Friday, November 22, 2024
HomeTrending NewsPakistan: సైన్యం వల్లే సంక్షోభం... భారత్ కారణం కాదు

Pakistan: సైన్యం వల్లే సంక్షోభం… భారత్ కారణం కాదు

ఇండియా పట్ల పాకిస్తాన్ రాజకీయ నాయకుల వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సైన్యం చేతిలో అధికారం కేంద్రీకృతం కావటం క్షేమకరం కాదని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు నవాజ్ షరీఫ్ సైన్యం అరాచకాలను ప్రశ్నిస్తున్నారు. ప్రధానిగా ఇమ్రాన్ సైన్యంతో తగువు తెచ్చుకొని పదవి కోల్పోవలసి వచ్చింది. అభివృద్దిలో భారత్ పరుగులు పెడుతోందని పలుమార్లు ప్రశంసించిన ఇమ్రాన్…పాలనలో సైన్యం మితిమీరిన జోక్యాన్ని వ్యతిరేకించారు. ఇమ్రాన్ తర్వాత అధికారంలోకి వచ్చిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ కూడా అదే విధానం కొనసాగిస్తోంది.

తాజాగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ఆర్థిక సమస్యలకు, ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌డ‌డానికి భార‌త్ కార‌ణం కాదని ఆయన అన్నారు. మ‌న విధానాలే మ‌న‌ల్ని ఆర్థిక సంక్షోభం దిశ‌గా తీసుకువెళ్లిన‌ట్లు ఆయ‌న చెప్పారు. శ‌క్తివంత‌మైన సైన్యం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ న‌వాజ్ పార్టీ త‌ర‌పు టికెట్లు ఆశిస్తున్న వారితో జ‌రిగిన స‌మావేశంలో న‌వాజ్ ష‌రీఫ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

1993లో, 1999లో, 2017లో త‌మ ప్ర‌భుత్వాన్ని మిలిట‌రీనే కూల్చింద‌న్నారు. పాకిస్థాన్ ఆర్థికంగా వెనుబ‌డి ఉండటానికి భార‌త్ కానీ, అమెరికా కానీ, ఆఫ్ఘ‌నిస్తాన్ కానీ కార‌ణం కాదన్నారు. సైన్యం అతి జోక్యంతోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. దేశ ఆర్థిక స్థితి కూడా క్షీణించిన‌ట్లు ష‌రీఫ్ తెలిపారు. నాలుగోసారి పాక్ ప్ర‌ధాని కావాల‌ని భావిస్తున్న న‌వాజ్ ష‌రీఫ్ వ్యాఖ్యలు పాక్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి) మాత్రం భారత వ్యతిరేక వైఖరినే కొనసాగిస్తోంది. ఇటీవలి వరకు విదేశాంగ మంత్రిగా ఉన్న పిపిపి అగ్రనేత బిలావల్ భుట్టో భారత్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు అమానుషమని, గుజరాత్ లో ఉచకోతకు ప్రధాని నరేంద్ర మోడీ కారణమని ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేకత ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్న పిపిపి కి భంగపాటు తప్పదని పాక్ మేధావులు అంటున్నారు.

క్షేత్ర స్థాయిలో సామాన్యపౌరులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాజకీయ నాయకులు, పార్టీలు, సైన్యం విధానాల వల్లే దేశం సంక్షోభంలో కూరుకుపోతోందనే భావన ప్రజల్లో బలపడుతోంది. భారత్ తో వాణిజ్యం ప్రారంభిస్తే నిత్యావసరాల ధరలు అదుపులోకి వస్తాయని, దేశ ప్రజలకు మేలు జరుగుతుందని పాక్ మేధావి వర్గం అంటోంది. ఈ అభిప్రాయాలతో కూడిన యూ ట్యూబర్ల ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సైన్యం జోక్యాన్ని తగ్గించి, పొరుగు దేశమైన భారత్ తో సత్సంబంధాలు పునరుద్దరించాలని ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

పాక్ వర్తమాన రాజకీయాలను పరిశీలిస్తే నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. పాక్ ప్రధానుల్లో మన దేశంతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించిన నేతల్లో నవాజ్ షరీఫ్ ప్రథముడని చెప్పవచ్చు. భారత్ – పాక్ దేశాల మధ్య సంబంధాలు బలపడితే రక్షణ వ్యయం తగ్గి…సంక్షేమాన్ని గాడిలో పెట్టవచ్చు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్