా కొరతకు కారణం.
ఇదే అదనుగా కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే భారీగా నకిలీ విత్తనాలను పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా అనుమతి లేని విక్రయాలు విస్తుగొలుపుతున్నాయి.
-దేశవేని భాస్కర్