Friday, November 22, 2024

ధర్మపాలన

Rule of Law: వాల్మీకి రామాయణం కిష్కింధ కాండలో వాలి వధ, ఉత్తరకాండలో ఒక భిక్షువు- కుక్క సంవాదం…రెండు సందర్భాల్లో రాజు శిక్షించండం వల్ల పాపం పోతుందని ఒక ధర్మసూక్ష్మ విశ్లేషణ ఉంటుంది. వాలిని చంపకపోతే రాజుగా రాముడికి ధర్మపాలన చేయని దోషం అంటుకుంటుంది. రాజు చేతిలో శిక్ష అనుభవించాడు కాబట్టి వాలికి పాపం పోయి మోక్షం లభించింది. అలాగే ఉత్తరకాండలో ఒక భిక్షువు వీధిలో తన మానాన తనున్న ఒక కుక్కను అకారణంగా కొడతాడు. రక్తం కారుతూ ఆ కుక్క న్యాయం కోసం అయోధ్యలో రాముడి అంతః పురంలో ప్రజల వినతులు వినే చోటుకు వెళ్లి పంచాయతీ పెడుతుంది.

అకారణంగా కొట్టిన మాట నిజమే అని భిక్షువు నేరాన్ని అంగీకరించినా…చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, సన్యాసులు చేసిన మొదటి తప్పును మన్నించాలని న్యాయపరిషత్- ఇప్పటి భాషలో కోర్టు ఫుల్ బెంచ్ అభిప్రాయపడింది. చేసిన నేరాన్ని అంగీకరించావు, భిక్షువు కాబట్టి మొదటి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నాం…జాగ్రత్త…ఇకపై సంయమనంతో ఉండు…పో…అంటాడు రాముడు. “రామ! రామ! నాకు శిక్ష వేయకపోతే నీమీద పాలనా దోషం పడుతుంది. పైగా నేను శిక్ష అనుభవించడం వల్ల…నా పాపం పోతుంది…” అని భిక్షువు ప్రాధేయపడతాడు. ఏ శిక్ష వేద్దాం? అని రాముడు కుక్కనే అడిగాడు. అయోధ్యలో ఏదయినా గుడికి ధర్మకర్తగా వేయండి స్వామీ! అని కుక్క విన్నవించుకుంది. రాముడు అలాగే చేశాడు.

(గుడికి ధర్మకర్త అంటే గొప్ప వరం కదా? శిక్ష ఎలా అవుతుంది? అని అనుకుంటాం. అక్కడ కుక్కగా ఉన్నది గత జన్మలో ధర్మకర్త హోదాలో గుడి నిర్వహణ వెలగబెట్టిన మనిషే. ఆ విషయం ఆ కుక్కకు తెలుసు. రాముడికి తెలుసు. వాల్మీకికి తెలుసు. మనకు తెలియాలనే ఈ కథను అంత విస్తారంగా వాల్మీకి రికార్డ్ చేశాడు.)

ఇందులో ధర్మ సూక్ష్మం ఏమిటంటే ఏదయినా తప్పు చేస్తే…ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తే ఆ అకౌంట్ సెటిలవుతుంది. పాపం మూట కట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్