Karnamrutham: వేదాలను పరిష్కరించడంతో పాటు పద్దెనిమిది పురాణాలు, భారతం రాశాక…వ్యాసుడిలో ఇంకా ఏదో వెలితి ఉంది. ఆ వెలితి ఏమిటో తనకు తాను కనుక్కోలేకపోయాడు. నారదుడు వ్యాసుడి బాధను అర్థం చేసుకుని…భాగవతం రాయి…నీ వెలితి మాయమై…నీ రచన పూర్ణమై…నీ రాతలకు సిద్ధి దశ వస్తుంది అంటాడు. అప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు.
భాగవతంలో వ్యాసుడు కృష్ణుడి గురించి గొప్పగానే చెప్పాడు. కానీ మన పోతన తెలుగు అనువాదంలో ఆ కృష్ణుడు మధుర బృందావన ద్వారకలను వదిలి మన తెలుగు పల్లెల్లోకి వచ్చేశాడు. మన పెరట్లో ఆవులను కట్టేశాడు. మన ఊరవతల చెరువుల్లో ఆవులకు కొబ్బరి పీచు పెట్టి స్నానాలు చేయించాడు. వేళ్ల సందుల్లో మన ఆవకాయ ముక్కలు పెట్టుకుని పెరుగన్నాలు తిన్నాడు. గోంగూర పచ్చడన్నం తింటూ మధ్యలో ఉల్లిపాయ ముక్క కొరుక్కుని తిన్నాడు. చివరకు పోతన ఇంట్లో పిల్లాడిలా ఆయన ఏమి చెప్తే అది చేస్తూ…ఆయన ఆడించిన ఆటల్లో ఆటగా, పాటగా, మాటగా ఉండిపోయాడు. ఆ రోజునుండి మధురాపురి కృష్ణుడు మృదు మధురమయిన తెలుగే మాట్లాడుతున్నాడు. పోతన పోతపోసిన తెలుగు కృష్ణుడి గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం.
ఇంతగా భాగవతంలో వ్యాసుడు కృష్ణుడి గురించి చెప్పినా…సంస్కృతంలో మరో ఇద్దరు వ్యాసుడి కంటే గొప్పగా చెప్పారేమో అనిపిస్తుంది. ఒకడు జయదేవుడు. మరొకడు లీలాశుకుడు. జయదేవుడి అష్టపదులు ఇష్టపదులై జనం నోళ్ళల్లో నానుతూ పునీతులను చేస్తున్నాయి. లీలాశుకుడి “కృష్ణకర్ణామృతం” పేరుకు తగినట్లు చెవులకు అమృతం. ఆ శ్లోకాలను మన వెలగపూడి వెంగనామాత్యుడు అంతే స్థాయిలో పద్యాల్లోకి అనువదించాడు. లీలాశుకుడు దాదాపు 700 సంవత్సరాల క్రితం కేరళలో జన్మించినవాడు. వెంగనామాత్యుడు దాదాపు 450 సంవత్సరాల కిందటివాడు. లీలాశుకుడే బిల్వమంగళుడని, అతను కృష్ణా ప్రాంతంలో పుట్టిన తెలుగువాడని ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. నా పరిమిత అవగాహన ప్రకారం లీలాశుకుడు కేరళలోనే జన్మించి ఉండాలి. జయదేవుడి తరువాతి వాడు. జయదేవుడి స్ఫూర్తిని అందుకుని…ఆ కృష్ణ మార్గంలో ఇంకా దూరం పయనించినవాడు. ఒక్కో శ్లోకం ఒక్కో కావ్యంతో సమానమయిన లీలాశుకుడి కృష్ణ కర్ణామృతం, నయనామృతం, హృదయామృతం మన ముందు ఉండగా...ఆయన పుట్టు పురోత్తరాల గురించి చరిత్రకారుల తేదీలు, దస్తావేజుల తర్జనభర్జనలు మనకెందుకు?
శబ్ద సౌందర్యం, శబ్ద లాలిత్యం, రచనా విన్యాసం, యతులు, ప్రాసలు, అల్లికలో చమత్కారం, కళ్ల ముందు కృష్ణుడు ఒక్కో శ్లోకం పాదంలో ఒక్కోలా కనిపించేలా ప్రత్యక్ష ప్రసార అక్షరాకృతులను సాహిత్యవేత్తలకు వదిలేద్దాం. లీలాశుకుడు పట్టుకున్న కృష్ణుడిని చూడాలంటే లీలాశుకుడి కళ్లతోనే పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆయన శ్లోకాల్లో కృష్ణ కథలు కొత్త పుంతలు తొక్కుతాయి. యుగాలు తడబడి విష్ణుడి అవతారాలు అటు ఇటు అవుతాయి. ఆయన సృష్టించిన పద చిత్రాలు, సన్నివేశాలు గొప్పవో! ఆయన వాడిన భాష గొప్పదో! తేల్చుకోలేక మనం ఉక్కిబిక్కిరి అయిపోతాం. మచ్చుకు ఆ వెన్న ముద్దలు కొన్ని-
కర్ణామృతం-1
గోపిక:-
ఎవరు నాయనా నువ్వు?
బాల కృష్ణుడు:-
బలరాముడి తమ్ముడిని(దెబ్బలు పడితే తోడు ఉండాలని ఆయన్ను కూడా లాగాడు)
ఇక్కడేమి పని? పైగా నా గుమ్మం మీద వెన్న కుండలో చెయ్యి పెట్టి ఉన్నావు?
ఊరుకోమ్మా! నోరు పెద్దది చేసుకుని అరవకు. మా చిన్ని తెల్ల దూడ గుంపులో నుండి తప్పి పొతే…తెల్లగా కనిపిస్తే…కుండలో చెయి పెట్టి వెతుకుతున్నా… నువ్వరిస్తే దూడ బెదిరి పారిపోతుంది.
ఓర్నాయనోయ్! ఏమి బరితెగింపు పిల్లాడమ్మా! ఎన్నడూ కానమమ్మ ఇటువంటి శిశువు…అని గోపిక కళ్లప్పగించి కృష్ణుడినే చూస్తూ ఉంటే…ఆ కొంటె కృష్ణుడు వెన్న ముద్ద నోట్లో పెట్టుకుని…వెళుతూ వెళుతూ ఆ గోపిక మొహానికి కూడా వెన్న పూశాడు. అటువంటి వేళ కృష్ణుడికి నా నమస్కారం.
కర్ణామృతం-2
యశోద:-
నాయనా! నీ అల్లరి భరించలేకుండా ఉన్నాను. రాత్రిళ్లు బూచాళ్లు వస్తారు. పట్టుకుపొమ్మంటాను.
బాల కృష్ణుడు:-
భుజాల దాకా ఉన్న చిక్కటి నల్లటి వెంట్రుకలను మొహం మీద వేసుకుంటూ…అమ్మా! చీకటిగా ఉంది. బూచాడు పట్టుకుపోతాడా ఇప్పుడు నన్ను?
పిచ్చి పిల్లాడు…ఇంత అమాయకంగా ఉన్నాడు. రేప్పొద్దున ఈ పాడులోకంలో ఎలా నెగ్గుకు వస్తాడో ఏమో! అని యశోద దిగులుపడుతున్న వేళ వెంట్రుకల చాటున నవ్వే కళ్లతో ఉన్న కృష్ణుడికి నా నమస్కారం.
కర్ణామృతం-3
బాల కృష్ణుడు:-
అమ్మా! నువ్ కథ చెప్తూ జోకొడితేనే పడుకుంటాను.
యశోద:-
సరే అలాగే. కళ్లు మూసుకో. త్వరగా పడుకో. ఇప్పటికే బాగా పొద్దు పోయింది. అనగనగా అయోధ్య. రాజు దశరథుడు. ఆయన కొడుకు పితృవాక్య పరిపాలనలో భాగంగా సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. అడవిలో రావణుడు సీతమ్మను అపహరించి…తీసుకెళ్లాడు.
అంతే….
కృష్ణుడు….ఉలిక్కి పడి లేచి…లక్ష్మణా ధనుస్సు, ధనుస్సు అందుకో… అని గట్టిగా అరిచాడు.
నిద్రలో మావాడికేదో పీడకల వచ్చినట్లుంది…అని దిష్టి తీసి…థూ థూ అని ఉమ్మి…చేతులు కాళ్లు కడుక్కుని వచ్చి…మళ్లీ జోకొట్టి నిద్రపుచ్చింది. త్రేతా- ద్వాపర రెండు యుగాల్లో, రెండు అవతారాల్లో ఒకడే అయిన అవతార పురుషుడికి నా నమస్కారం.
కర్ణామృతం-4
బృందావనంలో సాయం సంధ్య. చుట్టూ జనం కేరింతలు. కోలాటాలు. చప్పట్లు. ఈలలు. హర్షధ్వానాలు. మొదట కృష్ణుడు ఒకడే వచ్చాడు. వేనవేల గోపికలు. నెమ్మదిగా కృష్ణుడి నాట్య వేగం పెరిగింది. అంతే చూసే వారి కన్నుల పంట అయ్యింది. గోపికకు గోపికకు మధ్య కృష్ణుడు. కృష్ణుడికి కృష్ణుడికి మధ్య గోపికలు. చివరకు గుండ్రంగా వేగంగా తిరుగుతుంటే అందరూ కృష్ణులే. అంతా కృష్ణమయం. అలాంటివేళ బృందావన నాట్య కృష్ణుడికి నా నమస్కారం.
కర్ణామృతం-5
బృందావనంలో పక్షులు గూళ్లకు వెళ్లే వేళయ్యింది. యమున ఒడ్డుకు మేతకు వెళ్లిన ఆవులన్నీ ఇళ్లకు వస్తున్నాయి. ఒకే క్షణంలో ప్రతి ఇంటి పెరట్లో ప్రతి ఆవును కృష్ణుడే తాళ్లతో కడుతున్నాడు. ఒళ్లంతా గోధూళి. చేతిలో చెర్నాకోల. బొడ్లో దోపుకున్న వేణువు. బట్టలంతా బురదమయం. అలాంటివేళ కృష్ణుడికి నా నమస్కారం.
ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని శ్లోకాలు, వాటి తెలుగు పద్యానువాదాలు:-
లీలాశుకుడి శ్లోకం-1
అంగ నామంగ నామంతరే మాధవో
మాధవం మాధవం చాంతరేణాంగనా
ఇద్ధమాకల్పితే మండ లేమధ్యగ
స్సంజగౌవేణునా దేవకీనందనః
వెలగపూడి వెంగనామాత్యుడి తెలుగు అనువాద పద్యం :-
ఇరు దెసదానునిల్చిదనకింతులు పార్శ్వములన్వసింపగా
గరములు గంఠపాళిజెలగన్ బలభిన్మణివిద్రుమంబులన్
సర మొనరించినట్లు సరసస్థితి మండల మధ్యవర్తియై
మురళిరవంబునం జెలగు మోహనమూర్తిమురారిగొల్చెదన్
శ్లోకం-2
గోధూళిధూసరితకోమలగోప వేషం
గోపాల బాలకశ తైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహమ్పశుబంధనార్ధం గచ్ఛంతమచ్యుతశిశుం ప్రణతోస్మినిత్యం
పద్యం:-
గోపదధూళిధూసరిత కోమల వేషముతోడసం దెలం
గోపక శాబకాళితనకుం గయిదోడుగ నింట నింటనుం
గ్రేపుల గట్టగా దిరుగు కృష్ణుని దామక రాభిశోభితున్ గోపకుమారునిదుంవదనున్మదనుంనయ్య గొల్చెదన్
శ్లోకం-3
రామో నామ బభూవ, హుం, తదబలా సీతేతి, హుం, తౌ పితుః
వాచా పంచవటీ తటే విహరతస్తస్వాహరద్రావణ:
నిద్రార్ధం జననీ కధామితి హరే: హుంకారతః శ్రుణ్వతః
స్సౌమిత్రైకధను ర్ధను ర్ధను” రితి వ్యగ్రాః గిరః పాతు నః
పద్యం:-
ఇలలో రాఘవుడొప్పువాని సతియయ్యెన్ సీతవారిన్వనం బులకుంబంచె గురుఁడటంచు నిదురంబొందించునయ్యంబ
పల్కులు దానూకొని రావణుండు మహిజన్ గొంపోయెనానుల్కి
ల్విలు దేలక్ష్మణయంచుబల్కు హరి యు ద్వేలో క్తినన్ బ్రోవుతన్ .
లీలాశుకుడు దర్శించి…పట్టుకున్న కృష్ణుడిని…వెలగపూడి వెంగనామాత్యుడు వదలకుండా పట్టుకుని తెలుగు పద్యాల్లో బంధించాడు. కృష్ణాష్టమి సందర్భంగా మనం కూడా వారిలానే కృష్ణుడిని ముద్దు చేస్తూ మురిసిపోదాం. ఆ అల్లరిని పల్లవులుగా పరవశించి పాడుకుందాం. ఆ చరణాలే శరణమంటూ పట్టుకుందాం. ఆ కృష్ణకర్ణామృతాన్నే చెవుల్లో నింపుకుందాం. గుండెల్లోకి ఒంపుకుందాం.
“కృష్ణం వందే జగద్గురుం”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018