Friday, November 22, 2024
HomeTrending Newsమెట్రో మార్గం మార్పు.. కాంగ్రెస్ ఎత్తుగడ

మెట్రో మార్గం మార్పు.. కాంగ్రెస్ ఎత్తుగడ

రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. 31 కిలోమీటర్ల ఈ మార్గం జనబాహుళ్యానికి అనుకూలంగా లేదని, ఆర్థికంగా భారమని సిఎం రేవంత్ రెడ్డి చెపుతున్నారు. సిఎం అభిప్రాయంపై నగరంలోని మెజారిటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్ బి నగర్ నుంచి చాంద్రాయణగుట్ట, పహాడీ షరీఫ్ మీదుగా విమానాశ్రయానికి 19 కిలోమీటర్లు ఉండగా…MGBS నుంచి ఫలక్ నుమా, జలపల్లి మీదుగా విమానాశ్రయం తీసుకెళ్ళాలి అనే ప్రతిపాదన ఉంది. ఇది 13 కిలోమీటర్ల వరకు వస్తోంది. రెండు మార్గాల్లో ఏది చేపట్టినా రాయదుర్గం-శంషాబాద్ కన్నా చాలా స్వల్ప బడ్జెట్ తో అందుబాటులోకి తీసుకురావచ్చనేది సిఎం అభిప్రాయం.

ఫలక్ నామ మార్గం సులువైనది కాగా…ఎల్ బి నగర్ నుంచి వెళ్ళే మార్గం ప్రజలకు అధిక ప్రయోజనకారిగా ఉందని మెట్రో అధికార వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఈ మార్గం అందుబాటులోకి తీసుకొస్తే విజయవాడ, వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో పాటు హైదరాబాద్ తూర్పు ప్రాంత ప్రజలు విమానాశ్రయానికి సులువుగా చేరే అవకాశం ఉంది.

హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని గచ్చిబౌలి, మియాపూర్, నానక్ రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రజలకు ఔటర్ రింగ్ రోడ్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అర్థికంగా స్థిమంతులు ఉండే ఈ ప్రాంతాల వారు సొంత వాహనాల ద్వారా విమానాశ్రయం వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. మధ్య తరగతి ప్రజలు ఉండే నగర తూర్పు ప్రాంత ప్రజలకు మెట్రో సౌకర్యం కల్పిస్తే ప్రయోజనమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ముస్లింలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి గణనీయంగా ఓట్లు తగ్గాయి. పాతబస్తీ వాసుల్లో మజ్లీస్ పై భ్రమలు తొలగుతున్నాయని, ఈ తరుణంలో మెట్రో మార్గంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ పార్టీ పెద్దల వాదనగా ఉంది.

మజ్లిస్-బీఆర్ఎస్-బిజెపిల మధ్య దోస్తీ ఉందని ప్రచారం చేసి విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు అభివృద్ధి మంత్రంతో పాతబస్తీలో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్  ఎంపి స్థానానికి…నాంపల్లి నుంచి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ ను బరిలో దింపాలని భావిస్తోంది. అజరుద్దీన్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా పార్టీ అధిష్టానం ఫిరోజ్ ఖాన్ అయితేనే పోటీ దీటుగా ఉంటుందని భావిస్తోంది.

మెట్రో మార్గం పాతబస్తీ నుంచి వెళితే ప్రజల ఆలోచన ధోరణి మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు కూడా విమానాశ్రయ ప్రధాన రహదారి తుక్కుగూడ వైపు ఏర్పాటు చేశారు. దీంతో పాతబస్తీ ప్రజల జీవన శైలిని మార్చవచ్చని అప్పట్లో నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శంషాబాద్ వైపు ప్రధాన ద్వారంగా ప్రకటించారు.

విమానాశ్రయానికి సిఎం రేవంత్ రెడ్డి సూచించిన రెండు మార్గాల్లో ఏది ఆచరణలోకి వచ్చినా మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాయదుర్గం – శంషాబాద్ మార్గం రద్దు.. మెట్రో మార్గ మార్పుపై ఇప్పటివరకు ప్రజల నుంచి భిన్నాభిప్రాయం రాకపోవటమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్