Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్తొలి వన్డేలో సౌతాఫ్రికా విజయం

తొలి వన్డేలో సౌతాఫ్రికా విజయం

SA won the first ODI: ఇండియాతో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 31 పరుగులతో విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆటగాళ్ళు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించారు. కెప్టెన్ బావుమా(110), దస్సేన్(129*) లు సెంచరీలతో కదం తొక్కారు. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాలో కోహ్లీ, ధావన్, శార్దూల్ మినహా మిగిలిన ఆటగాళ్ళు విఫలం అయ్యారు.  46 పరుగులకు తొలి వికెట్ (కెప్టెన్ రాహుల్-12) ఔటయ్యాడు. రెండో వికెట్ కు కోహ్లీ-శిఖర్ ధావన్ 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శిఖర్-79; కోహ్లీ-51 పరుగులు చేయగా చివర్లో శార్దూల్ ఠాకూర్ అర్ధ సెంచరీ(50)తో అజేయంగా నిలిచాడు.  మిగిలినవారు విఫలం కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ నిగిడి, తబ్రైజ్ షమ్షీ, యాండిల్ పెహ్లుక్యావో చెరో రెండు; కేశవ్ మహారాజ్, ఎడెన్ మార్ క్రమ్ చెరో వికెట్ పడగొట్టారు.

పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది, 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జన్నేమన్ మలాన్ (6) బుమ్రా బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు, 58 వద్ద మరో ఓపెనర్ డికాక్ (27) అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ కాగా; 68 వద్ద మార్ క్రమ్ ను వెంకటేష్ అయ్యర్ రనౌట్ చేశాడు. దీనితో 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు అనిపించింది. ఈ దశలో కెప్టెన్ బావుమా- వాన్ డర్ దస్సేన్ నాలుగో వికెట్ కు 204 పరుగుల భారీ  భాగస్వామ్యం నెలకొల్పారు. 143 బంతుల్లో 8 ఫోర్లతో 110 పరుగులు చేసిన బావుమా బుమ్రా బౌలింగ్ లో రాహుల్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. దస్సేన్ 96 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

129 పరుగులతో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు వాన్ డర్ దస్సేన్ కు ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో సౌతాఫ్రికా ­1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Also Read : ప్రొ కబడ్డీ: ఢిల్లీ విజయం, మరో మ్యాచ్ టై

RELATED ARTICLES

Most Popular

న్యూస్