Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసింధు సరస్వతి నాగరికత- నా అనుభవం

సింధు సరస్వతి నాగరికత- నా అనుభవం

Untold History: హిస్టరీ లెక్చరా? మిస్టరీ పిక్చరా?… సీతారాముడి ప్రశ్న. రెండూ కలిసిన నా ఆదివారపు ప్రయాణం…మొదలుపెట్టింది మొదలూ ఊపిరాడటం లేదు. ఢిల్లీ కాలుష్యం వల్ల కాదు. ఉక్కిరి బిక్కిరి చేసే ఒక్క ప్రశ్న…పదే పదే…వడ్రంగి పిట్టలా మెదడు బెరడుని తొలిచేస్తోంది…పొరలు పొరలుగా సాగే పురాతత్వ తవ్వకాల్లా.

ఆమె ఎవరు? ఎలా ఉండేది? ఆమె పేరేంటి ? ఆమె చుట్టూ ఎందుకీ చర్చ?  ఆమె మనకి చుట్టమా? అయితే నాకెన్ని తరాల దూరం? దూరం 150 కిలోమీటర్లు అయినా, నా ప్రయాణం 4500 ఏళ్ళ వెనక్కి. హరప్పా నాగరికత…కాదు కాదు సింధు-సరస్వతి నాగరికతలోకి, నాగరికతకే పతాకమైన ఆ పుర వీధుల్లోకి…రాఖిగర్హి దిబ్బల్లోకి…ప్రశాంతంగా ఆమె నిదురించిన కాలగర్భంలోకి … పురాతత్త్వంలోకి…మన అస్తిత్వంలోకి…చెప్పీచెప్పక ఆమె ‘చెవి’ చెప్పిన రహస్యంలోకి.

బతికినప్పుడు ఆమె పేరేంటో… ఇప్పడు మాత్రం I6113. ఇన్నేళ్ళుగా ఇంత అందమైన రహస్యాన్ని దాచి ఇప్పుడు చాటిన ఆ చక్కని చాన ఎంత అందంగా నవ్విందో… ఆ చెవికి ఏ పోగులు తొడిగిందో…మనకు మాత్రం తన చెవిలో దాచుకుని కొన్ని డీ.ఏన్.ఏ పోగులిచ్చింది (DNA Strands). మన అస్తిత్వ వృక్షపు తల్లి వేరుని పట్టి ఇచ్చింది.

హర్యానాలోని హిస్సార్ జిల్లాలో రాఖిగడి ఓ చిన్న పంచాయతి. ఇప్పుడు పంచాయతీ అంతా అక్కడే. అదృశ్యమైన ద్రుశద్వతి నది అదృశ్యమైన సరస్వతి నదికి ఉపనది. ఆ ‘లేని నది’ ఒడ్డున ఇప్పుడు ఏడు దిబ్బలు.

దిబ్బలకింద నిశ్చింతగా నిర్లిప్తంగా నిక్షిప్తమైన నాగరికత. సింధు-సరస్వతి (హరప్పా) నాగరికతకి పరిచయం అవసరం లేదు. ఇప్పటికి తవ్వకాలు జరిగిన దాదాపు 400 చోటుల్లో(సైట్) రాఖిగడి అన్నిటికంటే పెద్దది. హరప్పా 150 మొహంజొదారో 250 అయితే, రాఖిగడి 350 హెక్టార్లు. మూడు విడతలుగా అక్కడ  తవ్వకాలు జరిగాయి. మళ్ళీ జరగనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అయిదు ఐకానిక్ సైట్లలో ఇది ప్రధానమైనది. మిగిలినవి ఆదిచనల్లూర్ (తమిళనాడు), ధోలవీర(గుజరాత్), హస్తినపుర(హర్యానా), శివసాగర్(అస్సాం).

4500 సంవత్సరాల క్రితం మట్టిలో కలిసిన ఆమె, 2013-16 లో ప్రొ. వసంత షిండే ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో తిరిగి వెలుగు చూసింది. మన గతంపై వెలుగు నింపింది. ఊహించని విధంగా ఆమె కంకాళపు చెవిభాగం నుండి (పెట్రాస్ బోన్) డీ.ఎన్.ఏ సంగ్రహించ గలిగింది వసంత్ షిండే టీం. మన దేశపు వేడి-చెమ్మ వాతావరణంలో పురాతత్వ డీ.ఎన్.ఏ బతకదు. దొరకడం ఓ మహద్భాగ్యం.

అందుకే దాదాపు ఆ తవ్వకాల్లో 61 కంకాళాలు దొరికినా, డీ.ఎన్.ఏ దొరికింది ఆమె నుండే (I6113). సింధు-సరస్వతి నాగరికతకి సంబంధించి మనకు దొరికిన మొట్టమొదటి పురాతత్వ డీ.ఎన్.ఏ ఇదే. భారతీయులంతా చెవులు పట్టుకుని ఎన్నేళ్ళు గుంజిళ్ళు తీస్తే ‘ఆమె’ ఋణం తీరుతుంది?

దారిలో ధాబా కనక్ లో (కనక్ అంటే గోధుమ) వేడివేడి తందూరీ మూలీ పరాఠాలు లాగించి హీంగ్ గోలీలు చప్పరిస్తూ రాఖిగడి చేరేసరికి ‘శివం’ మాకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తను ఆ ఊరివాడు. గతంలో శివం లాంటి లోకల్ యువకులకి శిక్షణనిచ్చి తవ్వకాలలో భాగస్వాముల్ని చేశారట. ఆసక్తి ఉన్నవాడూ, అవగాహన ఉన్నవాడూ.

పురాతన ఏడు దిబ్బలలో ఒక దిబ్బను ఆక్రమిస్తూ ఉంది  రాఖిగడి ఊరు. నడుస్తుంటే కాళ్ళ కింద నిద్రించిన నాటి నాగరికత. ఆ ఊరిలో వేల సంవత్సరాల నాటి పద్ధతులు ఇంకా బతికే ఉన్నాయి. హరప్పా వీధుల్లాగే వీధులు విశాలంగానూ, సమాంతరంగానూ ఉండి కూడళ్ళలో నిక్కచ్చిగా 900 కోణంలో కలుసుకుంటాయి. అచ్చం తవ్వకాల్లో దొరికిన నాణేలపైన ఉన్న బొమ్మలలోని ఎద్దుల్లాగే వీధుల్లో యధేచ్చగా తిరిగే కొమ్ములు తిరిగిన ఎద్దులూ, ఆనాటి మట్టిబొమ్మల్లో కనబడే సింపుల్ డిజైన్ ఎద్దుల బండ్లూ కనబడుతాయి. ఇప్పటి మట్టి పాత్రల, కుండల ఆకృతి తవ్వకాల్లో దొరికిన వాటిలాగే ఉంటాయి.

ఒకటో దిబ్బ పైనుండి దూరంగా ఉన్న ఏడవ దిబ్బ వైపు చూపిస్తూ శివం చెప్పాడు ‘ఆమె’ అక్కడే దొరికిందని. ఇప్పుడామె మ్యూజియం లో భద్రం గా ఉంది. చుట్టూ పచ్చని చేలు. ఆ పొలాలని జాగ్రత్తగా గమనిస్తే ఓ నది పారినట్లు నేల పల్లం కనిపిస్తుంది. ఇప్పటికీ, వర్షం పడితే ద్రుశద్వతి అప్పుడు ఎలా పారిందో అదే దారిలో నీరు పారుతుందట. సాధారణంగా తవ్వకాలు విస్తారంగా జరుపుతారు దాని వల్ల నగర నిర్మాణ శైలి దాని పరిధి తెలుస్తాయి. రాఖిగడిలో లోతుగా తవ్వకాలు జరిగాయి. దీనివల్ల ఎన్ని పొరల్లో ఈ నాగరికత ఒదిగిందో తెలుస్తుంది. ఒక్కో పొరా కొన్ని వందల సంవత్సరాలు. మెట్లు మెట్లుగా లోపలి తవ్వుతూ వెళ్ళారు. అందుకే దిబ్బలలో చాలా కొద్దిభాగమే తవ్వకాలు జరిగాయి. అంతా తవ్వడం సాధ్యం కాక పోవచ్చు. అట్టడుగు పొర 4800- 5000 సంవత్సరాలు గా తేల్చారు.  రాఖిగడి ఓ నగరం. ఆ చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరంలో ఫర్మానా, బన్వాలి, కునాలి, విరానా వంటి చిన్న చిన్న సైట్స్ లో కూడా ఎన్నో విలువైన వస్తువులూ, కంకాళాలూ దొరికాయి. ఇవన్నీ రాఖిగడి నగరానికి దన్నుగా ఉండే సెటిలైట్ గ్రామాలు. వాటి కాలం 6000 ఏళ్లగా నిర్ధారించారు (ఫర్మానా).

మాట్లాడుతూ చటుక్కున వంగి అక్కడ పడిఉన్న కొన్ని ఎర్ర కుండ పెంకుల్ని ఏరి నా దోసిట్లో పోశాడు శివం. మురిపెంగా చూశాను. ఒక పెంకు కి కళాత్మకంగా సన్నని రంధ్రాలున్నాయి. అలాంటి మట్టి పాత్ర లో నీళ్ళు పోస్తే నిలవవు కదా తాగే మట్టి పాత్ర అవడానికి లేదు. మరేమిటి?  ముక్కలైన ఫ్లవర్వాజ్ అన్నాడు శివం.

ఆశ్చర్యంలో ఉండగానే  కొద్దిగా ముందుకెళ్ళి సగం పగిలిన క్రికెట్ బాల్ లాంటి చిన్న మట్టిముద్దని ఏరి నా చేతిలో ఉంచాడు. ‘ఇక్కడ పూసల తయారి పరిశ్రమ బయల్పడింది’. కొలిమిలో వేడి నిలిచి కాలేందుకు మట్టిని ముద్దలు చేసి వేసేవాళ్ళు’. ‘ఇప్పుడు మీ  చేతిలో పెట్టిన సగం పగిలిన మట్టిముద్ద అలాంటిదే’ అన్నాడు శివం. ఆ ముద్దని తయారు చేసినప్పుడు దానిపై పడ్డ బొటనవేలూ, చూపుడు వేళ్ళ  అచ్చులున్నాయి  చూడమన్నాడు. నా వేళ్ళు ఆ అచ్చుల్లో సరిగా సరిపోయాయి. మట్టి ముద్ద చేతిలో ఒదిగిపోయింది. అవును అవి తడిమట్టి ముద్దమీద పడ్డ అప్పటి కళాకారుని వేలి అచ్చులే…వేళ్ళలో వెచ్చదనం…ఒళ్ళు జలదరిస్తుంటే అప్రయత్నంగా అపురూపంగా ఆ ముద్దని ముద్దు పెట్టుకున్నా. వర్షం పడితే దిబ్బల పై మట్టి కరిగి ఇలాంటి చిల్ల పెంకులు బయటపడి అక్కడక్కడా చెల్లా చెదురుగా కనపడుతుంటాయి. తవ్వకాల్లో దొరికిన ముఖ్యమైనవన్నీ ప్రభుత్వం వారు భద్రపరిచాక ఇవి వదిలేసిన శిధిలమైన ముక్కలు.  అలా ఓసారి వాన వెలిశాక మెరుస్తూ ఓ బంగారు కాలి కడియం దొరికిందట. ఏ చక్కని తల్లి కాలిని తాకిందో. ఎవరో గ్రామస్తులు తీసుకెళ్ళిపొతే, ఊరంతా దండోరా వేయించి మూడింతల రొక్కం చెల్లించి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుందట. పురాతత్వ శాఖ వారు ఈ ప్రాంతాన్ని మరింత అభివుద్ధి చేసే దిశలో ప్రణాళికలు వేస్తున్నారు.

ఒక్కో దిబ్బా తిరుగుతూ ఇప్పటి ఊరు ఆక్రమించిన నాల్గవ దిబ్బ వైపు వెళ్లాం. అక్కడ ఊరి మధ్యలో గ్రామస్తులు సగం తవ్విన దిబ్బ గోడలాగ ఎత్తుగా కనిపిస్తోంది. కాలం పొరల్లో నిక్షిప్తమైన రాఖిగడి గతానికి అది నిలువెత్తు సాక్ష్యం. చాల సులభంగా ఓ పదిహేను పొరలను ఆ గోడపై దూరం నుండే లెక్కించవచ్చు.

ఒక్కో పొరా ధ్వంసమైన వందల సంవత్సరాల నాగరికత !  మళ్ళీ మళ్ళీ అక్కడే పరిఢవిల్లిన ఓటమిని అంగీకరించని మానవ ప్రయత్నం.  నది వరదై పారి ఊరు మునిగినట్లున్న పొరకూడా కనిపిస్తుంది. క్రాస్ సెక్షన్ లా ఉండే ఆ గోడ లోంచి తొంగి చూసే ఆ కాలపు మట్టి ఇటుకలూ,కాల్చిన ఇటుకలూ, జంతువుల ఎముకలూ, అక్కడక్కడా నల్లగా కనిపించే కాల్చిన కట్టెల బూడిదా కనిపిస్తాయి. 4500 సంవత్సరాల నాగరికత లోతుల్ని అలా తేరిపార చూడటం మాటలకందని తెలీని ఓ కొత్త అనుభూతి. ఆ గోడ నిండా గూళ్ళు కట్టిన పావురాళ్ళు… అప్పటి ఆత్మలేమో!

వసంత్ షిండే డెక్కన్ కాలేజిలో పురాతత్వ శాఖ ప్రొఫెసర్. నీరజ్ రాయ్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) హైదరాబాద్ లో జన్యు శాస్త్ర సైంటిస్ట్. వీరు సేకరించిన ఆమె డీ.ఎన్.ఏ పై పరిశోధనలు చేసి అత్యంత ప్రతిష్టాకరమైన “సెల్”  అనే మ్యాగజైన్ లో 2019 లో వ్యాసం ప్రకటించారు. మేము వ్యాసం ప్రచురిస్తే ఒప్పుకొని వాళ్ళూ ఒప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళూ ఎదో ఒక వంక చూపుతారని తెలుసు అంటారు షిండే. అందుకే ఆ దొరికిన డీ.ఎన్.ఏ ని హార్వార్డ్ యూనివర్సిటీ లోని ప్రపంచ పురాతత్వ డీ.ఎన్.ఏ ల్యాబ్ లో, కొరియన్ ల్యాబ్ లలో పరీక్షకు పంపి వాటి ఫలితాలూ తమ ఫలితాలతో పోల్చి, హార్వార్డ్ ప్రొఫెసర్ తో సహా ఓ 30 మంది పరిశోధకులు కలిసి ‘హరప్పా జినోమ్ లో స్టెప్పీల పశుపాలకుల, ఇరాన్ వ్యవసాయదారుల డీ.ఎన్.ఏ జాడలు  లేవ’ని నిర్ధారిస్తూ వ్యాసం రాశామంటారు షిండే. అదే సంవత్సరం అదే నెల అంతే ప్రతిష్టాత్మకమైన ‘ది సైన్స్’ మాగజిన్ లో వాగీశ్ నరసింహన్ మొదలైన వారు మరోవ్యాసం కూడా ప్రచురించారు. అదీ హార్వార్డ్ తో సహా మరికొన్ని యూనివర్సిటీల వంద మంది పరిశోధకులు గత 8000 వేల సంవత్సరాల కాల వ్యవధి లోని మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల 523 పురాతన డీ.ఎన్.ఏ. లను విశ్లేషించి ఆ ప్రాంతాల్లో  మానవ సమూహాలెలా వర్షిల్లాయో వివరిస్తూ రాసిన వ్యాసం. ఈ రెండు వ్యాసాలు భారతదేశ  చరిత్ర, పురాతత్వ సంస్కృతుల విషయంలో ఓ పెద్ద దుమారాన్నే లేపాయి.

ఆర్యుల దండయాత్ర నిజమా కాదా… వ్యవసాయం మనం ఇరాన్ నుండి అరువు తెచ్చుకున్నామా లేక మనమే కనుగొన్నామా, యామ్నాయులెవరు వారికి భారతదేశంతో  సంబంధం వంటి ప్రశ్నలెన్నో..వాదోపవాదాలెన్నో… వ్యాఖ్యానాలెన్నో..రాజకీయాలెన్నో. ఏదీ ఇదమిత్థం కాదు. ఎవరి వ్యాఖ్యానం వారిది. అయితే ఆవ్యాసాల్లో ఏముందో తెలుసుకుంటే ఆ వివాదాల వేడిలో చలి చాచుకునే బదులు కన్యాశుల్కం లో రామప్పంతులు చెప్పినట్లు మనం కూడా మన వ్యాఖ్యానం వెలిగించుకోవచ్చు.

(ఇది భాగం 1. భాగం 2 మరో రోజు)

– విప్పగుంట రామ మనోహర

RELATED ARTICLES

Most Popular

న్యూస్