Saturday, March 1, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకన్నీటి జలపాతాల్లో...ఆగకసాగే బతుకుగానం..

కన్నీటి జలపాతాల్లో…ఆగకసాగే బతుకుగానం..

Life Philosophy in cinema lyrics
బతుకంతా పాటే..

పాటంతా బతుకే..
ప్రాణాలదేముంది..
గమనమే గమ్యం..
బాటలోనే బతుకు..
వేరే ఉనికి ఏముంటుంది..

వేటూరికి పాటవారసుడు..
ఆయనకి ప్రత్యక్ష శిష్యుడు.
పరోక్ష ప్రత్యర్థి..
అవును..


సీతారామశాస్త్రికి అప్పట్లో వేటూరి స్థానంతోనే పోటీ.
అందుకే తొలిపాటల్లో పాండిత్యం పొగలుకక్కేది..
త్రివిక్రమ్ ఒక సందర్భంలో అన్నట్టు
అక్కడ స్పేస్ లేకపోయినా సృష్టించుకునేవాడు.
పాటవిన్నవాళ్ళు “ఎవరీ చయిత” అని తిరిగిచూసేలా చేశాడు.
ప్రాగ్దిశ వేణియలు, దినకర మయూఖతంత్రులు అలా వచ్చినవే..
సీతారాముడికి మరో ఇష్టం శ్రీశ్రీ
శ్రీశ్రీ ప్రభావంతోనే కావచ్చు..
సిరివెన్నెల పాటల్లో ప్రబోధాలు గర్జిస్తుంటాయి.
అప్పుడప్పుడు పాట గ్రామర్ని దాటిపోతుంటాయి.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
లాంటి పక్కా వచనాన్ని కూడా పాటగా ఒప్పించేస్తాడు సిరివెన్నెల.
వేటూరి లాగా రాయగలడు.
శ్రీశ్రీ లాగా రాయగలడు.
అవసరమైతే, అన్నమయ్యే రాశాడేమో అనిపించగలడు.
ఒకరకంగా సీతారామశాస్త్రి అన్నప్రాసనలోనే ఆవకాయ రుచిచూపించేసాడు.
తనని తాను నిర్వచించుకునేలోగా
పాటతో చెడుగుడు ఆడుకున్నాడు..


రాత తెలిసిన వాడు..
సాహిత్యం లోతు చూసిన వాడు..
సీతారామశాస్త్రి రాయలేని పాటలేం లేవు
దేశభక్తి పాటలు రాశారు..
దైవభక్తి పాటలు రాశారు
ప్రేమపాటలు కొన్ని ..
శ్రమపాటలు కొన్ని..
కవిత్వం కొంత..
కర్తవ్యం ఇంకొంత..
సంస్కృత సమాసాల్లో నిండా ముంచిన పాటలు..
తేట తెలుగులో మాట్లాడినట్టుండే పాటలు
ఒకటా రెండా..
వేలకొద్దీ పాటల వెలుగులో వెన్నెలని పోల్చుకోవడం ఎలా?
సిరివెన్నెల సంతకాన్ని గుర్తుపట్టడం ఎలా?.

ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల..
వేలకొద్దీ పాటలు రాసిన వాళ్లే….
ఏ పాటకైనా ప్రాణాలివ్వగల విధాతలే..
కానీ, తమదంటూ సంతకం చేయాల్సి వస్తే..
తన ఉనికిని పాటలో వెతుక్కోవాల్సి వస్తే..
ఒక్కొక్కరికీ ఒక్కో నీడ వుంటుంది.
ఆత్రేయ మనసుని పెనవేసుకున్నాడు..
వేటూరి వలుపుని అల్లుకున్నాడు..
అలాగే సిరివెన్నెల బతుకు అర్థాన్ని పాటలో వెతుక్కున్నాడు.
తొలినాటి పాటల్లోనే
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా అని ప్రశ్నించి..
తన బాట బతుకుపాట అని చెప్పకుండానే చెప్పేశాడు.
సిరివెన్నెలకి పాట అంటే..
సమయంపై చిరకాలం చెరగని సంతకం
లోకం చదివే తన కథకి
తానే చెప్పుకున్న శ్రీకారం

సిరివెన్నెల కి పాట అంటే..
మల్లెల దారిలో
మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల్లో
కన్నీటి జలపాతాల్లో
ఆగకసాగే బతుకుగానం..

సిరివెన్నెలకి పాటలంటే..
ఊపిరి వున్నన్నాళ్లూ నడిపే చేయూత
యదలయలను కుశసలములడిగిన గుసగుస.

సిరివెన్నెలకి పాటంటే
ప్రతి ఉదయం తాజాగా పుట్టే
తుదిలేని కథ
ఇంకొన్ని జన్మాలకు సరిపడే
శృతిలయల సొద

సిరివెన్నెలకి పాటంటే
కనుపాపలో కరిగిపోని
కలలకాంతి..
కాలం అనేదే లేని చోట
పెంచుకునే పాటల తోట..

సిరివెన్నెలకి పాటంటే
ప్రతిఘడియ..
ఓ జన్మగా మారే మహిమ.

సిరివెన్నెలకి పాటంటే,
తనువంతా విరబూసిన
గాయాల వరమాల..

బతుకు మథనంలో
విషమైనా, రసమైనా
సిరివెన్నెలకి పాటే..

నీదని పిలిచే బతుకేదంటే..
అతను పాటనే చూపిస్తాడు

కాలంతో నర్తించి..
పాటగా సుమించినవాడే సిరివెన్నెల..

ఆయనకి బతుకంటే పాటే..
ఆయన పాటంటే, బతుకే..

అందుకే ఇవాళ
గాలిపల్లకిలో ఊరేగివెళ్ళిపోయన పాటలో ఆయనే ..
గొంతువాకిలి మూసి మూగబోయిన పాటలోనూ ఆయనే..

– కే.శివప్రసాద్.

Also Read :

సిరివెన్నెల లేని గేయసీమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్