Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబుల్లెట్ ఆటాడిస్తా పా...!

బుల్లెట్ ఆటాడిస్తా పా…!

Game with Gun: “శాస్త్రమెప్పుడూ నిష్కర్షగా, కర్కషంగానే చెబుతుంది. మనమందులో సారాన్నే గ్రహించాలి…”
అని మాయాబజార్లో పింగళి వేదవాక్కు.

1. ఒక మంత్రి పోలీసు తుపాకీ చేతబట్టి కాల్చవచ్చా?

2. అందులో ఉత్తుత్తి రబ్బరు బుల్లెట్ ఉంటే ఎవరయినా కాల్చవచ్చా?

3. ఒక ఎస్ పి ఎవరి చేతికయినా తుపాకీ ఇచ్చి కాల్పించవచ్చా?

4. ఎవరయినా తుపాకీ కాల్చవచ్చు అనుకుంటే…పోలీసులకు మాత్రమే తుపాకీ కాల్చడంలో ప్రత్యేక శిక్షణ ఎందుకు?

5. ఆటల్లో ప్రారంభ సూచకంగా కాల్చే తుపాకీ గురి తప్పి గుండు ఎవరి గుండెల్లోనో గుచ్చుకుంటే జనం గతేమి కాను?

6. తుపాకీ సాయం చేసిన ఎస్ పి ది తప్పా? కాదా?

7. మంత్రి సమర్థించుకున్నట్లు షూటింగ్ క్రీడా సంఘంలో పని చేసేవారు ఎవరయినా ఇలాగే రోడ్ల మీద కాల్పులు జరపడానికి అవకాశం ఉంటుందా?

8. మీడియా కోడై కూస్తున్నట్లు…అది రబ్బరు బుల్లెట్ కాక నిజం బుల్లెట్టేనా?

లాంటి న్యాయాన్యాల శాస్త్ర చర్చ రచ్చకే కానీ తర్కానికి నిలవదు.

ఎందుకంటే ఈ మంత్రి కాల్చడం తప్పో? ఒప్పో? తరువాత సంగతి. కాలిస్తే ఆట ఒక్కటే మొదలయ్యింది. అక్కడున్నవారి నూకలు మిగిలి ఉండడం వల్ల ఎవరి ప్రాణాలూ పోలేదు. ఎవరి ఒంట్లో తుపాకీ తూటాలు దిగలేదు.

అదే ఒక జూబ్లీ హిల్స్ లో ఒక నటుడు తుపాకీ పేలిస్తే ఒక నిర్మాత పొట్టలో తూటా దిగింది. ఆ నటుడికి ఏదో పిచ్చి సర్టిఫికేట్ ఇచ్చి రక్షించారు. ఆ నిర్మాత ఆ తూటాను భద్రంగా కడుపులోనే పెట్టుకుని కాపాడుకున్నట్లు ఉన్నాడు.

లోకంలో ఇలా ఎందరో పిచ్చివారు కాల్చిన తూటాలను ఎందరో పిచ్చి లేనివారు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ ఉండి ఉంటారు. పిచ్చివారి మీద లోకానికి అదొక అవ్యాజమయిన పిచ్చి ప్రేమ- అంతే.

మంత్రి చెబుతున్నట్లు-
షూటింగ్ క్రీడల సంఘంలో సభ్యుడయిన క్రీడా మంత్రి పోలీసు తుపాకీ తూటాలను పేల్చడం అంగీకారమే అయితే…
ఆరోగ్య మంత్రి డాక్టర్ కాకపోయినా…సర్జరీ కత్తి తీసుకుని రోగుల గుండెలు కోయవచ్చు.
విద్యా మంత్రికి అక్షరం ముక్క రాకపోయినా పి హెచ్ డి విద్యార్థులకు పాఠం చెప్పవచ్చు.
నీటిపారుదల మంత్రి ఇంజనీరు కాకపోయినా…బహుళార్థ సాధక భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టవచ్చు.
అంతరిక్ష పరిశోధనల సైన్స్ మంత్రి నిరక్షర కుక్షి అయినా శ్రీహరికోటలో రాకెట్లకు ద్రవ ఇంధనం నింపి, స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టి…వీలయితే అదే రాకెట్లో తనూ ప్రయాణించవచ్చు.

శాస్త్రమెప్పుడూ నిష్కర్షగా, కర్కషంగానే చెబుతుంది. దాని సారాన్ని ఈ మంత్రి గ్రహించినట్లు…మనం కూడా ఒడుపుగా గ్రహించాలి.

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా!
బుల్లెట్ దిగిందా? లేదా అన్నదే లెక్క!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

ఎన్నికల చుట్టూ రాజకీయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్