మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మణిపూర్ రాష్ట్రం చురచాంద్ పూర్ జిల్లా బెహియాంగ్ లో ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్ అధికారితో సహా జవాన్లు మృత్యువాత పడ్డారు. 46 అస్సాం రైఫిల్ జవాన్ల కాన్వాయే లక్ష్యంగా సింఘాట్ సబ్ డివిజన్ సేహ్కన్ గ్రామం సమీపంలో ఈ రోజు ఉదయం ఉగ్రవాద దాడి జరిగింది. దాడిలో కల్నల్ విప్లవ్ త్రిపాటి, నలుగురు జవాన్లతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. దాడిలో కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, భార్యతో పాటు ఆయన ఎనిమిదేళ్ళ కుమారుడు చనిపోయారు.
మొదట ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు, తరువాత కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మయన్మార్, భారత్ సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఇప్పటి వరకు దాడికి మేమే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మణిపూర్ బెస్డ్ లిబరేషన్ ఉగ్రవాదులే కారణమని అనుమానిస్తున్నారు. ఉగ్రదాడిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఉన్మాదానికి ఒడిగట్టిన వారికి త్వరలోనే తగిన రీతిలో బుడ్డి చెపుతామన్నారు.