Sunday, January 19, 2025
HomeTrending Newsనయా దిశలో పర్యాటక రంగం

నయా దిశలో పర్యాటక రంగం

భారత దేశంలో పర్యాటకం అంటే యువతరం, నవతరానికే పరిమితం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు స్టైల్ మారింది. మధ్య వయసు వారి నుంచి ముదిమి వయసు వారు, సోలో టూరిస్టుల కోసం పర్యాటక రంగంలో కొత్త హంగులు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ మేక్ మై ట్రిప్ నిర్వహించిన సర్వేలో కొత్త అంశాలు వెలుగు చూశాయి.

టయర్-2, టయర్-3 పట్టణాల నుంచి వస్తున్న విచారణలో ఆధ్యాత్మిక ప్రాంతాల మీదనే అధిక శాతం ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. గత రెండు సంవత్సరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకంలో 97 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా అయోధ్య సందర్శనకు అక్కడి సౌకర్యాలపై 585 శాతం ఆసక్తి పెరిగింది. ఈ కోవలో ఉజ్జయిని-359 శాతం, బద్రీనాథ్-343 శాతంగా నిలిచాయి. వారణాసి, తిరుపతి, అమృతసర్, కట్రా, అజ్మీర్ నగరాలు ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు అయోధ్య ఆ కోవలోకి చేరుకుంది.

సరయు ఘాట్ , అయోధ్య 

ఆధ్యాత్మిక పర్యాటకంలో ఇప్పుడు విలాసవంతమైన విడిదికి(హోటల్స్) డిమాండ్ పెరిగిందని ఇండియన్ హోటల్స్ కంపెనీ వెల్లడించింది. ఇందుకు నిదర్శనమే రాజస్తాన్ లోని పుష్కర్ లో తాజ్ గ్రూప్ హోటల్.  ఏడాదికి ఏడాది స్వదేశీ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగిన పుష్కర్ కు తాజ్ రాకతో మరికొన్ని సంస్థలు కూడా హోటల్స్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.

పుష్కర్ – రాజస్థాన్ 

అటు ఒడిశాలోని చిలకా సరస్సు సమీపంలోని గోపాల్ పూర్ వద్ద రాడిస్సన్ హోటల్ గ్రూప్ లక్సరీ హోటల్ ఓపెన్ చేసింది. ప్రసిద్ద సూర్యదేవాలయం కోణార్క్, జగన్నాథుడు కొలువు దీరిన పూరి నగరానికి అందుబాటులో ఉంది. ఇది చిలక సరస్సు విహారానికి అనుకూలంగా ఉంటుంది.

పర్యాటక రంగంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకే 60 శాతం ప్రాధాన్యత పెరిగిందని హయత్ గ్రూప్ హోటల్స్ ఆసియ విభాగం మార్కెటింగ్ హెడ్ దీప కృష్ణన్ పేర్కొన్నారు. బుద గయ, హరిద్వార్ లో హయత్ హోటల్స్ ప్రారంభం కాగా అనూహ్యమైన స్పందన ఉంది. భోపాల్, వారణాసిలో కూడా హయత్ గ్రూప్ ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

వారణాసి 

ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL), మారియట్ ఇంటర్నేషనల్, సరోవర్ హోటల్స్ & రిసార్ట్స్, మరియు Wyndham Hotels & Resorts అయోధ్యలో హోటళ్లను నిర్మించడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ హోటళ్లు 2024 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

వారణాసి నుంచి రిషికేశ్ వరకు గంగా నది తీరాన ఆతిథ్య రంగం పరిశ్రమ స్థాయికి చేరుకుని నవతరాన్ని ఆకట్టుకుంటోంది. 2028 నాటికి దేశానికి మూడున్నర కోట్ల మంది విదేశీ పర్యాటకులు కేవలం భారతీయ ఆధ్యాత్మికతను ఆస్వాదించేందుకు వచ్చే అవకాశముందని అంచనా.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువుదేరిన వైష్ణో దేవి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మారియట్ హోటల్ గ్రూపు కట్రా నగరంలో త్వరలోనే హోటల్ ప్రారంభిస్తోంది. అదే సమయంలో అయోధ్యలో విలాసవంతమైన హోటల్ నిర్మాణానికి రంగంలోకి దిగింది.

కట్రా, జమ్మూ కాశ్మీర్ 

మరో అడుగు ముందుకేసిన ట్రావెల్ సంస్థలు అనంత్ కాశి అయోధ్య యాత్ర పేరుతో ప్యాకేజి తీసుకొస్తున్నాయి. విడిది, దర్శనాలు, యాత్ర పొడవునా గైడ్ వివరణలతో థామస్ కుక్, వీసా, హాలిడేస్ తదిర గ్రూపులు మార్కెట్ ను ఏలుతున్నాయి. ఇలాంటి ప్యాకేజీలకు 400 శాతం డిమాండ్ పెరిగింది.

గతంలో కుటుంబాలు, బంధు వర్గాలతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన చేసే వారు. ప్రస్తుతం యువతరం… అందులో సోలో ట్రిప్ చేసే వారు ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేల్లో తేలింది. ఇలాంటి వారికి వైవిధ్యభరితమైన స్థానిక సంస్కృతి సంప్రదాయాలను వివరించేందుకు పర్యాటక సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. స్టార్ హోటళ్ళలో మందు, మాంసం విదేశీ పైత్యం సాధారణం కాగా.. ఇందుకు భిన్నంగా అయోధ్య, పుష్కర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వాటిలో కేవలం శాఖాహారం అందించటం కొసమెరుపు.

జగన్నాథ్ మందిరం, పూరి, ఒడిశా 

పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయటం… పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేకంగా రైల్ సర్క్యూట్ ఏర్పాటుతో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. రాబోయే రోజుల్లో భారత ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రపంచ వ్యాప్త ఆదరణ పెరుగనుందని ట్రావెల్ సంస్థలు ధీమాగా ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్