వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు గానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు అనేది సిద్ధాంతం. దొరికిన వాళ్లనే దోషులని శిక్షిస్తే పోలా అనేది పోలీసు సిద్ధాంతం అనుకోవాలి. అందుకే చాలాసార్లు వందమంది నిర్దోషులు శిక్ష అనుభవిస్తూ దోషులు బయట తిరుగుతూ ఉంటారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే పై వ్యాఖ్యకు ఉదాహరణ.
ముందుగా ‘అక్యూజ్డ్ ‘ అనే ఒక సినిమా కథ చెప్పుకుందాం. లండన్ శివార్లలో తల్లిదండ్రులు ఉంటే తాను ఒక్కడే చదువుకోసం మహానగరంలో ఉంటాడు హ్యారి భవేసర్. ఒకరోజు లండన్ మెట్రోలో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తూ ఉంటే మరో స్టేషన్ లో బాంబు పేలుళ్లు జరుగుతాయి. ట్రైన్ లో ఉండగానే ఆ వార్త తెలుస్తుంది . అమ్మానాన్నలను కలిశాక ఈ విషయం మీదే మాట్లాడుకుంటారు కూడా. అనుమానితుడి ఊహా చిత్రం హ్యారిని పోలి ఉండటం మీద వాళ్ళమ్మ ఆట పట్టిస్తుంది కూడా. అమ్మానాన్నలు ఊరెళ్ళడంతో హ్యారి తన కుక్కతో కలసి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈలోగా సోషల్ మీడియా ద్వారా అతని మిత్రులే హ్యారియే నిందితుడని చెప్తారు. అతన్ని తిట్టడం మొదలెడతారు. తనకి సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోరు. ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ కూడా నిందిస్తుంది. ఈలోగా ఇటువంటి వాటికి స్పందించి ఆచూకీ కనుక్కుని దాడి చేసే మూకలు హ్యారీ ని ఎలాగైనా చంపాలని ప్రయత్నిస్తాయి. అష్టకష్టాలు పడి గాయాల పాలై బయటపడతాడు. ఈ లోపు నిజం కూడా బయటికొస్తుంది.
సినిమా చూస్తున్నంత సేపూ మనం కూడా హ్యారీతో పాటు ప్రయాణిస్తాం. అతను బయట పడాలని కోరుకుంటాం. ఏ తప్పూ చేయకపోయినా శిక్ష అనుభవించాడని కంట తడి పెడతాం. ఉన్మాదుల చేతుల్లో సోషల్ మీడియా వెర్రితలలు వేయడం నిస్సహాయంగా చూస్తాం. ఇంకా వివరంగా చూడాలంటే నెట్ ఫ్లిక్స్ లో ఉందీ ‘అక్యూజ్డ్ ‘సినిమా.
సరిగ్గా ఇలాగే జరిగిందొక సంఘటన. పదిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దుండగుడు ప్రవేశించి అడ్డుకున్న సైఫ్ ని కత్తితో పొడిచి పారిపోయాడు. అనేక ఆపరేషన్ల అనంతరం అయిదురోజుల్లోనే సైఫ్ కోలుకుని కులాసాగా ఇంటికొచ్చాడు. ఇంతవరకూ బాగానే ఉంది. సీసీ టీవీ లో ఉన్న చిత్రం ఆధారంగా పోలీసులు శరవేగంగా స్పందించి ఆకాశ్ కనోజియా ని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఛత్తీస్ ఘడ్ నుంచి వచ్చి టూర్స్ కంపెనీ లో డ్రైవరుగా పని చేస్తున్నాడు. పోలీసులు అతని ఫోటో వైరల్ చేసేసరికి సోషల్ మీడియా వెంటాడింది. ఇంతలో ఇతనుకాదు నిందితుడు బంగ్లాదేశ్ వాసి అని తెలిసింది. ఆకాశ్ ను విడుదల చేశారు. అప్పటికే అతని ఉద్యోగం పోయింది. టీవీ ల్లో ఫోటోలు చూసి చేసుకుందామనుకున్న పెళ్లి తప్పిపోయింది. అతను రోడ్డు మీదికి వచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన తన ఫోటోలు తొలగించాలని న్యాయపోరాటం చేస్తున్నాడు. సైఫ్ ఇంటిముందు ఉద్యోగం కోసం దీక్ష చేస్తానంటున్నాడు. ఈ బడుగుజీవికి బాసటగా వస్తుందా సోషల్ మీడియా ?
-కె.శోభ