Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసామాన్య సౌందర్యశాస్త్రం

సామాన్య సౌందర్యశాస్త్రం

మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి జీవితంలో చెప్పుకోదగ్గ సందర్భం, కళ్ళలో మైమరపు ఉంటుందని ఊహించగలమా ? వేడి వేడి టీ అమ్మే మహిళ ముఖం చల్లటి నవ్వులు చిందిస్తుందా? ఏ రోజు కారోజు సైకిల్ రిపేర్లు చేసుకుంటూ జీవితం గడిపే బడుగు వ్యక్తి ముఖంలో అనితర మందహాసం ఎలా సాధ్యం? వీళ్ళే కాదు… కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, చిందరవందరగా ఈగలమధ్య చేపలమ్ముకునే వ్యాపారి, చెరుకురసం అమ్ముకునే అతను… వీళ్ళందరూ మనందరికీ చిరపరిచితులే. ఒక్కసారి మార్కెట్ దాకా వెళ్ళొస్తే కనిపించే వారే. వారితో పనిబడితే వెళ్లి పని చూసుకుని వచెయ్యడమే తప్ప పెద్దగా ఆలోచించం.

మన ఆనందాలే పరమావధిగా భావించే కాలంలో వారి అనందం గురించి మనకెందుకు? కానీ ఒక కళాకారుడు అలా అనుకోలేదు. తనకెంతో ఇష్టమైన కళతో ఆ బడుగు జీవితాల్లో కాస్తంత చిరునవ్వు పూయించాలనుకున్నాడు. అదీ వారికి తెలియకుండా. వారు పని చేసే సమయంలో వారికి తెలియకుండా దూరంగా నిల్చుని అద్భుతంగా, అత్యంత సహజంగా వారి చిత్రాన్ని ఒడిసిపడతాడు. ఆపైన వారి దగ్గర కెళ్ళి ఆ చిత్రం చూపిస్తాడు. వారి ముఖాల్లో కదలాడే సంభ్రమాశ్చర్యాలు, సంతోషపు చిరునవ్వులు కెమెరాలో బంధిస్తాడు. ఆ వీడియోలకు చక్కటి పాటలు జోడించి సోషల్ మీడియాలో పెడతాడు. అతని పేరు సౌమ్రాజ్. ఇంస్టాగ్రామ్ లో లక్షకు పైనే ఫాలోవర్లు ఉన్నారు. దక్షిణ బెంగాల్ దగ్గర సెరంపూర్ అతని ఊరు. వైవిధ్యభరితంగా చిత్రాలు రూపొందిస్తాడు. ఆసక్తి ఉన్నవారికి నేర్పిస్తాడు కూడా. ఇతని చిత్రాలు యూట్యూబ్ లోనూ ఉన్నాయి.

వేలు, లక్షలు పోసి ఒకప్పుడు మహారాజులు, జమీందారులు తమ చిత్రాలు గీయించుకునేవారు. సామాన్యులకూ తన కళ చేరువ చేసిన సౌమ్రాజ్ అసలైన కళాకారుడు. ఇతని చిత్రాలకు సంబంధించి ఇటీవలి కాలంలో నెట్టింట్లో బాగా తిరుగుతున్న వీడియో. మీరూ చూసేయండి.

https://youtu.be/3-b-M7qe7a0

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్