Unfair Affairs: మన జీవితాల్లో సెల్ ఫోన్ తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని గుప్పిట్లో పట్టి చూపిస్తోంది సరే, ఆ గుప్పిట్లో చిక్కి ఊపిరందక పోగొట్టుకున్న ప్రాణాల విలువ తెలుస్తోందా ఎవరికైనా? నిజమే చిరు వ్యాపారుల నుంచి బడా బాబులవరకు ఫోన్ తోనే పనులు జరగడం వరకు బాగానే ఉంది. పిల్లలు చదువుకు సంబంధించిన సందేహాలు తీర్చుకుంటే మంచిదే. ఏ ఆటవిడుపూ లేని మహిళలు తమ స్నేహితులతో, కుటుంబంతో మాట్లాడుకోవడానికి చక్కటి సాధనమే. రకరకాల యాప్స్ తో, ఇంటిముందుకే కావలసినవన్నీ తెచ్చిపెట్టగల సామర్ధ్యం బాగానే ఉంది. కానీ అంతవరకే పరిమితమవుతున్నామా? సెల్ ఫోన్ కారణంగా ఎన్ని కుటుంబాల్లో గొడవలు, ఆత్మహత్యలు జరగడం లేదు? ఇవి ఎవరి ఖాతాలో వెయ్యాలి? తాజాగా జరిగిన రెండు ఆత్మహత్యలు ఈ ప్రశ్నలు రేకెత్తించక మానవు.
కరోనా కారణంగా అందరికీ రకరకాల కారణాలపై సెల్ ఫోన్ దగ్గరైంది. ఆర్థికంగా స్తొమత లేనివారుకూడా అప్పులు చేసి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొని ఇవ్వాల్సి వచ్చింది. డబ్బున్నవారి పిల్లలు ఖరీదైన ఫోన్లతో చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వారికి స్కూల్ దశలోనే డ్రగ్స్, ఇతర వ్యసనాలు అలవాటు కావడానికి స్మార్ట్ ఫోన్లు ప్రధాన కారణం. వీరిలో బలహీన మనస్కులు తొందరగా లొంగిపోతారు. పైగా టీనేజ్ ప్రభావం… ఇవన్నీ గమనించడానికి తల్లిదండ్రులకు సమయం ఉండదు. గమనించేసరికి నష్టం జరిగిపోతుంది. అంతెందుకు? విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య కూడా అనుకోని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ మధ్య ఒక వార్త వచ్చింది. స్టూడెంట్ తో ప్రేమలో పడిన టీచర్ అతన్ని తీసుకుని చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. పోలీసులు అతి కష్టం మీద పట్టుకుని ఆ టీచర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపించారు.
మళ్ళీ దాదాపుగా అలాంటి సంఘటనే జరిగింది. ఆమె బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. ముగ్గురు పిల్లలు. సాధారణంగా ఈ వయసులో పిల్లల చదువులు, ఇతరత్రా తీరిక లేకుండా ఉంటారు. ఈ టీచర్ గారికి ఒకనాడు మిస్డ్ కాల్ వచ్చింది. ఈవిడ మళ్ళీ ఆ నెంబర్ కి కాల్ చేసింది. అవతలివైపు ఇంజనీరింగ్ పూర్తి అయి ఉద్యోగాన్వేషణలో ఉన్న యువకుడు. ఈ ఇద్దరి మాటలు హద్దులు దాటాయి. తాను ముగ్గురు పిల్లల తల్లినని, గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని మరచిపోయింది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆమెకి పెళ్లయిన విషయం తెలియని యువకుడు చేసుకుందామనే అనుకున్నాడు. ఇంతలో ఆమెకి పెళ్లయిన విషయం తెలిసింది. దూరం పెట్టాడు. తట్టుకోలేక పోయిందామె. చచ్చిపోతానని బెదిరించింది. దాంతో అతనూ మరణానికి సిద్ధపడ్డాడు. పురుగుల మందు తాగి మొదట ఆమె, ఆ విషయం తెలిసి అతను ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యవయసు ప్రలోభాలు మగవారిలో ఎక్కువంటారు. ఇక్కడ అన్నీ తెలిసి చదువుకున్న మహిళ ఇలా చేయడం ఆమె కుటుంబానికి తీరని వేదన కలిగించింది. ఎదిగొచ్చిన కొడుకుని పోగొట్టుకున్న కుటుంబం ఒకపక్క , తల్లిని పోగొట్టుకున్న ఎదిగిన పిల్లలు మరో పక్క శోకంలో మునిగారు.
ఈ సెల్ ఫోన్ మరణాలకు ఎవర్ని బాధ్యుల్ని చెయ్యాలి?
-కె. శోభ