ప్రొటోకాల్ భక్తుల క్యూ లైన్లలో ఇతరులు రావడం వల్లే సింహాచలంలో నిన్న ఇబ్బంది ఎదురైందని ఏపీ డిప్యూటీ సిఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, లక్షా 70వేల మంది స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. చందనోత్సవం ఘనంగా జరిగిందని, రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారన్నారు. అందరికీ తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
నిన్న ఆలయంలో ప్రోటోకాల్ దర్శనంలో జరిగిన ఘటనలపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామని కొట్టు వెల్లడించారు. 300, 1000 రూపాయల టిక్కెట్లు తీసుకున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు. అంతరాలయ దర్శనం టిక్కెట్ల విషయంలోనే కాస్త ఇబ్బంది ఎదురైందన్నారు. ఒక క్యూలైన్ లోకి ఇతరులు కూడా తోసుకువచ్చారన్నారు. సింహాచలం ఆలయానికి త్వరలోనే కొత్త ఈవోను నియమిస్తామని మంత్రి చెప్పారు.