Monday, January 27, 2025

మాటల గోల

అది కోసలపురం. ఆ దేశ రాజు కేశవవర్మ. రాజుగారి సభలో మాట్లాడేవారి సంఖ్య అధికం. ఎప్పుడూ మాటలతోనే కాలం వెల్లబుచ్చేవారు. వారి మాటలు ఆనోటా ఈనోటా వింటూ ప్రజలు కూడా ఏ పనీ చేయక ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుండేవారు.

దీంతో కోసలపురంలో మాటల కాలుష్యం పెరిగిపోయి ఇరుగు పొరుగు దేశాలవారు సర్వసభ్య దేశాల సభ దృష్టికి తీసుకుపోయారు. వారి వల్ల తలపోటు తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తారు. అంతేకాదు, అందరూ ఒకేసమయంలో మాట్లాడటం వల్ల ఎవరేం చెప్తున్నారో ఎవరికీ బోధ పడేది కాదు.

గోల గోలగా ఉండేది. ఈ మాటల ధ్వనులతో చెవులు దెబ్బతినడం మొదలుపెట్టాయి. అదే పనిగా మాట్లాడుతుండటంతో గొంతులెండిపోయినాసరే లెక్క చేయక మాట్లాడుకుంటూనే ఉండేవారు.

ఈ శబ్దకాలుష్యంతో అయోమయంలో పడిన మాటలు దిక్కూదిశా తెలీకుండా పరుగులు పెట్టాయి. దాంతో కొంత కాలానికే కోసలపురంలో మాటలు లేకుండా పోయాయి. మాటల జాడ లేకుండా పోయాయి.

ఆ తర్వాత ఎవరూ ఎవరితోనూ మాట్లాడటమే కుదరలేదు. ఎంత ప్రయత్నించినా అర్థంలేని శబ్దాలు పుట్టేవి తప్ప అర్థమున్న మాటలు వచ్చేవి కావు. మాటలన్నీ అయిపోవడంతో అందరూ సౌంజ్ఞలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరూ రకరకాల విన్యాసాలు చేస్తూ వచ్చారు.

మాటలు ఉన్నప్పుడు ఎవరూ సౌంజ్ఞలు చేసుకునే వారు కాదు. అందువల్ల సైగలూ ఎవరికీ అర్థమయ్యేవి కావడం లేదు. దాంతో నానా గొడవా నెలకొంది.

ఇంతలో కోసలపురం రాజుకి పొరుగు దేశపు రాజు ఓ సందేశం పంపాడు. త్వరలో రానున్న పౌర్ణమినాడు తాము మీ దేశం మీద దాడి చేయనున్నామన్నదే ఆ వర్తమానం. కానీ దేశంలో ఎవరికీ దానిని చదవడం తెలీలేదు. ఆ పత్రాన్ని ఎలా చూసినా ఒట్టి పిచ్చిగీతలలాగా అనిపించింది. దాంతో ఏం చెయాలో తెలీలేదు రాజుకి.

రాజులో ఓ విధమైన భయం మొదలైంది.

దేశమంతటా చాటింపు వేయించాడు. వెంటనే మాటలను కనిపెట్టి తీసుకురావాలన్నదే ఆ చాటింపు. రాజుగారి ఆదేశంతో అందరూ మాటలకోసం వెతుకులాటలో పడ్డారు. అడవులూ పర్వతాలూ కొలనులూ నదులూ పల్లెలు నగరాలు అంటూ అందరు మాటల కోసం వెతకసాగారు.

ఆ దేశం పొలిమేరలో ఓ పూరిపాక ఉంది. ఆ గుడిసెలో ఓ ముసలి బామ్మ ఉంది. ఆమెతో పాటు ఆమె మనవడు ఉంటున్నాడు. రాజుగారి మనుషులు ఆ పూరిపాక దాటి పోతుండగా అరెరె ఈ గుడిసెను చూడకుండా పోతున్నాం…ఇక్కడేముందో చూద్దాం అన్నాడొకడు. సువిశాలమైన మన దేశంలో లేనిది పూరిపాకలో ఏముంటుందీ అని మరొకడు వ్యంగ్యంగా సౌంజ్ఞలు చేశాడు.

అదీ నిజమే అన్నట్టుగా వారు ఆ పూరిపాక దాటి వెళ్తుండగా చల్లగాలి వీచింది. గాలికి పూరిపాకలోని పైకప్పు కదిలింది. అప్పుడు గుడిసెలోంచి కొన్ని మాటలు వినిపించాయి. అమ్మయ్య మనల్ని వారు చూడలేదన్నదే ఆ మాట. ఆ మాటలు వినడంతోనే రాజుగారి మనుషులకు పట్టరాని ఆనందం. వెంటనే వారు వెనక్కు వచ్చి పూరిపాకలోకెళ్ళి ఆ ముసలామెనూ, మనవడిని పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. వారిద్దరూ మాటలు విని రాజుగారికి ఆనందమేసింది. వారిని దగ్గరకు పిలిచి హత్తుకున్నారు. దేశంలో మాటలను తీసుకురావలసిందిగా వారితో ప్రేమగా చెప్పాడు.

ముసలామె తన వంతు సాయం చేసింది. అంతేకాకుండా తన దగ్గరున్న ఓ సంచిని విదల్చగా అందులోంచి మాటలన్నీ కింద పడ్డాయి. మనవడు కూడా తన జేబులోంచి మాటలను కిందకు విదిల్చాడు.

ముసలామె, మేముంటున్న పూరిపాకలో ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి….ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్న మాటలన్నింటినీ తీసుకుని నేను వాటిని జాగర్త చేశాను. వాటిని ఎటూ పోనియ్యక కంటికిరెప్పలా చూసుకుంటున్నాను అని చెప్పింది.

వెంటనే రాజు గారి మాటగా ఆయన భటులు మళ్ళీ ఆ పూరిపాకు వెళ్లి అక్కడ నుంచి తీసుకువచ్చిన పైకప్పులను రాజు ముందు కదిపారు. ఇంకేముంది, లక్షల మాటలు కింద రాలాయి. ఈ మాటలన్నింటినీ దేశమంతటా చల్లారు. మళ్ళీ పూర్వంలాగా మాటలు వచ్చేశాయి. అప్పటికి వారికి మాటల విలువేంటో తెలిసొచ్చింది. పూర్వంలా ఇష్టమొచ్చినట్లల్లా మాట్లాడక మితంగా మాటలను వాడుతూ వచ్చారు.

మాటల పరిరక్షణ కోసం రాజు ఓ ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరైనా అర్థం పర్థం లేకుండా మాట్లాడినట్లు తెలిస్తే వారి నుంచి మాటలన్నీ తీసేసుకుంటామని. ఇదే వారికి విధించిన శిక్ష. దాంతో ప్రజలు ఎంతో పొదుపుగా మాటలను వాడటం మొదలుపెట్టారు. దేశమూ సస్యశ్యామలమైంది. వారిలోని మార్పును గమనించిన పొరుగు దేశపు రాజు తన దండయాత్రను మానుకున్నాడు.

-యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్