Sunday, September 8, 2024
HomeTrending Newsఎల్లుండే జడ్పీ, ఎంపిపి కౌంటింగ్

ఎల్లుండే జడ్పీ, ఎంపిపి కౌంటింగ్

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం సెప్టెంబర్ 19)న జరగనుంది. ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ నిన్న కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనితో నిన్న సాయంత్రం సమావేశమైన ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం కౌంటింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నిన్న రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 7,220 మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు (ఎంపీటీసీ), 515 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు (జడ్పీటీసీ)లకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ నిర్వహణపై నేడు జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఎస్.ఈ సీ. నీలం సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

అయితే, ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కేవలం అతి కొద్ది స్థానాల్లో మాత్రమే టిడిపి అభ్యర్ధులు చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు అధికార వైఎస్సార్సీపీ వైపు ఏకపక్షంగా ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జనసేన, బిజెపిలు నామమాత్రంగానే పోటీ చేశాయి. ఒకట్రెండు జిల్లాల్లో పరిమిత సంఖ్యలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఈ కూటమి గెల్చుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్