Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపని మనిషి కాదు మనమనిషి

పని మనిషి కాదు మనమనిషి

Maids-Rights:
తూరుపు తెలతెల వారకనే
తలుపులు తెరచీ తెరవకనే
మొదలవుతాయి పనిమనిషి ముచ్చట్లు.
రాకపోతే పడక తప్పదు అగచాట్లు ...
కొత్తగా పెళ్లయి కాపురానికెళ్లిన అమ్మాయికి భర్త తర్వాత అంతగా దగ్గరయ్యేది పనిమనిషే నంటే అతిశయోక్తి కాదు. ఒక్కోసారి భర్త రాకపోయినా నొచ్చుకోరు గానీ పనమ్మాయి రాకపోతే తెగ బాధపడతారు. అసలు పనిమనిషి కారణంగా ఇరుగు పొరుగు వాళ్ళతో పరిచయాలు ( ఆనక గొడవలు ) పెరుగుతాయి కూడా.

ఇద్దరు ఆడవాళ్లు కలిస్తే మాట్లాడుకునే విషయాల్లో పనిమనిషి అంశం తప్పకుండా ఉంటుంది. కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు చిక్కాల్సిందే. అలాగే ఎంత డబ్బున్నా, హోదా ఉన్నా పనిమనుషుల దగ్గర ఒకటే. పనివారిపై వచ్చే కథలకు, జోకులకు లెక్క లేదు. అయితే ఇవన్నీ హాస్యానికి అనుకునే మాటలే గానీ పనిచేసేవారికి ఎంత గౌరవం దక్కుతోంది అంటే దిక్కులు చూడాల్సిందే. ఎందుకంటే ఎన్నో బాధలు అనుభవిస్తూ వారు పని చేస్తున్నారని ఒక సర్వేలో వెల్లడయింది.

కవిత, శారద ఒక తండాకు చెందినవారు. పంటలు పండక, పనులు దొరక్క 20 ఏళ్ళ క్రితం నగరానికి వచ్చారు. కవిత మొదట్లో ఇళ్లలో పనులు చేసినా నెమ్మదిగా వంట నేర్చుకుని నాలుగయిదు ఇళ్లలో చేస్తూ సుమారు పాతికవేలు సంపాదిస్తుంది. వాళ్ళాయన డ్రైవర్ గా చేస్తూ టాక్సీ కొని అప్పులు చేసి, మళ్ళీ ఇంకో చిన్న వ్యాపారం పెట్టుకుని అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. చదువుకుంటున్న పిల్లలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే తన కష్టాలు తీరి పనులు మానేయచ్చని కవిత ఆశ. ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా వీసమెత్తు బంగారం కూడా కొనుక్కోలేకపోయింది. పేదవారికోసం ఉన్న పథకాలేవీ వీరికి చేరలేదు. పొద్దున్న అయిదింటి కి మొదలెడితే రాత్రి పదకొండు అవుతుంది పడుకునే సరికి. అయినా నిరాశ పడకుండా నవ్వుతూ పనిచేసుకుపోతుందీ పొద్దు చాలని మనిషి. ఈమె సమీప బంధువే శారద. ముగ్గురు పిల్లలు. అయిదు ఇళ్లల్లో పనిచేస్తూ పిల్లల్ని చదివించుకునేది. కొన్నాళ్ళకి ఇళ్ళు తగ్గించుకుని సాయంత్రం జొన్నరొట్టెలు చేసి అమ్ముతూ స్వయం సమృద్ధి సాధిస్తోంది.

వీరిలాగే ఉన్న ఊళ్ళో మనుగడ లేక బతుకు తెరువు కోసం పట్టణాలకు, నగరాలకు వచ్చే పేదలెందరో! ఊళ్ళో ఉన్న ఇళ్ళు, కాస్తో కూస్తో భూమి పెద్దవాళ్ళకి అప్పగించి పిల్లలతో సహా వేలాదిమంది నిత్యం నగరాలకు వలసొస్తున్నారు. వీరు భవననిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పనివారుగా కుదురుకుంటారు. మగవారు ఆటోలు, టాక్సీలు నడుపుతారు. వీరికి వచ్చే ఆదాయంలో సగం ఇంటి అద్దెకే పోతుంది. మిగిలిన దాంట్లో పిల్లల చదువులు, ఇతర అవసరాలు గడవాలి. పాపం మహిళలు… నాలుగయిదు ఇళ్లల్లో పనిచేస్తారు. రెండుపూటలా వెళ్ళాలి. వీరికి ప్రత్యేకంగా సెలవులుండవు. కనీస వేతన చట్టం గురించి తెలీదు. వీరిలో గడుసుగా వ్యవహరించేవారు లేకపోలేదు. కానీ అధికశాతం ఏళ్ళ తరబడి దారిద్య్రం లో మగ్గడమే అసలైన విషాదం. ఇటీవల ఓ పరిశీలనలో పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొంటున్నా మరో దారి లేక మౌనంగా భరిస్తున్నారని వెల్లడయింది. మరికొన్ని వాస్తవాలు


– 95 శాతం వెనకబడిన వర్గాలకు చెందినవారే
– దాదాపుగా ఎక్కడా పనికి సంబంధించి ఒప్పందపత్రాలు ఉండవు
– 64 శాతం వేతనంతో కూడిన శెలవులు లేకుండా పనిచేస్తున్నారు
– 23 శాతం అనారోగ్యంతో పనులకు వెళ్తున్నారు

ఈ సర్వేలు ఎలాఉన్నా పనిమనిషి రాకుండా రోజు గడవదు కాబట్టి ఆమెను మన మనిషిలా చూసుకోవడం మన బాధ్యత.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్