Dj Tillu: ‘గుంటూర్ టాకీస్’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’, ‘మా వింతగాథ వినుమా’ వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నారు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన కొత్త సినిమా ‘డిజె టిల్లు’. నేహా శెట్టి నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మించింది. సూర్యదేవర నాగవంశీ చిత్ర నిర్మాత. ఈ నెల 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి సిద్ధు చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…
“నటుడిని అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉండేది. నాకు నేనే చిత్ర పరిశ్రమలో ఒక అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం రచయితగా మారాల్సివచ్చింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తర్వాత నాగ వంశీ గారు సినిమా చేయమని అవకాశం ఇచ్చారు. అలా ‘డిజె టిల్లు’ సినిమాకు శ్రీకారం చుట్టాం. నేను, దర్శకుడు విమల్ కృష్ణ కలిసి ఈ కథ, మాటలు రాశాం. రచనలో మా ఇద్దరి కృషి ఉంది. ప్రేమకథకు చిన్న క్రైమ్ కోణాన్ని జతచేసి రాసిన కథ ఇది. ప్రేమకథే ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల్లో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన గమనించాను. వాళ్ల క్యారెక్టర్లను తెరపై చూపించాలనుకొని ఈ సినిమాలో పాత్రలను రూపకల్పన చేశాం”
“నేను పెరిగిన మల్కాజ్ గిరి ఏరియాలో యూత్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. తమ దగ్గర డబ్బు పెద్దగా లేకున్నా పైకి దర్పంతో ఉంటారు. అందరితో కలిసి స్నేహం చేస్తారు. ఎవరికైనా అవసరం వస్తే.. సాయం చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లలో నిజాయితీ ఉంటుంది. ఈ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకుని ‘డిజె టిల్లు’ క్యారెక్టర్ రాసుకున్నాం. డిజెలు రాత్రంతా పోగ్రాముల్లో ఉంటారు. ఉదయం ఆలస్యంగా లేస్తారు. వాళ్లు కొత్త కొత్త ప్యాషన్ లు ఫాలో అవుతారు. హేయిర్ స్టైల్, డ్రెస్ లు వేస్తుంటారు. మన టిల్లు కూడా అలాంటి మేకోవర్ లోనే కనిపిస్తాడు. పూర్తిగా తెలంగాణ యాసతో మాట్లాడుతుంటాడు”
“సినిమాలో టిల్లుకు పెద్దగా డీజే చేసే ప్రతిభ ఉండదు. ఏవో రెండు మాస్ పాటలు చేసి వాటితోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఆ రోజుకు వచ్చిన డబ్బులు ఖర్చు చేసేస్తాడు. అతనికి డబ్బులు వెనకేయాలి, ఇంకేదో చేయాలనే ఆలోచనలు ఉండవు. ఉన్నంతలో హాయిగా బతికేస్తుంటాడు. తన చుట్టూ తిరిగేవాళ్లకు ఖర్చు పెడుతుంటాడు. లేకుంటే వాళ్లు అన్నా అని వెనకే తిరగరు కదా. ఇది బుద్ధిగా, ఒక పద్దతితో రాసుకున్న కథ కాదు. క్యారెక్టర్ నుంచి, కథ నుంచి, త్రివిక్రమ్ గారి సూచనల నుంచి పుట్టిన అంశాలన్నీ కలిపి కథగా రాసుకున్నాం. వినోదంతో పాటు ఒక మంచి విషయం ఈ సినిమాలో ఉంటుంది. అది తెర పైనే చూడాలి. అప్పటి దాకా నవ్వించే టిల్లు ఒక మంచి విషయం చెప్పి ముగిస్తాడు. అది సందేశం ఇచ్చినట్లు కూడా అనిపించదు కానీ ప్రేక్షకులకు చేరుతుంది”
“సితార సంస్థలో మాకు ఏ ఇబ్బందులు లేవు. సినిమా కోసం ఏది కావాలన్నా వచ్చేసేది. మాకు పెద్ద సమస్యలు అనుకున్నవి వంశీ గారు, చినబాబు గారు వెంటనే పరిష్కరించేవారు. వంశీ గారు మొన్న సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. డిజె టిల్లును పెద్ద సినిమా చేయొచ్చు అని త్రివిక్రమ్ గారు ప్రోత్సహించారు. ఇటీవల సినిమా చూశాక కూడా ఇది హిట్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అనేది చూడాలి అన్నారు. మేమూ అదే చెబుతున్నాం. డిజె టిల్లు విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఎంత పెద్ద విజయం అనేది ప్రేక్షకులు చెప్పాలి”