Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్Ind Vs. SA: తొలి వన్డే సౌతాఫ్రికాదే

Ind Vs. SA: తొలి వన్డే సౌతాఫ్రికాదే

ఇండియా తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 9 పరుగులతో విజయం సాధించింది, 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో సంజూ శామ్సన్ 63 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగుల (నాటౌట్)తో చేసిన ఒంటరి పోరాటం వృధా అయ్యింది.

లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచినా ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా తొలి వికెట్ కు 49 పరుగులు చేసింది. ఓపెనర్లు జాన్నేమన్ మలాన్­-22; డికాక్-48 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ బావుమా(8); ఏడెన్ మార్ క్రమ్(0) విఫలమయ్యారు. ఈ దశలో క్లాసేన్- డేవిడ్ మిల్లర్ లు ఐదో వికెట్ కు అజేయమైన 139 పరుగులు జోడించారు. సౌతాఫ్రికా నిర్దేశించిన 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు; రవి బిష్ణోయ్, కులదీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇండియా 8 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్ల వికెట్లు (శుభ్ మన్ గిల్-3; కెప్టెన్ ధావన్-4)కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (19) కూడా త్వరగా ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ (20) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్- సంజూ శామ్సన్ లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. శ్రేయాస్ అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆ తర్వాత సంజూ- శార్దూల్ లు 97 పరుగుల మరో చక్కని భాగస్వామ్యం నమోదు చేసినా ఫలితం లేకపోయింది. ఠాకూర్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి మూడు; రబడ రెండు; పార్నల్, కేశవ్ మహారాజ్, శంషి తలా ఒక వికెట్ పడగొట్టారు.

హీన్రిక్ క్లాసేన్  కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also ReadInd-SA T20: మూడో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్