Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హైదరాబాద్ : నో ‘రైజింగ్’

హైదరాబాద్ : నో ‘రైజింగ్’

SRH-no Hopes: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి పేలవమైన ప్రదర్శనతో ఓటమి పాలై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరుతో నేడు జరిగిన మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగుళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఫామ్ లోకి వచ్చి 50  బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73  పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రజత్ పటీదార్-48; గ్లెన్ మాక్స్ వెల్-33 పరుగులతో రాణించారు. చివర్లో హార్డ్ హిట్టర్ దినేష్ కార్తీక్ కేవలం 8 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 30 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్ లో హసరంగ ఐదు వికెట్లు పడగొట్టి హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పరుగుల ఖాతా తెరవక ముందే విరాట్ కోహ్లీ, జగదీశ సుచిత్ బౌలింగ్ లో విలియమ్సన్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ ధాటిగా పరుగులు చేయడంతో బెంగుళూరు 192  పరుగులు రాబట్టింది. హైదరాబాద్ బౌలర్లలో జగదీశ సుచిత్ రెండు; కార్తీక్ త్యాగి ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ స్కోరు మొదలు కాకముందే రెండు వికెట్లు పోగొట్టుకుంది. గ్లెన్ మాక్స్ వెల్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే కేన్ విలియమ్సన్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా బౌల్డ్ అయి వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి ఒక్కడే ఫర్వాలేదనిపించాడు, 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఏడెన్ మార్క్రమ్-21; నికోలస్ పూరన్-19 పరుగులు చేశారు. శశాంక్ సింగ్-8; భువీ-8; జగదీశ సుచిత్-2 మాత్రమే చేయగా; కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ డకౌట్ గా పెవిలియన్ చేరారు. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 125 పరుగులకు హైదరాబాద్ ఆలౌట్ అయ్యింది.

గత మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో భారీ ఓటమి పాలైన బెంగుళూరు నేడు ప్రతీకారం తీర్చుకుంది.

బెంగుళూరు బౌలర్లలో హసరంగ ఐదు; జోస్ హాజెల్ వుడ్ రెండు; మాక్స్ వెల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

వానిందు హసరంగ కు ‘ మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : పంజాబ్ పై రాజస్థాన్ విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్