Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాయినయినా కాకపోతిని!

రాయినయినా కాకపోతిని!

Telugu Language in Leharaayi song :
“లెహరాయీ లెహరాయీ..

గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..

రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే..
వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..
మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..

వేళా పాళలనే మరిచే సరసాలే..
తేదీ వారాలే చెరిపే చెరసాలే..
చనువు కొంచెం పెంచుకుంటూ.. తనువు బరువే పంచుకుంటూ..
మనలోకం మైకం ఏకం అవుతూ.. ఏకాంతాలే లెహరాయీ..”

ఈపాట విని అర్థ తాత్పర్యాలు రాయమని నా క్లాస్ మేట్లు అడిగితే నన్ను గుర్తించారనుకుని మొదట సంబరపడ్డా. పాట విని, చదవగానే పాత పగలను ఇలా ప్రతీకారంగా తీర్చుకుంటున్నారని అర్థమయ్యింది. మంత్రసానిగా ఒప్పుకున్నాక బిడ్డ అడ్డం తిరిగినా పురుడు పోయాల్సిందే. అలా మిత్ర ధర్మానికి లోబడి రాయాల్సిందే!

సంస్కృతంలో లహరి అంటే అల. లెహర్ అంటే హిందీలో అల. లహరి నుండే లెహర్ పుట్టి ఉంటుంది. లాహిరి మాటకు కూడా లహరి మూలం. లెహరాయి అంటే కదిలే అల అనికానీ, కదిలివచ్చిన అల అనికానీ అర్థం ఉండి ఉండాలి. ఆ అర్థం కాక ఇంకేదయినా అయి ఉంటే నా అనంతమయిన హిందీ అజ్ఞానాన్ని మన్నించండి.

తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెడితే దేశద్రోహ నేరం కాబట్టి అత్యంత అర్హుడయిన వరుడికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చక్కగా ఇంగ్లీషులో పేరు పెట్టాడు టాయ్ హౌస్ సన్- బొమ్మరిల్లు భాస్కర్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంగ్లీషులో పాడకుండా లెహరాయి లెహరాయి అని దేశ భాష హిందీలో పల్లవి ఎత్తుకున్నందుకు యావత్ దేశం అతడికి రుణపడి ఉండాలి.

లెహరాయి
లెహరాయికి ప్రాస “యి”. యి తో రచయిత శ్రీ మణి ఒక ఆట ఆడుకున్నాడు.
ఊహలెగిరాయి
వేచాయి
అమ్మాయి
హాయి

వంటగది మంటలు ఒంటిలోకి పంపడంలో గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరగడం మీద రచయిత నిరసన వ్యక్తం చేసినట్లు గొప్ప విరుపుతో ఉంది!

మా మిత్రులు నన్ను ఆటపట్టించడానికి అడిగినా…నిజంగా ఈ పాటలో ఎన్నెన్నో అంతరార్ధాలు దాగి ఉన్నాయి. నాలాంటివారు కాకుండా తెలుగు భాష మీద బాగా పట్టున్నవారు ఈ పాట ప్రతిపదార్థాలు రాస్తే బాగుంటుంది!

అల్లె
మల్లె
అంటి
మంటి మాటలు తెలుగు పాటకు ముల్లులా గుచ్చుకుని అల్లుకుని ఉంటాయి. మంటిలా అంటుకుని ఉంటాయి. తెలుగు పాట సొంతంలా అని చచ్చినా అనదు. సొంతమల్లె అనే అనాలి. లేదంటే సొంతమంటి అని అనాలి. అది తెలుగు పాట ఛందో వ్యాకరణం!

గాయకుడు సిధ్ శ్రీ రామ్ గొంతులో తెలుగును ఇంతకు మించి ఆశించడానికి వీల్లేదు. తమిళ మూలాలతో అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు తెలియని సిధ్ శ్రీరామ్ లేకుంటే తెలుగు పాట ఏమయ్యేదో తలచుకుంటేనే భయంగా ఉంటుంది!

నువ్వుంటే…నువ్వుంటే…
అనడానికి
నువ్ ఉల్టే…నువ్ ఉల్టే…
అని స్పష్టంగా సిధ్ అల్టే మనం అళ్గీకరించాం.
ఉండిపోరాదే?
అనడానికి
స్పష్టంగా సిధ్
ఉన్ డి ప్పో రాదే?
అంటే మనమంతా ఉన్ డిప్పోయాం!

అలా ఈపాటలో
లెహరాయిలో చివరి “రాయి”
ఎగిరాయి
అదిరాయి మాటల్లో పంటి కింద రాయిగా సిధ్ మనకు చక్కగా అందించాడు.

గీటు రాయి
చెకుముకు రాయి
బొడ్రాయి
గుండ్రాయి అన్నప్పుడు అందులో ఉన్నది రాయే.

ఎగిరాయి
అదిరాయి
ముదిరాయి
కుదిరాయి
అన్న క్రియాపదాల్లో ఉన్నది మాత్రం రాయి కాదు.
ఎగిరినవి
ఎగిరినాయి

అదిరినవి
అదిరినాయి

ముదిరినవి
ముదిరినాయి

కుదిరినవి
కుదిరినాయి
అన్న రూపం మారి చివర వచ్చిన రాయి. ఈ రా లో కొంత యా పలకాల్సిందే. అలా యా పలికీ పలకకుండా పలికినవాడు తెలుగువాడు. పలకనివాడు మాతృభాష తెలియనివాడు.

పంపారు.
చేశారు.
చెప్పారు.
మాటల్లో పా శా ప్పా అక్షరాల దగ్గర యా కలిసిన ధ్వని రావాలి. లిపిలో దానికి సంకేతం ఉండి ఉండాల్సింది.
పంప్యారు
చేశ్యారు
చెప్ప్యారు
అని రాయకూడదు. అలా రాస్తే అలాగే పలికే ప్రమాదముంది.
మాతృభాష తెలుగయినవారికి- పాలు; పాపాలు, శార్దూలం; మాటల్లో పా, శా కు – పంపారు, చూశారు మాటల్లో పా, శా కు పలకడంలో తేడా ఒకరు చెప్పాల్సిన పనిలేదు. సహజంగా అలవాటయిపోతుంది.

ఇలాంటి డెలికేట్ ఉచ్చారణ ఉన్న పదాలు సిధ్ శ్రీరామ్ నోట పడకూడదని తెలుగు భాష ప్రేమికులు భగవంతుడిని గట్టిగా కోరుకోవడం తప్ప చేయగలిగింది లేదు!

పెళ్లి సందD అని ఇంకొక సినిమా. సందడిలో చివర తెలుగు డి ఇంగ్లీషు క్యాపిటల్ D గా ఉండడంలో రెండు భాషలకు సంబంధించిన ఏదో నిగూఢమయిన రహస్య సంకేతార్థం ఉండి ఉంటుంది. అందులో ఒక పాటలో రచయిత చంద్రబోస్ గొప్ప ప్రయోగం చేశాడు.
“నీకు నాకు ప్రేమ.
ప్రేమంటే ఏంటి?
(ఒక సెకను మౌనం)”
మాటలకందని ప్రేమను మౌనభాష్యంతో పలికించాడు. తరువాత మనకు అర్థం కావడానికి రచయితే క్లారిటీ ఇచ్చాడు.
“చల్లగా అల్లుకుంటది;
మెల్లగా గిల్లుతుంటది
వెళ్లనే వెళ్లనంటది…”
కోట్లల్లో ఈ పాటను శ్రోతలు అల్లుకున్నారు. గిల్లుతున్నారు.
కుంటది
తుంటది కాస్త చరణం చివర వెళ్లిపోనంటుంది అంటుంది. అక్కడ అంటది వస్తే ఇంకా బాగుండేదేమో! ఏమో?

ఇంకా నయం!
మా మిత్రుల చెవిలో ఈ పాట పడినట్లు లేదు!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్