వర్షం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు నాలుగు జట్లు…. కోల్ కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగుళూరు చేరుకున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఒకవేళ రాజస్థాన్ విజయం సాధించి ఉంటే అప్పుడు రాజస్థాన్ 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచేది. కానీ రద్దు కావడంలో 17 పాయింట్లకు చేరుకోగా హైదరాబాద్ సైతం 17 పాయింట్లతోనే ఉంది. కానీ మెరుగైన రన్ రేట్ (+0.414) కారణంగా హైదరాబాద్ రెండో స్థానాన్ని చేజిక్కించుకుంది. రాజస్థాన్ నెట్ రన్ రేట్ +0.273 మాత్రమే ఉంది.
కోల్ కతా- రాజస్థాన్ మధ్య గౌహతి లోని బరసపర క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా…. సాయంత్రం నుంచే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఆటంకం కలిగించింది. ఏడున్నరకు మొదలు కావాల్సిన మ్యాచ్ ను చివరకు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఏడు ఓవర్లకు కుదించి మొదలు పెట్టాలని నిర్ణయించారు. కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ మరోసారి వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది.