శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, అధికారులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. అయ్యప్ప స్వామి దర్శన వేళలను గంట పొడిగించాలని నిర్ణయించారు. ఇక నుంచి ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 వరకు దర్శనం ఉంటుంది. రద్దీని నియంత్రించడంలో ఇబ్బందులు వస్తున్నందున రోజుకు 90 వేల మందికే స్వామి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. వాహన పార్కింగ్ సదుపాయాలను కూడా పెంచాలని సీఎం ఆదేశించారు.