Thursday, November 21, 2024
HomeTrending Newsకాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నిజామాబాద్‌ పట్టణానికి తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గమైన ఇందూరు పట్టణంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అనంతరం డీఎస్‌ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్‌కు తరలించున్నారు. తండ్రి మరణవార్త విని ఆయన కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ భావోద్వేగానికి లోనయ్యారు. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. ఎప్పటికీ నాలోనే ఉంటావంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

డీఎస్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్‌.. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. డీఎస్‌ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. డీఎస్‌ పార్థివదేహానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాళులు అర్పించారు.

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డీఎస్ గొప్ప నాయకునిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పని చేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్టిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని చెప్పారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని, బీజేపీ ఎంపీ అరవింద్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్