Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసిరివెన్నెల లేని గేయసీమ

సిరివెన్నెల లేని గేయసీమ

Human Life – Sirivennela-Literature
పాట ఒక వ్యాకరణం.

అది కృతకంగా కాకుండా గంగ పొంగులా సహజంగా ఉండాలి. ఆ వ్యాకరణం తెలిసి రాసినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- ఒక వెలితి.

పాట ఒక రచనా శిల్పం.
యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను అందమయిన శిల్పంగా తీర్చిదిద్దిన గేయ శిల్పుల్లో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- పూడ్చలేని లోటు.

పాట ఒక సందేశం.
మాటల మధ్య మాటలు మోయలేనంత భావాన్ని దట్టించి, ఒక్కొక్క మాటలో ఒక్కో గ్రంథమంత సందేశాన్ని నింపినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- బాధాకరం.

పాట ఒక సంగీతం.
వెంట వస్తుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వీనుల విందు అవుతుంది. ఆ సంగీత స్వరాక్షరాల్లోకి ఒదిగేలా అక్షరాలను కూర్చడం ఒక కళ. అది చివరి ప్రాస అక్షరాన్ని ముందు రాసి…తరువాత అక్షరాలను పేర్చుకుంటూ పొతే వచ్చే నీచ ప్రాసల ప్రహసన విద్య కాదు. ఒకే మాటకు అనేకానేక పదాలు వెంటపడి మమ్మల్ని వాడుకో అని రచయితను మొహమాటపెట్టే పద సంపద సముద్రాన్ని ఔపోసన పట్టిన సిద్ధ విద్య. సాధ్య విద్య. ఇలాంటి సిద్ధ, సాధ్య విద్యలతో పాటలు రాసినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- దిగ్భ్రమ.

పాట ఒక ధర్మం.
ఒక దేశానికి తనదయిన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వారసత్వం, విలువలు, ఆదర్శాలు ఉంటాయి. కాలపరీక్షలో అవి నిలిచి ఉంటాయి. అవి ఒక ధర్మంగా రూపుదిద్దుకుంటాయి. సమాజం పాటించి తీరాల్సిన ధర్మంగా వాటిని పాటల్లో ప్రతిఫలింపచేయడం ఒక తపస్సు. ఇలా తపస్సుగా పాటలు రాసినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- నష్టం.

పాట ఒక భాష.
మాట్లాడేదంతా భాషే. రాసేదంతా భాషే. శ్లోకంలో, పద్యంలో, పాటలో, జానపదంలో, కవితలో, వచనంలో, చివరికి మాటగా బయటికి పలకకకుండా లోలోపల అనుకున్నా…అంతా భాషే. ప్రతి భాషకు దాని సొంత వ్యక్తీకరణ పద్ధతి, ఉచ్చారణ, నుడికారాలు ఉంటాయి. మాట్లాడుతున్నంత సహజంగా పాట రాయడం కుదరదు. ఆ రాస్తున్న పాటలో అలవోకగా నుడికారపు అందచందాలను పట్టి అలంకరించడం ఇంకా కష్టం. ఇలా మాటను పాటగా చేసి, ఆ పాటలో పదహారణాల తెలుగుకు పట్టం కట్టినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడంతో ఒక నైరాశ్యం.

Sirivennela Seetharama Sastry Explored All Emotions Practices Through Song :

పాట ఒక ఓదార్పు.
తెగిన రెక్కలకు పాట తన చరణాలతో కొత్త రెక్కలు తొడుగుతుంది. కొడిగట్టిన దీపం ప్రమిదలో చమురుపోసి మళ్లీ దీపాన్ని వెలిగించి కొత్త వెలుగులు పంచుతుంది. అలుముకున్న చీకట్లలో చిరువెలుగులు తెస్తుంది. కాళ్లు తెగిపడుతున్నా నడిచే సత్తువను కూడగడుతుంది. భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. వెన్ను తట్టి నిలబెడుతుంది. కర్తవ్యం బోధిస్తుంది. కొత్తదారులు చూపూతుంది. ఇలా పాటకొక పరమ ప్రయోజనం ఉందని తెలిసి పరమ ప్రమాణాలతో పాట రాసినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడంతో ఒక శూన్యం.

పాట భాషకు ఒక సోపానం.
సిరివెన్నెల లేని వేళ వచ్చే తెలుగు పాటలో ఇక తెలుగు వెతుక్కోవడం ఎలా అని ఒక నిర్వేదం.

పాట ఒక చర్చ.
పాటల్లో ప్రయోగించిన మాటల మీద నాలాంటి అర్భకులతో గంటలు గంటలు మాట్లాడుతూ, అర్థాన్వయాలను విడమరచి చెప్పినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోతే…తెలుగు పాటకు ఇక కొలమానం ఎలా చెప్పాలో తెలియక నిట్టూర్పు.

పాట ఒక మహా వృక్షం.
సిరివెన్నెల లేని గేయసీమలో…
ఆముద వృక్షాలనే మహా వృక్షాలుగా అంగీకరించాల్సి వస్తుందని తెలుగు భాషాభిమానిగా, సాహితీ విద్యార్థిగా ఆందోళన. భయం. అంతే.

నువ్వు లేవు నీ పాట ఉంది
ఇంటి ముందు జూకా మల్లె తీగల్లో అల్లుకొని
లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని
నీరవంగా నిజంగా వుంది
జాలిగా హాయిగా వినబడుతూ వుంది
శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకి తెస్తోంది”

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్