Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుస్తకాభిరుచి- 2

పుస్తకాభిరుచి- 2

ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో అధిపతి విజయ్ కుమార్ నాకు బాగా పరిచయం. ఎమెస్కో  సంపాదకుడు డి. చంద్రశేఖర్ రెడ్డి నాకు నిత్యం తెలుగు పాఠాలు చెప్పే గురువు. వీరితో ఎప్పుడు మాట్లాడినా పుస్తక రచన, ముద్రణ, ఆదరణ, అమ్మకాలు, లాభనష్టాలు, పాఠకుల అభిరుచుల గురించిన ప్రస్తావన తప్పకుండా ఉంటుంది.

ఏ రకమైన పుస్తకాలు ఇప్పుడెక్కువ అమ్ముడుబోతున్నాయి? అంటే తడుముకోకుండా వచ్చే సమాధానం- ఆధ్యాత్మిక సంబంధమైనవి అని. వ్యక్తిత్వ వికాస పుస్తకాలది రెండో స్థానం. డిజిటల్ విప్లవం వచ్చాక ప్రపంచం నలుమూలలనుండి స్ఫూర్తిదాయక కథనాలు అక్షర, చిత్ర, శబ్ద, దృశ్యరూపంలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. నిజానికిప్పుడు వ్యక్తిత్వ వికాసం ఎక్కువై తగ్గించుకోవాల్సిన కాలంలో ఉన్నాం కాబట్టి…నెమ్మదిగా తెలుగులో వ్యక్తిత్వ వికాసం తగ్గుతోంది.

పది, పదిహేనేళ్లుగా భక్తికి మార్కెట్ బాగా పెరిగింది. కేంద్రంలో వరుసగా బి జె పి అధికారంలోకి రావడం, టీ వీ చానెళ్లు, డిజిటల్ వేదికలు భక్తిమార్గం పట్టడం…ఇలా భక్తి మార్కెట్ అనూహ్య విస్తృతికి అనేక కారణాలు.

ప్రముఖ ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్రత్యక్షప్రసారమయ్యాయి. ఆ వీడియోలు అనేక భాగాలుగా యూ ట్యూబ్ లో ఉన్నాయి. ఆ ఉపన్యాసాలనే యథాతథంగా ఎత్తి రాసి…పుస్తకాలుగా ఆ ప్రవచనకర్తల పేరుతోనే ముద్రిస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కొందరైతే ఫలానా ప్రవచనకర్త రామాయణం, భాగవతం వ్యాఖ్యాన పుస్తకాలు ఇంట్లో ఉన్నా చాలు పుణ్యం వస్తుంది- అని కొంటున్నారు. భక్తిలో ఉన్న తాదాత్మ్యం అది.

ప్రతి నెలా కనీసం రెండు మూడు పుస్తకాలు నాకు ఉచితంగా కొరియర్లో ఇంటికే వస్తుంటాయి. చరిత్ర, సాహిత్య విమర్శ, భాషాశాస్త్రానికి సంబంధించినవయితే వెంటనే చదువుతాను. కవిత్వం, ఆధ్యాత్మికం, ఇతరాలయితే పక్కన పెట్టుకుంటాను. అవన్నీ ఎప్పటికి చదవగలనో తెలియదు. పంపినవారందరూ ఆత్మీయులే. చదివి సమీక్ష రాయమని పంపినవారు కూడా ఉంటారు. కవిత్వ సమీక్ష నాకు చేతకాదంటే వారు మరోలా అనుకుంటారు. అప్పుడప్పుడు ఒకటి రెండు పేజీలు చదువుతూ ఉంటాను. కానీ పుస్తక ముద్రణ, ఆవిష్కరణ, నాలాంటివారికి ఉచితంగా పంపడానికి కొరియర్ ఖర్చులు అన్నీ పోను వారికి మిగిలేది ఏమీ ఉండదు. పుస్తకం రాశామన్న తృప్తి, అచ్చు వేశామన్న ఆనందం కోసం కొన్ని వేలు, లక్షలు ఖర్చు చేసుకుంటూ ఉంటారు.

ఒకసారి ఢిల్లీలో చలికాలంలో మూడు నాలుగు రోజులు ఉండాల్సిన పని పడింది. అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ ను. పరిచయమున్న తెలుగు పెద్దలందరినీ కలుస్తున్నాను. పార్లమెంటు స్పీకర్ బాలయోగి, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి విద్యాసాగర్ రావు, టీ డి పి ఎం పి ఎర్రన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు సి. రామచంద్రయ్య…ఇలా ఎవరి దగ్గరికి వెళ్లినా ఒక తెలుగు పుస్తకం కనిపిస్తోంది. చివరికి మధ్యాహ్నం ఏ పి భవన్లో భోజనానికి వెళితే అక్కడకూడా కొందరి చేతుల్లో అదే పుస్తకం ఉంది. ఆ సంవత్సరం సాహిత్య అవార్డుకు సిఫారసు చేయాలని లేదా లాబీయింగ్ చేసి పెట్టాలని ఆ రచయిత పది రోజులుగా ఢిల్లీలో ఉండి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. ఆ ఉధృతి చూసి ఆ పుస్తకానికి హీనపక్షం జ్ఞానపీఠం వచ్చి తీరుతుందనుకున్నా. కానీ ఎందుకో రాలేదు!

ఏది రాస్తే అవార్డు వస్తుందో తెలిసి అదే రాసేవారు; ఏయే భాషల్లోకి అనువదిస్తే ఎవరూ చదవకపోయినా అవార్డుకు అర్హత సాధిస్తుందో తెలిసి అనువాదాలు కూడా భారీ ఖర్చుతో ముద్రించేవారు; పుస్తకావిష్కరణకు ఏ ముఖ్యుడిని పిలిస్తే పుస్తకాల అమ్మకంతోపాటు అవార్డుకు సిఫారసు చేస్తారో తెలిసి చేసేవారి తెలివితేటలను అభినందించాలే కానీ తక్కువచేసి ప్రయోజనం లేదు. ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, ఒక గుంటూరు శేషేంద్ర శర్మ కూడా రాతతోపాటు ఇలాంటి లాబీయింగ్, మార్కెటింగ్ ఇతరేతర మెళకువలు నేర్చుకుని ఉంటే తెలుగులో ఇప్పటికికనీసం పదిమందికి సాహిత్యంలో పెద్ద పెద్ద అవార్డులు కచ్చితంగా వచ్చి ఉండేవి!

ముద్రణ యంత్రం కనుకున్న తరువాత తెలుగు గ్రంథాలను వెలుగులోకి తెచ్చిన వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, గొల్లపూడి వీరాస్వామి సంస్థల చరిత్ర, తెలుగు భాషకు వారు చేసిన సేవ చాలా గొప్పది. తెలుగులో ఎమెస్కో, పల్లవి, నవోదయ, విశాలాంధ్ర, నవయుగ మొదలు ఎన్నెన్నో ప్రచురణ సంస్థలున్నాయి. పుస్తకాల స్వర్ణయుగం అయిపోయింది అన్నది వీరి అభిప్రాయం.

నలభై నాలుగేళ్ళ ఎమెస్కో ప్రయాణాన్ని నాలుగు ముక్కల్లో చెప్పండని ఎమెస్కో విజయ్ కుమార్ ను అడిగితే …ఆయన చెప్పిన సమాచారమిది:-:-
“ఇప్పటికి వివిధ రచయితలవి అయిదు వేల పుస్తకాలు ప్రచురించాం. తెలుగులో నవలలే ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలు. యాద్దనపూడి సులోచనారాణి సెక్రటరీ నవల ఇప్పటికి 90సార్లు ప్రచురించి ఉంటాం. రెండు లక్షలకు పైగా పుస్తకాలు అమ్ముడుబోయిన సెక్రటరీ తరువాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వీ పట్టాభిరామ్ రాసిన “కష్టపడి పనిచేయొద్దు-ఇష్టపడి పనిచేయండి” అత్యధిక కాపీలు అమ్ముడుబోయింది. ఇంటర్నెట్ బ్లాగులు, వెబ్ సైట్లు, వాట్సాప్ రాతలు వచ్చాక నవల, వ్యక్తిత్వం రెండూ అటకెక్కాయి. హిందీలో ఏదో ఒక రాష్ట్రంలో ఎవరో ఒకరు అద్భుతంగా రాస్తున్నారు. దక్షిణాదిలో తమిళ, మలయాళ, కన్నడలో మనకంటే మెరుగ్గానే రాస్తున్నారు. తెలుగులోనే రాత రోజురోజుకూ కోతకు గురవుతోంది. వాట్సాప్పుల్లో రెండు పంచ్ డైలాగులే అద్భుతమైన తెలుగు రాతగా చలామణి అవుతున్నాయి. చదవడం అలవాటున్నవారిలో మూడుశాతం మంది మాత్రమే పుస్తకాలు కొంటున్నారు”.

ఆధ్యాత్మిక గ్రంథాల రచయితలకైనా నాలుగు రూపాయలు వస్తున్నాయా? లేదా? అన్నది ఆ దేవదేవుడికే తెలియాలి!

“బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః,
అబోధోపహతాశ్చాన్యే జీర్ణ మంగే సుభాషితమ్”
-భర్తృహరి శ్లోకం

“బోద్ధ లగువారు మత్సర పూర్ణమతులు ప్రబలగర్వవిదూషితుల్ ప్రభువు లెన్న నితరమనుజు లబోధోప హతులు గాన భావమున జీర్ణ మయ్యె సుభాషితంబు”
-ఏనుగు లక్ష్మణకవి అనువాద పద్యం

భావం:-
తెలిసినవారు అసూయతో ఉన్నారు. ప్రభువులు గర్వాంధులు. సామాన్యులకు విని అర్థం చేసుకునే తెలివి లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం నాలోనే జీర్ణమైపోయింది.

ఈ పుస్తక రచన, ముద్రణ, అమ్మకం బాధలకు భయపడి ఎంతమంది రచయితలు రాయదలుచుకున్నవి రాయకుండా తమలోనే జీర్ణం చేసుకుంటున్నారో ఇప్పుడు ఏ భర్తృహరి వచ్చి చెప్పాలి?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్