Thursday, November 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏ దిల్ మాంగే మోర్ మాయా బజార్!

ఏ దిల్ మాంగే మోర్ మాయా బజార్!

టీవీ సీరియళ్లు, దాన్ని దాటి వెబ్ సిరీస్… జనాలకు మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నాయి.

అందాల ఆరబోతలు (ఇప్పుడు స్రీలు.. పురుషులు కూడా) నగలు, డబ్బు దస్కం, ఫార్మ్ హౌస్ లు… వీకెండ్ పార్టీలు, విదేశీ టూర్స్, సెక్స్ విలాసాలు, వైభోగాలు.
ఒకప్పుడైతే ఎప్పుడో కానీ సినిమా చూసేవారుకాదు. ఇప్పుడు రోజంతా సొల్లు ఫోన్ పైన.. టీవీ ముందు …..
మాస్ బ్రెయిన్ వాష్ …
బతికితే ఇలాగ బతకాలి అనే చాలా మంది డిసైడ్ అయిపోయారు.

అడిగితే అందం రాదు…
పుట్టుక… జన్యువులు… తీసువుకొనే ఆహారం… దిన చర్య… జీవన విధానం…
ఇంత ఓపిక లేదు.
షార్ట్ కట్స్ కావాలి.
సర్జరీలు, హార్మోనల్ ఇంజెక్షన్లు, హెర్బల్ మందులు, బ్యూటీ పార్లర్లు…

డబ్బు కావాలంటే కష్టపడాలి… స్మార్ట్ వర్క్ చెయ్యాలి…
చదివింది చెత్త చదువు…
తెలివి అంతంత మాత్రం…
కష్టపడే తత్త్వం లేదు. డబ్బు తేరగా వచ్చేయాలి.
సినిమాల్లో సీరియల్లో చూసినట్టు విలాసంగా బతికెయ్యాలి.

నా దారి అడ్డదారి!
తమాయించుకోలేని కోరికలు.
వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు.

నలుగురిలో గొప్ప అనిపించుకోవాలి. ఫోటోలతో సహా సోషల్ మీడియా ద్వారా చాటింపు వెయ్యాలి.
అరవై ఏళ్ళ వారి నుంచి ఆరేళ్ళ వారి దాక ఇదే దారి.

“డల్లాస్ లో టాయిలెట్స్ ఉంటాయండి.. చాప లేకుండా అక్కడే పడుకోవచ్చు. అబ్బబబ .. మన రోడ్స్, ఊళ్ళు చెత్త” అంటాడు ఓ అరవై ఏళ్ళ పెద్దాయన.
“బంగారు నగలంటే మొఖం మొత్తింది వదినా, బీరువా నిండా అవే. ఇప్పుడు నేను ప్లాటినం, డైమండ్ నగలే కొంటున్నా” అంటుంది యాభై ఏళ్ళ ఆవిడ.
“మా పిల్లల స్కూలు… అసలు అలాంటిది ఎక్కడా ఉండదనుకో.. ఒకటో తరగతిలోనే హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, ఆర్చరీ, గోల్ఫ్, స్నూకర్. మనకాలంలో మనమూ చదివాము. ఎందుకు?” అంటుంది నలబై ఏళ్ళ ఆవిడ.

“రెండోతరగతిలోని మా అమ్మాయికి స్కూల్ లో మొత్తం డిజిటల్ పాఠాలే. బ్లాక్ బోర్డు .. చాక్ పీస్ .. ఇంకా ఎక్కడ వున్నారండి మీరు? మా అమ్మాయి స్కూల్లో వీడియోలతో బోధన. ఇట్స్ డిఫరెంట్. వాట్సాప్ లో హోమ్ వర్క్ పంపుతారు. ఇరవై ముప్పై పేజీలు రోజూ ప్రింట్ తీసి నోట్స్ కు అతికించాలి. మా అమ్మాయి హోమ్ వర్క్ చేస్తుంటే వీడియో తీసి వాట్సప్ లో టీచర్ కు పంపాలి ” అంటాడు 45 ఏళ్ళ ఆయన.

“అబ్బే డాడీ .. ఆ అబ్బాయి ఫోటో చూడండి. అంకుల్ లాగా అప్పుడే పొట్ట వచ్చింది. నేను చేసుకోను. బాగా హ్యాండ్సమ్ హల్క్ దొరికాకే చేసుకొంటా. అయినా అప్పుడే నాకు ఎంత వయసయ్యిందని? జస్ట్ ఇప్పుడే 34 దాటి 35 వచ్చింది. నాకంటే నాలుగైదేళ్ళ దాటిన మా ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడే పెళ్లేంటి అంటున్నారు” అంటోంది ఒక మధ్య వయసు స్త్రీ.

చిన్నా చితకా ఉద్యోగాలు చెయ్యడం ఫ్యూలిష్ నెస్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి ఒక రిపోర్ట్ తయారు చేశా. దాన్ని జస్ట్.. రతన్ టాటాకు పంపడమే తరువాయి. ఆయన పెట్టుబడి పెడుతాడు. నా స్టార్ట్ అప్ యునికార్న్ అవుతుంది. మూడేళ్ళలో అంబానీ అదానీ దాటేస్తా” అంటాడు 25 ఏళ్ళ యువకుడు.

“వీడి దగ్గర బాగా డబ్బుంది. ముగ్గులోకి దించుతా. లేకుంటే రేప్ చేసాడని కేసు పెడుతా” ప్లాన్ చేస్తోంది నవ యువతి.

మరో చోట 20 ఏళ్ళ యువకుడు. ఆయనకు మాట్లాడే సమయం లేదు. ఆన్లైన్ బెట్టింగ్ లో సీరియస్ గా నిమగ్నం. ఈ రోజే మూడు కోట్లు వచ్చాయి, కాకపోతే నెక్స్ట్ రౌండ్ లో మొత్తం పోయి .. ఇప్పుడు నాలుగు కోట్లు లాస్స్. ఎలాగైనా రాత్రి కల్లా పది కోట్లు సంపాదించాలి అనేది టార్గెట్.

విలాసాల జ్వరం …
హోదా ప్రతీకత …
డాబుసరి సంస్కృతి …
సంపన్న పిచ్చి…
ఉన్నత వర్గ ఈర్ష!
సామజిక మిమిక్రీ …
తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కాల్సిన కొత్త పదాలు.

-వాసిరెడ్డి అమరనాథ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్