పూర్వం సూత మహామునిని ఏ టిఫిన్ అయితే త్వరగా అవుతుందో, ఏ టిఫిన్ చేసిపెడితే ఇల్లు చల్లగా ఉంటుందో, ఏ టిఫిన్ వలన కుటుంబ ఆరోగ్యం బావుంటుందో ఆ టిఫిన్ గురించి చెప్పమని దేవతలందరూ అడగగా.….భూలోకమున రకరకాల రవ్వలు అను పదార్థములకు వివిధ కూరలు, ఘృతంతో జోడించి చేయు ఒకానొక “ఉప్మా” అను ఉపాహారం చేసిపెట్టిన, మీరు మీ కుటుంబసభ్యులు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండెదరని సెలవిచ్చారు ఆ ఋషి గారు.
అంతట ఆ ఆ దేవతలు మారువేషంలో భూలోకానికి వచ్చి ఉప్మా నేర్చుకుని దాని రుచికి ఫిదా అయ్యి తిరిగి వెళ్ళాక తమ వారికి వండిపెడితూ, తాము తింటూ అప్పటి నుంచి స్వర్గంలో సుఖంగా ఉన్నారు.
ఇప్పుడు కింద భూలోకంలో చూడండి :–
అబ్బా ఉప్మా నా??
ఏంటా మొహం?ఎప్పుడన్నా సరైన ఉప్మా తిన్న మొహమేనా అసలు?? తిన్నాక ఏడుపా?? తినకుండానే ఏడుపా??
తిన్నాక ఏడిస్తే వండిన వారి తప్పు. తినకుండా అయితే తినని వారి తప్పు.
అదేదో సినిమాలో సుత్తి వీరభద్రం గారు చెప్పినట్టు ఉప్మాలలో రకాలు ఏవంటే-
బొంబాయి రవ్వ ఉప్మా
బియ్యం రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా
జొన్న రవ్వ ఉప్మా
మొక్కజొన్న రవ్వ ఉప్మా
అటుకుల ఉప్మా
మరమరాల ఉప్మా
సేమియా ఉప్మా
అబ్బో!
ఉప్మాకి ముడి సరుకులు ఎన్నో ఎన్నెన్నో!
వండటం సరిగ్గా చేతకావాలే కానీ వారం పొడుగూతా లొట్టలేసుకుంటూ రక రకాల ఉప్మాలు తినరూ ఇంట్లో వాళ్ళు. నన్నడిగితే అత్యంత త్వరగా అయ్యే టిఫిన్ ఉప్మానే.
2 మినిట్ నూడుల్స్ అంటారు కానీ దానికీ పావు గంట పడుతుంది సరిగ్గా వండితే. కానీ మన ఉప్మా దేవత మనకి కావల్సినంత సేపట్లో కరుణిస్తుంది. కాస్త పచ్చిమిర్చి,అల్లం, కరివేపాకుతో ఘాట్టి పోపు, నెయ్యితో వేసి అలా అలా జీడిపప్పు పలుకులు వేసి, ఇంకో బర్నర్ మీద ఆల్రెడీ మరిగించిన నీటిని పోపులో పోసి, నైపుణ్యంగా రవ్వ కలిపి మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేశామా…. 5 మినిట్స్ లో బొంబాయి రవ్వ ఉప్మా రెడీ.
లేదూ.. మీకు చాలా టైం ఉంది, భాఘా హెల్త్ కాన్షియస్, ఉత్త ఉప్మా ఏం తింటాం అనుకుంటే…. మన చద్ది పెట్టెలో మిగిలిన కూరలన్ని సన్నగా తరిగి పోపులో వేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే….15 మినిట్స్ లో హెల్తీ ఉప్మా రెడీ.
ఒక సీక్రెట్ చెప్పనా! రాత్రిపూట కనుక ఉప్మా చేస్తే, పగలు మిగిల్చిన కూర కానీ పప్పు కానీ వేసెయ్యండి. వేస్టేజ్ ఉండదు, టేస్ట్ అద్దిరిపోతుంది. డోంట్ టెల్ ఎనిబడి. ఉపవాసం ఉన్నాము,అన్నం తినం అంటారు. కానీ బియ్యపు రవ్వ ఉప్మా మాత్రం చేసుకుంటారు. ఇదేం లాజిక్ అబ్బా!! నాకు అస్సలు అర్ధం కాదు. మా అమ్మమ్మ చేసే బియ్యపు రవ్వ ఉప్మా భలే ఉండేది. పోపులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, గుప్పెడు పెసరపప్పు, ఎక్స్ట్రా జీలకర్ర వేసి, సన్నని మంట మీద అడుగు ఎర్రగా చెక్క కట్టేదాకా స్టవ్ మీద ఉంచితే…ఆ రుచి కేక.
ఉప్మాతో పాటు ఆ చెక్క కోసం యుద్ధాలు జరగవూ!! ఇత్తడి పాత్రలో చేస్తే ఇంకా బావుంటుంది. జొన్న రొట్టెలు చేయడం రాని నాలాంటి వారు జొన్నలు తినలేకపోతున్నాం అని ఫీల్ అయ్యే పనిలేదు. అన్ని కూరగాయల ముక్కలతో జొన్నరవ్వ ఉప్మా చేసుకుంటే సరి. విడిగా ఉడకడం లేట్ అవుతుంది అనుకుంటే సుబ్బరంగా కుక్కర్ లో పెడితే హ్యాపీ గా ఉడికిపోతుంది. మరమరాలలో కూరముక్కలేసి ఉప్మాగా పెడితే మా పిల్లలు భోరుమన్నారు ఒకసారి. అందుకని పోపువేసి, మగ్గించిన మరమరాల పైన సన్నగా తరిగిన ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, క్యారట్ ముక్కలు,కొత్తిమీర, వేయించిన పల్లీలు, కాసిని పుట్నాలు వేసి నిమ్మరసం పిండానా…… రోడ్డు పక్కన మురిక్కాలువ మీద పెట్టిన బండి మీద చాట్ తిన్నంత హ్యాపీ గా ఫీల్ అయ్యారు.
“ఈజీ టు ప్రిపేర్ – హెల్తీ టు ఈట్” అన్నమాట. అటుకులతో కూడా ఇదే విధానంబవలంబించిన ఎంతో కాలం కలసివచ్చును. దోరగా వేయించిన సేమియాతో ఉప్మా చేసి చివరగా జీడిపప్పు, నెయ్యి వేసి కొబ్బరి కోరు చల్లామా….ఆహా ఏమి రుచి అనరా మైమరచి.
రంగుల్లో నలుపులాగా, ఫ్లేవర్స్ లో వెనిల్లాలాగా, టిఫిన్స్ లో ఉప్మా అన్నమాట. అన్నిటితో సర్దుకుపోతుంది. పెసరట్టుకి ఫేవరెట్టు ఫ్రెండ్. మినపట్టుతో ముచ్చటైన దోస్తీ. పెరుగుతో తింటే ఒక టేస్ట్, కారంబూందీతో తింటే ఇంకో టేస్ట్. అల్లం పచ్చడితో నడుస్తుంది. కారంపొడితో పరుగెత్తుతుంది. మాంఛి ఉప్మాకి ఆవకాయ బద్దని మించిన నంజుడు ఉందా అసలు?
స్టైల్ గా పోర్రిడ్జ్ అని పేరు పెట్టి , చేసే విధానం కాస్త మార్చి మన ఉప్మానే కదా ఆ ఫారిన్ వాళ్ళు తినేది. అది దిగుమతి చేసుకుని మనం డైటింగ్ పేరుతో షో ఆఫ్ చేస్తాం.
అసలూ ఉప్మాలంకారమే వాడుకలో ఉపమాలంకారం అయ్యిందేమో అని నా డౌటనుమానం. ఉపమాన ఉపమేయాలు రెండూ తనకు తానే సాటి అయిన ఉప్మానే అవ్వడం ఇక్కడ విశేషం. సూతుడంతటి వాడు దేవతలకి చెప్పిన సీక్రెట్ ఇప్పుడు మనకి కూడా తెలిసిపోయింది కనుక హాయిగా ఉప్మా తినేద్దాం. హెల్తీగా ఉందాం.
మన దక్షిణ భారతీయ ఉపాహారం ‘ఉప్మా’ కలకాలం వేడి వేడిగా వర్ధిల్లాలి.
జై ఉప్మా!
జై జై ఉప్మా!!
-గీతా మాధురి పరాశరం