Saturday, January 18, 2025
HomeTrending Newsఎస్‌హెచ్‌జీలకు రుణాల్లో తెలంగాణ టాప్

ఎస్‌హెచ్‌జీలకు రుణాల్లో తెలంగాణ టాప్

మహిళా సంఘాలకు రుణాలు అత్యధికంగా ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన నాటికి మహిళా సంఘాలకు కేవలం రూ.3,738 కోట్లు రుణాలు మాత్రమే ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళా సంఘాలను ప్రొత్సహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రుణ వితరణ మూడింతలు పెరిగింది. ఎనిమిదేండ్లలో మొత్తం రూ.56,771కోట్ల రుణాన్ని మహిళా సంఘాలకు అందజేశారు. సెర్ప్‌ ద్వారా ఇప్పించే రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.మహిళలకు వడ్డీ భారం కాకుండా చర్యలు తీసుకొంటున్నది.

స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నంబర్‌1గా నిలుస్తున్నది. గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.56 వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందజేసింది. ఇప్పటివరకు మూడింతల రుణాలు ఇచ్చి మహిళా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి చేస్తున్న కృషికి ఇదొక సాక్షాత్కారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12,672 కోట్ల రుణాన్ని అందజేసింది. 32 గ్రామీణ జిల్లాల పరిధిలో ఆదిలాబాద్‌ జిల్లా మినహా 31 జిల్లాలు రుణాలు ఇవ్వడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని వందకు వంద శాతం చేరుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల సంఘాలకు రూ.12,500 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.

ఎన్‌పీఏ కేవలం 1.60 శాతం మాత్రమే ఉన్నది. బ్యాంకులు రుణాలు ఇచ్చే ఏ తరహా రుణాల్లో కూడా ఇంత తక్కువ ఎన్‌పీఏలు లేవు. దీంతో మహిళా సంఘాలకు బ్యాంకులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా 12వేల కోట్లకు పైగా రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించిన ప్రకారం అర్హులైన మహిళా సంఘాలకు రూ. 20 లక్షల వరకు రుణాలు అందించాలనే ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో వెయ్యికి పైగా గ్రూపులకు రూ. 20 లక్షల వరకు రుణాలు అందజేసింది. రాష్ట్రంలో 4.36 లక్షల మహిళా సంఘాలు ఉండగా వీటిలో దాదాపుగా 43 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల్లో సభ్యులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు.

ఉపాధి కల్పించే స్థాయికి..
————————–
మహిళలు రుణాలు పొంది గ్రామాల్లో వారి అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగటమే కాకుండా వారు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నాయి. ఉత్పాదక రంగాల పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పాడిపరిశ్రమ, కుల వృత్తులు, వ్యాపారాల కోసం రుణాలు తీసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు.

Also Read : భాషా ప్రేమికుల స్ఫూర్తి ప్రదాత

RELATED ARTICLES

Most Popular

న్యూస్