Sunday, November 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅమెరికాలో స్కూలుకెళుతున్న కుక్కలు

అమెరికాలో స్కూలుకెళుతున్న కుక్కలు

Dog-Doctorate:
“శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు”
-అన్నమయ్య కీర్తన

“కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!”
-సుమతీ శతకం

“అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా ?
విశ్వదాభిరామ వినురవేమా!”
-వేమన పద్యం

“నాది నాది అనుకున్నది నీది కాదురా!
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా!
కూరిమి గలవారంతా కొడుకులేనురా!
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా!”
-సినిమా పాట

కుక్క తోక వంకర;
కుక్కను కొట్టినట్లు కొట్టడం;
కుక్కకున్న విశ్వాసం కూడా లేదు;
కుక్క కాటుకి చెప్పుదెబ్బ;
కుక్కలు చింపిన విస్తరి;
కుక్కలుండే ఊరికి నక్కే పోతురాజు;
తడికె లేని ఇంట్లో కుక్క దూరినట్లు;
పనిగల మేస్త్రి పందిరి వేస్తే…కుక్క తోక తగిలి కూలిపొయినట్లు;
మొరిగే కుక్క కరవదు- కరిచే కుక్క మొరగదు;
కుక్క తోక పట్టి గోదారి ఈదినట్టు;
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు;
గడ్డి వాము దగ్గర కుక్కను కాపలా పెట్టి నట్లు;
ఊర్లో పెళ్ళికి కుక్కల హడా విడి ఎక్కువ;
కుక్క పని కుక్క చేయాలి…గాడిద పని గాడిద చేయాలి;
ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు;
మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే పరుగెత్తడం మాని…ఉస్కో అన్నదట;
కుక్క చావు”
-సామెతలు, వాడుక మాటలు

…ఇలా తెలుగు భాషలో అడుగడుగునా, అణువణువునా కుక్కలు దూరిపోయాయి. కీర్తనల్లో, పద్యాల్లో, పాటల్లో, జానపదాల్లో, సామెతల్లో, నిత్యవ్యవహారంలో కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి. విశ్వాసానికి మారు పేరు కాబట్టి…అనాదిగా కుక్కలు మనిషికి తోడుగా ఉన్నాయి.

పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, అడవి కుక్కలు, స్వదేశీ కుక్కలు, విదేశీ కుక్కలు, సంపన్న శునకాలు, నిరుపేద శునకాలు, మంచి కుక్కలు, పిచ్చి కుక్కలు…ఇలా జాతిని బట్టి, చోటును బట్టి, రూపాన్ని బట్టి లెక్కలేనన్ని శునక వర్గాలుంటాయి. వర్గం ఉన్నచోట వర్గ స్పృహ ఉంటుంది. వర్గ భేదాలు ఉంటాయి. వర్గ పోరు ఎలాగూ ఉంటుంది. మన చర్చ కుక్కల మధ్య వర్గ పోరాటం గురించి కాదు. కుక్కల చదువు సంధ్యల గురించి.

కుక్కలను సృష్టి చేసినప్పుడు బ్రహ్మ వాటి నుదుటిమీద రాయని రాతను ఇప్పుడు అమెరికా రాసింది. కుక్కలు బుద్ధిగా ఉదయాన్నే స్కూల్ బస్సులో స్కూల్ కు వెళ్లాల్సి వస్తుందని బ్రహ్మ రాతలో లేదు. సృష్టికి ప్రతిసృష్టి చేయకపోతే ఇక మనిషి ప్రతిభ ఏముంది?

అమెరికాలో కలవారి కుక్కల కోసం డే స్కాలర్ స్కూళ్లు మొదలయ్యాయి. ఉదయాన్నే స్కూల్ బస్సు ఇంటి ముందు ఆగి ఆటోమేటిక్ డోర్ తెరుచుకోగానే కుక్కలు స్కూల్ బ్యాగ్ వీపున పెట్టుకుని బస్సులోకి వెళ్తాయి. సీట్లో కూర్చోగానే అమెరికా భద్రతా ప్రమాణాల ప్రకారం సీటు బెల్ట్ మెడకు కడతారు.

స్కూల్ కు వెళ్లగానే ఈత క్లాసులు, బిహేవియర్ క్లాసులు, ఓనర్లతో ఎలా మసలుకోవాలో చెప్పే మోరల్ క్లాసులు, ఈటింగ్ క్లాసులు...ఇలా ఏ పీరియడ్ కు ఆ పీరియడ్ ప్రత్యేక టీచర్లు వచ్చి క్లాసులు తీసుకుంటారు. సాయంత్రం స్కూల్ అయిపోగానే బ్యాగులు వీపున వేసుకుని అదే బస్సులో ఇళ్లకు రావాలి.

ప్రస్తుతానికి వీక్లి, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ పరీక్షలు లేవు. భవిష్యత్తులో ఉండవని గ్యారెంటీ అయితే లేదు.

భవిష్యత్తులో అమెరికాలో నలుగురు కలిసిన చోట ఇలా మాట్లాడుకోవచ్చు!

“మా అబ్బాయి స్టాన్ఫోర్డ్ లో పరీక్ష పాస్ కాలేకపోయాడు. కానీ మా కుక్క మొన్న డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. దాంతో ఈసంవత్సరం మావాడికి- మా కుక్కకు చదువులో గట్టి పోటీ ఉంటుంది”

“మా అమ్మాయికి మొన్న మోరల్ సైన్స్ లో 30 మార్కులే వచ్చాయి. మా బుజ్జి కుక్కకు అదే మోరల్ సైన్స్ లో 99 మార్కులొచ్చాయి. ఇంకొక్క మార్క్ వచ్చి ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ వచ్చి ఉండేది మా కుక్కకు. నో రిగ్రెట్స్. నెక్స్ట్ టైమ్ మా కుక్క మా పేరు నిలబెడుతుంది”

“పేరెంట్స్ మీటింగ్ లో మీకు ఇది వరకే చెప్పాము. మీ కుక్క మార్కుల్లో నెక్స్ట్ మంత్ బెటర్మెంట్ లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసి…టీ సీ ఇచ్చి పంపాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్”

ఓ మై డాగ్!
అమెరికా మస్ట్ బీ క్రేజీ!
డాగ్స్ మస్ట్ ఆల్సో బీ క్రేజీ!!

ఏయ్!
ఎవర్రా అక్కడ?
కుక్కలు బుద్ధిగా బళ్లకు వెళుతున్నాగాయిగా!
భాషలో పాత పలుకుబళ్లకు పాతరేసి… శునక విద్యార్జన సందర్భాలతో కొత్త కుక్కబళ్లను కాయిన్  చేయండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్