మంగళగిరిలో ఉదయం నడకకు వెళ్లి వచ్చేసరికి రెండు పత్రికలున్నాయి. తెరవగానే ఒక ప్రయివేటు నర్సరీ కరపత్రాలు చేతిలో పడ్డాయి. చెట్లంటే ఇష్టం, కనపడిన ప్రతిదీ చదవడం అలవాటు ఉండడంతో వెంటనే చదివాను. కడుపు నిండిపోయింది. ఆ కరపత్రంలో ఉన్న సమాచారమిది.
“మనమందరం బ్రతకాలంటే ప్రాణవాయువు అవసరం. కొన్ని సెకనులు ప్రాణవాయువు పీల్చకపోతే మనము చనిపోతాము. కాని నీళ్ళు త్రాగకపోతే కొన్ని రోజులు బ్రతకవచ్చు. ఆహారము తినకపోతే కొన్ని నెలలు బ్రతకవచ్చు. అలాంటి ప్రాణవాయువు యొక్క అవసరం నీటికంటే, ఆహారము కంటే ప్రాణవాయువు ఎంత అవసరమో ఆలోచించండి.
అలాంటి ప్రాణవాయువును పీల్చుకొని ఊపిరితిత్తులు ఆటోమాటిగ్గా పనిచేస్తాయి. కాని అసలు ప్రాణవాయువు పీల్చుకోకపాతే మన బ్రతుకు ఏమవుతుందో ఆలోచించండి. ఒక్కసారి మనము ఎప్పుడైనా హాస్పటల్స్ లో చేరి ఒక్క రెండు రోజులుండి అక్సిజన్ సిలిండరు పెట్టించుకొంటే ఎంత డబ్బులు తీసుకుంటారో హాస్పటల్స్ లో. మరి అంత ప్రాణవాయువు 100 సంవత్సరాలపాటు నిరాటంకముగా పీల్చుకొని జీవించటానికి మనకు సమకూర్చిన చెట్లు బిల్లు కట్టమంటే ఈ ప్రకృతికి మనము ఎన్నికోట్లు బిల్లు కట్టాలో ఆలోచించండి. అందుకనే మనుషులు బాగుండాలంటే చెట్లు బాగుండాలి. ప్రకృతి బాగుండాలి, పంచభూతాలు బాగుండాలి.
పంచభూతాలను ఆరాధించే సంస్కృతి భారతీయ సంస్కృతి. ఈ ప్రపంచంలో ఏ దేశస్తులకి ప్రకృతికి నమస్కరించి వాటికి పూజలు చేసే సంస్కృతిలో చెట్లుకి బొట్టులు పెట్టటం, పూజలు చేయడం, ప్రదక్షిణలు చేయడం, వాటిని ఆరాధించడం అనే సంస్కృతి ఋషులు ఇచ్చారు. ఎందుకంటే మనిషి జీవితం మొక్కల మీదే ఆధారపడియున్నది. ఆ మొక్కలు అందించే ప్రాణవాయువు మీదే ఆధారపడియున్నది.
ఇప్పుడు చూస్తే మనుషులు ఎక్కువ అయ్యారు. మొక్కలు తక్కువైనాయి కాబట్టి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అవుతుంది. పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కెమికల్స్ గాలిలో ఎక్కువ అవుతుంది. కాని శుద్ధి చేసే మొక్కలు తగ్గిపోతున్నాయి. గదుల మధ్యలో ఉండే వారికి, ఎ.సి.ల మధ్యలో ఉండే వారికి వదిలిన కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు గనక గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజులలో ఎయిర్ ప్యూరిఫికేషన్ చేసే మొక్కలు ప్రకృతి చక్కగా ప్రసాదించింది. అలాంటి విజ్ఞానాన్ని మీకు అందించే మొక్కలను మనం తోడుగా పెంచుకోగలిగితే చాలా బాగుంటుంది. కెమికల్ పొల్యూషన్ని, కార్బన్ డయాక్సైడ్ని ఎక్కువగా గ్రహించి మంచి ప్రాణవాయువును ఇచ్చే, గాలిని శుద్ధి చేసే మొక్కలను పెంచుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
మొక్కలనే ఫ్రెండ్స్ చేసుకొని వాటితో మనము సహజీవనం చేస్తే మన ఇంట్లో ఎక్కువగా మొక్కలు నాటుకుంటే అవి విడుదల చేసే ఆక్సిజన్ని మనము స్వీకరించి ఎక్కువగా ఆరోగ్యంగా జీవించుటకు అవకాశం కలుగుతుంది.
మనకు కావలసినంత ఆక్సిజన్ని పొందగలుగుతాము. ఎనర్జీ లెవల్స్ పెరిగి హార్మోన్స్ ప్రొడక్షన్ పెరిగి మనసు ప్రశాంతముగా, మానసికంగా యాక్టివ్ గా ఉండవచ్చును.
వృద్ధాప్యాన్ని జయిచండి.
ఆనందంగా ఆరోగ్యంగా గడపండి.
మీకు కావలసిన మొక్కలు దొరుకుచోటు భాస్కర నర్సరీ గార్డెన్స్, ఆర్టీసి బస్టాండ్, మంగళగిరి. సెల్: 9948387519.
గార్డెన్ వర్క్స్, ల్యాండ్ స్కేపింగ్, టెర్రస్ గార్డెన్స్, యానమల్ డిజైన్స్ అందముగా చేయబడును. ఫంక్షన్స్ కు మొక్కలు రెంటల్ పర్పస్ కలదు. “సంప్రదించగలరు”.
వెంటనే ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకుని ఆయన గురించి కనుక్కున్నాను. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యానవన శాఖలో పనిచేసి పదవీ విరమణ తరువాత మంగళగిరి ఎర్రబాలెం దగ్గర నర్సరీ పెట్టుకున్న అందె భాస్కర్ రావు స్వయంగా రాసిన కరపత్రమది.
వ్యాపారం కంటే చెట్లు నాటాల్సిన, చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం మీద చైతన్యం కలిగించాలన్న తపన ఆయన మాటల్లో కనిపిస్తోంది. కరపత్రం నన్ను కదిలించింది సార్…చాలా గొప్పగా రాశారు…మీ తపనకు జోహార్లు అన్నాను. ఆయన చాలా సంతోషించారు.
ఒకటికి రెండు సార్లు ప్రాణవాయువునిచ్చే చెట్ల గురించి ఆయన ఆవేదనను చదవండి. అర్థం చేసుకోండి. మన బతుకులు పచ్చగా పది కాలాలు నిలబడాలంటే పుడమికి సతత పత్రహరితంతో పట్టు చీరలు కట్టకపోతే...మనం బతికి బట్టకట్టలేమని తెలుసుకోండి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]