అంతర్జాతీయ స్థాయి పేరు రావాల్సిన తెలుగు కార్టూనిస్ట్ సురేంద్ర హిందూ ఇంగ్లిష్ దినపత్రిక కోసం గీచిన ఒక కార్టూన్. ఒక పెద్ద టేబుల్. టేబుల్ మీద ఆ చివరనుండి ఈ చివరవరకు పొడుగాటి ఖడ్గం. అనేక పార్టీల ప్రతినిధుల గుంపు(మిత్రపక్షాలు/ప్రతిపక్షాలు) ఖడ్గం మొనదేలిన వైపు ఉంటారు. అధికారంలో ఉన్న ఒక పెద్దాయన(అధికార పక్షం) ఖడ్గం పిడికిలి వైపు ఉంటాడు. “Come this side. How beautiful this sword is? పిడికిలివైపు రండి…ఈ కత్తి ఎంత అందంగా ఉందో చూడండి!” అని హితవు చెబుతుంటాడు. ఆ కత్తిమీద ఆర్టికల్-356 అని రాసి ఉంటుంది.
ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా…అధికారంలో ఉన్నప్పుడు మరోలా ఉంటుందనడానికి; రాష్ట్రాల హక్కులను హరించే ఆర్టికల్-356 ను వ్యతిరేకించిన వ్యక్తే అధికారంలోకి రాగానే అదే ఆర్టికల్ కత్తి అందచందాలను వేనోళ్ళ పొగుడుతూ…అదే కత్తితో ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షాల గొంతు కూడా కోసే సందర్భానికి సురేంద్ర ఎక్కుపెట్టిన వ్యంగ్యచిత్రమది.
మన బాధలను పాటలుగా పాడుకుని మరచిపోవడం ఎలా అలవాటు చేసుకున్నామో అలాగే రాష్ట్రాల బాధలను ఇలాంటి వ్యంగ్యచిత్రాల్లో చూసుకుని మరచిపోవడం తప్ప కేంద్రం ముందు తల ఎత్తుకుని నిలిచే ఫెడరల్ నిజ స్ఫూర్తిలో, ఆదర్శంలో, స్వయం ప్రతిపత్తిలో లేము. ఎన్ టీ ఆర్ లాంటివారు “రాష్ట్రాలే సత్యం- దేశం మిథ్య” అని ఎన్నోసార్లు అన్నా…అది డైలాగ్ గా ప్రచారానికి పనికివచ్చిందే తప్ప…ఆచరణలో “దేశమే సత్యం- రాష్ట్రం మిథ్య” అవుతోంది!
ఒక సంవత్సరంలో ఒక్కో రాష్ట్రంలో ఎంత జి ఎస్ టీ వసూలు అవుతుంది? అందులో రాజ్యాంగ విహిత ధర్మం ప్రకారం రాష్ట్రానికి ఎంత రావాల్సి ఉంటుంది? ఎంత వస్తోంది? ఆ బకాయిలకోసం కేంద్రం దగ్గర రాష్ట్రాలు అక్షరాలా ఎందుకు అడుక్కోవాల్సి వస్తోంది? అన్న ఒక్క విషయం లోతుల్లోకి వెళితే గుండె తరుక్కుపోతుంది. నిజానికి రాష్ట్రం లేకపోతే దేశమే లేదు. దిశ ఉన్నది దేశం అని వ్యుత్పత్తి అర్థం.
ప్రాంతీయ పార్టీల అధినేతలు కేసుల్లో ఇరుక్కోవడం; లేదా ప్రాంతీయ పార్టీల అధినేతల మీద కేంద్ర వ్యవస్థలను ఉసిగొల్పి…కేసుల్లో ఇరికించడం ఆధునిక యుగధర్మంగా చలామణి అవుతోంది. దాంతో రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రం ముందు తొడగొట్టి…పోరాడేవారు లేని కాలాలు వచ్చాయి. అమావాస్యకో, పున్నమికో ఎవరైనా నోరు విప్పితే…వారి నోరు ఎలా మూయించాలో తెలిసిన లౌక్యం రాజ్యమేలే రోజులు వచ్చాయి. ఇతరేతర భావోద్విగ్న విషయాలముందు రాష్ట్రాల హక్కులు దూదిపింజలై తేలిపోయే గాలివాటు రుతువులు వచ్చాయి.
ఝార్ఖండ్ రాష్ట్రం అక్షరాలా తరగని గని. బొగ్గు, ఇతర మైనింగ్ కార్యకలాపాలకు పెట్టింది పేరు. భారత కోల్ మైనింగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఝార్ఖండ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా లక్షా ముప్పయ్ ఆరు వేల కోట్ల రూపాయలు. కేంద్రాన్ని అడిగి…అడిగి…విసిగిపోయామని ఇక చట్టపరంగా ఆయా సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకోవడంలాంటి ప్రత్యక్ష చర్యలకు దిగుతామని శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్ ప్రకటించారు. ఇది జరిగే పని కాదని పాలు తాగే పసిపిల్లలకు కూడా తెలుసు. ఝార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రానికే లక్షన్నర కోట్లు కేంద్రం, కేంద్ర సంస్థలనుండి రావాల్సి ఉంటే…ఇక దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు ఎంతెంత రావాల్సి ఉంటుందో ఎవరికి వారు గూగులించి తెలుసుకోవచ్చు.
రాజ్యాంగంలో ఆదర్శాలకు మాటలు చాలవు. కానీ ఆచరణలో వాటి ప్రతిఫలాల గురించి చెప్పాలన్నా మాటలు చాలవు.