నార్వేలో అతి కొద్దిమంది మాట్లాడే ఒక మాండలిక భాషలో రాసే రచయిత ఫోసేకు ఈ ఏటి నోబెల్ సాహిత్య అవార్డు వచ్చిన సందర్భంగా పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి గొప్ప తెలుగు కవులకు జాతీయ, అంతర్జాతీయ సాహిత్య అవార్డులు రాకపోవడం మీద నేనొక వ్యాసం రాశాను. ఆ లింక్ ఇది.
దీనికి పాఠకులు, పండితులు, రచయితలనుండి విశేషమయిన స్పందన వచ్చింది. అందులో కొన్ని నలుగురితో పంచుకోవాల్సినవి.
“వ్యవహారాజ్ఞత అంటని
వైదిక జాతకుడు
పుట్టపర్తి నారాయణా చార్యులు (28/3/1914 -01/09/1990)
“ఎవని పదమ్ములు
శివ తాండవ
లయాధి రూపమ్ములు..
ఎవని భావమ్ములు
సుందర
శివలాస్య రూపమ్ములు..
అతడు పుట్టపర్తి…
అభినవ కవితా మురారి”
1990 సెప్టెంబరు 1. ఉదయం 9.40 ప్రాంతం లో కడప 7 రోడ్ల జంక్షన్ లో స్టేట్ బ్యాంక్ లో డ్యూటీ కి ప్రవేశించాను.
ఇంకా సీట్ దగ్గరకి చేరక ముందే ఒక మిత్రుడు దగ్గరకు వచ్చి ‘ పుట్టపర్తి వారు పోయారు..’ అన్నాడు.
అంతే.
వెంటనే ఆ రోజు కు సెలవు చీటీ ఇచ్చి మోచంపేట చేరుకున్నాను.
అంతటి మహాకవి , పండితుడు , ఆధ్యాత్మ నిష్ణాతుడు పరమపదిస్తే
నివాళి కి గుమి కూడ వలసినంత మంది అక్కడ లేరు.
చుట్టూ ఉన్నది బహుశా వారి
‘ ఆధ్యాత్మ శిష్యులు ‘….!
ఆ రోజు మధ్యాహ్నం దాటాక రామకృష్ణ హై స్కూల్ ఆవల ఉన్న మరుభూమి కి చేరిన వారి అంతిమ యాత్ర లో పాల్గొన్న కొద్ది మంది లో నేనూ ఉన్నాను.
ఆపైన కొన్నాళ్లకు రామకృష్ణ సమాజం ( అప్పటి లైబ్రరీ భవనం) లో జరిగిన సంతాప సభలో నేనూ మాట్లాడాను.
ఆయన తనయ నాగ పద్మిని కూడా కన్నీటి తో మాట్లాడారు ఆ సభ లో.
ఆయన నాకంటే 39 ఏళ్ళు పెద్ద. నాపైన ఆయన చూపిన వాత్సల్యం మరువ లేనిది.
‘Paradise Lost చదవాలి రా’ అన్నాడొక సారి ఆ మహనీయుడు నాతో. నా దగ్గరున్న 12 Books Of Paradise Lost ‘ సగర్వంగా ఆ కారణ జన్ముడి
కరకమలాలు చేర్చాను.
కొంత కాలమయ్యాక ‘ ఇదిగో రా నీ పుస్తకం ‘ అంటూ తిరిగి ఇవ్వబోయాడు ఆయన.
పుస్తకం తీసుకుని తెరిస్తే పేజీ పేజీ కీ ‘అండర్
లైన్లూ’ మార్జిన్ లలో పెన్సిల్ తో నో (పెన్ తో నో?) రాసుకున్న ‘నోట్స్’…!
నేను MA విద్యార్థి గా కూడా అంత దీక్షగా చదవలేదు ఆ Miltonic Magnum opus ని. అందుకే గా ఆయన ‘పుట్టపర్తి’ అయింది….!!!
‘ఏదైనా నోటికి నేర్చుకుంటేనే రా నాకు చదివిన తృప్తి ‘ అన్నారొక సారి ఆయన నాతో. I am sure , he must have got ‘Paradise Lost’ by heart….
1987 లో నేమో , ఒక సారి
‘ నీకు సౌందర్య లహరి చెప్పాలని ఉంది రా ‘ అన్నారు. నేనడగని వరం అది !!!
నూరు రోజుల పైబడి ప్రతి దినం ఉదయం 9 గంటల ప్రాంతాన ఆఫీసుకు వెళ్తూ (ఒక లాంగ్ నోట్ బుక్కు , పెన్ తో ) వాళ్ళ ఇంటి ముందు నా TVS 50 ఆపి గురు గృహ ప్రవేశం చేసేవాడిని.
రోజుకు ఒక శ్లోకం… తాత్పర్యం , నిగూఢ నిమిత్తాలూ బోధించారు…ధన్యోస్మి !!!!
వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించాక మొదటి సత్కారం
కడప స్టేట్ బ్యాంక్ లో పని చేసే
ఆయన పూర్వ విద్యార్థులం కొందరం ఆ కార్యాలయం ఆవరణ లో నే నిర్వహించాం.
ఆ సమావేశం లో ఆయన పలుకులు నేటికీ గుర్తుకొస్తుంటాయి…
“జరిగే ఈ సత్కారాలూ, లభించే అతిశయోక్తి పొగడ్తలూ ఆస్వాదించి తబ్బిబ్బై, నేనేదో మహనీయుడి ననే అహంకారం నాలో ప్రవేశించ రాదని ఆ శ్రీనివాసుడి ని ఎప్పుడూ ప్రార్ధిస్తాను” అని ఆ రోజు ఆయన మాట.
That was Puttaparthi….!
‘ఈ సాహిత్యం అంతా లేని పోని బరువు రా… వచ్చే జన్మ లో సంగీత ప్రపంచం లో పుట్టించ మని భగవంతుడి కి నా నివేదన ‘ అన్నారింకొక సారి ఆయన నాతో….
-తిరువాయపాటి రాజగోపాల్, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, తిరుపతి
95731 69057, (పుట్టపర్తివారి ఆంతరంగిక శిష్యుడు)
“మీరు పుట్టపర్తి నారాయణాచార్యులకు రావాల్సినంత గుర్తింపు రాలేదని బాధపడుతూ రాశారు. నిజానికి అంత బాధపడాల్సిన పనిలేదు. ఆయన మా ఊరి పక్కన చియ్యేడులోనే పుట్టారు. తాడిపత్రిలో అనేకసార్లు ఆయనే శివతాండవం పాడి, వ్యాఖ్యానం చెప్పగా విన్న అదృష్టవంతుడిని నేను.
యూరోప్ లో చాలాకాలం తిరిగాను. అక్కడి వ్యవహారాలు నాకు బాగా తెలుసు. అయిదు లక్షల మంది, లక్ష మంది మాట్లాడే భాష అన్నది కాదు ప్రామాణికం. ఇంగ్లీషులోకి అనువాదం అయి ఉండడం ప్రధానం. ఆ కోణంలో ఫొసేకు నోబెల్ వచ్చింది. పుట్టపర్తివారి రచనలు అలా ఇంగ్లిష్ లోకి అనువాదం కాలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఇంగ్లిష్ లోకి (అది కూడా ఒక ఇంగ్లిష్ కవితో కలిసి) అనువదించకపోతే నోబెల్ వచ్చేది కాదు.
మన కాలానికి పుట్టపర్తి ఒక అద్భుతం. అనేక భాషల్లో ఆయన ప్రతిభ ఊహాతీతం. కానీ ఆయన ఎంచుకున్న వస్తువు, తెలుగు దాటి వెళ్లకపోవడంతో అంతర్జాతీయ అవార్డుల దృష్టికి వెళ్లవు. అవార్డులతో ముడిపెట్టి బాధపడడం కంటే…వారి ప్రతిభకు మైమరచిపోవడం, గుండె నిండా పొంగిపోతూ…వారి రచనలు చదువుకోవడమే ఉత్తమం”.
-బయప్ప రెడ్డి, రిటైర్డ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్, ఎస్ కె యూనివర్సిటీ, అనంతపురము
పుట్టపర్తిగారికి అన్యాయం జరిగిన మాట నిజమే. మన గురజాడ, గుంటూరు శేషేంద్ర, పింగళి…ఇలా చెప్పుకుంటూపోతే…ఇంకా లెక్కలేనంతమంది ఎన్నెన్నో అత్యున్నత అవార్డులకు అర్హులు. తెలుగువారికి ఎందుకు అవార్డులు రాలేదో అన్న కారణాలను కూడా విశ్లేషిస్తూ మరో కథనం రాయండి.
-గొట్టిముక్కల కమలాకర్, రచయిత
పుట్టపర్తివారికి తగిన గుర్తింపు రాలేదన్నది నిజం. ఉమ్మడి రాష్ట్రంలో హైస్కూల్ తెలుగు పాఠంలో వారి శివతాండవం ఉండేది. ఇప్పుడుందో లేదో తెలియదు. అనేక భాషల్లో వారిది అనన్యసామాన్యమయిన పాండిత్యం. మీ వ్యాసం నన్ను కదిలించింది.
-హనుమకొండ లక్ష్మణ మూర్తి, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు, తూప్రాన్, తెలంగాణ
పుట్టపర్తివారి గురించి దాదాపు 30 ఏళ్లుగా మీరు సందర్భం సృష్టించుకుని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఒక కవిని, ఆయన రచనలను ఇలా ఆవాహన చేసుకోవడం కొత్తతరం ఆదర్శంగా తీసుకోవాలి. వారి ప్రతిభకు పొంగిపోతూ…మీ ఆవేదనలో పాలు పంచుకుంటూ…
-శ్రీనివాస రెడ్డి, విద్యుత్ శాఖ ఉద్యోగి, పెనుకొండ, సత్యసాయి జిల్లా.
ఇంకా చాలా ఉన్నాయి. అందరిదీ ఒకే మాట. ఒకే బాధ. ఫోన్లు చేసిన, మెసేజులు, మెయిల్స్ పంపిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018